.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-242లో.. కన్నా మెకానిక్ షాపులో కేశవ, శైలు గొడవతో మొదలవుతుంది. ఇంట్లో నుంచి కన్నా తల్లి వెళ్లిపోయిందటగా అని షాపు కుర్రాడు అడిగితే, అవునని కేశవ చెప్తాడు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు. ఆ ఇంటికి రాబోయే కోడలిగా నాకు తెలుసుకునే హక్కు లేదా, చాలా రోజుల తర్వాత వచ్చిన కన్నా తల్లే రెండు రోజులు ఉండలేకపోయింది. నేను వస్తే నాకూ అదే పరిస్థితి వస్తుందా అంటూ శైలు గొడవపడి అలిగి వెళ్లిపోతుంది. మరోవైపు టీ షాపు దగ్గర నారాయణ, రమణయ్య గొడవపడతారు. దూల తీరిందా అంటూ రమణయ్య పాట పాడితే, ఎందుకంత సంతోషం మీ చెల్లి చచ్చిపోయిందా అంటూ నారాయణ కౌంటర్ వేస్తాడు. రెండో భార్య మళ్లీ ఇల్లు వదిలి వెళ్లిపోయిందట అని తెలిసి నారాయణ ఫీలై అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇంట్లో కన్నా గురించి మాధవ ఆందోళన చెందుతాడు. జమున ఎక్కడికెళ్లిందో తెలియదు, కన్నా వస్తే ఏం చెప్పాలని అనుకుంటాడు. అప్పుడే చక్రి, మహా వస్తే తుఫానుకు పిచ్చి మొక్క కొట్టుకొచ్చినట్టు వచ్చి వెళ్లిపోయింది. ఆమె ఇక తిరిగి రాదు అన్నట్టు మాట్లాడతారు. దీంతో మాధవకు అనుమానం వచ్చి ఆమె మళ్లీ రాదని మీకు అంత కచ్చితంగా ఎలా తెలుసు.. ఆమె ఎందుకు వెళ్లిపోయిందో మీకు తెలుసా అని అడుగుతాడు. అంతలోనే కన్నా అమ్మా అమ్మా అంటూ వచ్చి అమ్మ రాలేదా అని ఏడుస్తాడు. అందరు ఓదారుస్తుండగా నారాయణ రావడంతో నీ వల్లే నా తల్లి వెళ్లిపోయింది. వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి అంటూనే ఉన్నావ్, ఆమెను ఏం చేశావ్ చంపేశావా అంటూ కన్నా నారాయణ కాలర్ పట్టుకుని నిలదీస్తాడు. కేశవ కూడా మా అమ్మను కూడా ఈయనే చంపేశాడు. ఇప్పుడూ అదే చేసి ఉంటాడంటూ సపోర్ట్ చేస్తాడు. వెంటనే మహా జోక్యం చేసుకుని ఈ విషయంలో ఆయనకు సంబంధం లేదు. ఆయనను ఒక్క మాట అన్నా ఊరుకోను. తరిమేయాలని అనుకుంటే వచ్చిన మొదటి రోజే కత్తి పట్టుకుని వెంటపడేవాడు కదా అంటూ కన్నా, కేశవలను తిట్టి లోపలికి పంపిస్తుంది.
కానీ కన్నా మాత్రం ఇన్నేళ్ల తర్వాత వచ్చి కూడా నన్ను వదిలేసి ఎలా వెళ్తుంది. నేను రమ్మనలేదు కదా మీరే తీసుకొచ్చారంటూ లోపల ఏడుస్తూనే ఉంటాడు. దీంతో మహా బయటకు వెళ్లి తప్పు చేశానని.. జమునను తీసుకొచ్చి తప్పు చేశానని బాధపడుతుంది. చక్రి వచ్చి ఓదారుస్తూ ఈ విషయంలో నారాయణ చెప్పింది వినాల్సిందని.. ఆమె ఎలాంటిదో మొదటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడని అంటాడు. కన్నాను ఇలా చూడలేకపోతున్నానని మహా అనడంతో ఇద్దరు కలిసి వాడి మూడ్ బాగుచేయాలని ప్లాన్ చేస్తారు. లోపలికి వెళ్లి దువ్వెనను మైకులా పట్టుకుని చక్రి దారుణంగా పాట పాడతాడు. అయినా కన్నా నవ్వడు. దీంతో మహా ఓ గేమ్ పెడుతుంది. దువ్వెనను గోడ పక్కన పెట్టి చక్రిని ఓడిస్తుంది. షరతు ప్రకారం అందరు ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్తారు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తే వాళ్లతో చక్రి ఫ్లర్ట్ చేస్తుంటే మహా కాయిన్ కింద పడేసి చక్రి పైకి తీయబోతుంటే తన చున్నీ చింపి ప్యాంట్ చినిగినట్టు సౌండ్ వచ్చేలా చేస్తుంది. దెబ్బకు చక్రి పరువు పోయి షాక్ అవుతాడు. ఆ సీన్ చూసి కన్నా నవ్వుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

