
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 219 లో...మెకానిక్ షాప్ దగ్గర కేశవ్, శైలు గొడవపడుతుండగా చక్రి వచ్చి పెదరాయుడు తరహాలో తీర్పు ఇస్తాడు. పెళ్లి విషయంలో శైలూ చేసిన పని వల్ల అన్నయ్య జీవితం నాశనం అయ్యేదని కేశవ్ ఫైర్ అవుతాడు. తాను చేసింది తప్పేనని, ఇంటి పరిస్థితుల వల్ల అలా చెప్పాల్సి వచ్చిందని శైలూ సారీ చెప్తుంది. దీంతో జరిగిపోయిందేదో జరిగిపోయింది.. ఇక నుంచి కలిసిమెలిసి ఉండండి అని చక్రి సర్దిచెప్పి వెళ్లిపోతాడు.
ఇక గోపిక చక్రికి ఫోన్ చేసి బర్త్‌డే పార్టీకి రావాలని పిలుస్తుంది. తాను బిజీగా ఉన్నానని చక్రి తప్పించుకోవాలని చూసినా.. సాయంత్రం బర్త్‌డే పార్టీ ఉంది తప్పకుండా రావాలని గోపిక గట్టిగా చెప్తుంది. ఇంటికి వచ్చిన మహాను చక్రి ఉడికించడానికి.. మా గోపిక బర్త్‌డే, స్పెషల్ గా పిలిచింది.. మంచి గిఫ్ట్ తీసుకుని వెళ్తానంటూ ఫోజులు కొడతాడు. కొత్త షర్ట్ రెడీ చేసుకుని బయలుదేరబోతుండగా మహాకు కోపం వస్తుంది. కన్నా చూడకుండా కత్తెర తీసుకుని చక్రి రెడీ చేసుకున్న షర్ట్ గుండీలు మొత్తం పీకేస్తుంది. ఏం తెలియనట్లు మళ్లీ మడతపెట్టి పెట్టేస్తుంది.
గుండీలు తెగిపోయి ఉండడం చూసి ఎవరు చేశారురా ఈ పని అని చక్రి కన్నాను అడిగినా నాకేం తెలియదని కన్నా చెప్తాడు. దీంతో వేరే డ్రెస్ వేసుకుని చక్రి బర్త్‌డే పార్టీకి వెళ్తాడు. చక్రి కోసం ఎదురుచూస్తున్న గోపిక అతన్ని చూడగానే ఎంతో సంతోషిస్తుంది. గోపిక ఫ్రెండ్స్ అందరు గట్టిగా అరుస్తూ మీ కోసమే గోపిక ఎదురుచూస్తుందని.. మీ గురించి చాలా చెప్పిందని అనడంతో చక్రి గుండెల్లో దడ మొదలవుతుంది. కేక్ కట్ చేసి ముందుగా చక్రికే తినిపిస్తుంది గోపిక.
ఇదేంటి ఇలా ఇరుక్కుపోయానని చక్రి ఫీలవుతుండగానే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. చక్రి చేతిలో ఉన్న గులాబీ పువ్వును గోపిక తీసుకోవడంతో గోపిక ఫ్రెండ్స్ చక్రి గోపికకు ప్రపోజ్ చేశాడంటూ గట్టిగా అరవడం మొదలుపెడతారు. దీంతో చక్రికి ఏం చేయాలో అర్థంకాక చిక్కుల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






