Home

»

Tv News

ఏళ్ల తర్వాత మళ్లీ మొదలైన స్నేహం.. ‘నా ఫ్రెండ్ చారు’ సీరియల్ ప్రోమో అదుర్స్

Oct 8, 2026 2:19PM


బుల్లితెరపై ఎన్నో రకాల సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా లవ్ స్టోరీస్‌తో వచ్చే సీరియల్స్‌కు మంచి ఆదరణ ఉంటుంది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా  స్నేహాన్ని ప్రధానంగా చేసుకుని ఓ సరికొత్త కథతో  ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది జెమినీ టీవీ. చిన్ననాటి స్నేహాన్ని, ఆ రోజుల్లోని జ్ఞాపకాలను గుర్తుచేస్తూ తెరకెక్కిన  ‘నా ఫ్రెండ్ చారు’  అనే కొత్త సీరియల్ త్వరలో ఆడియన్స్  ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సీరియల్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే చిన్ననాటి స్నేహం, పాత జ్ఞాపకాలు, భావోద్వేగాలతో కూడిన కథగా  ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

 “చెరిగిపోని చిన్ననాటి బంధాన్ని మళ్లీ గుర్తుచేసుకుంటూ... పాత స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక సరికొత్త కథ!”** అంటూ ఈ సీరియల్‌ను పరిచయం చేశారు. ఇక సీరియల్ ఇంట్రో కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.

 “25 వర్షాకాలాలు గడిచాయి. ఈరోజు అదే స్కూల్‌కి తిరిగి వెళ్తున్నాను. ఎన్ని వర్షాలు కురిసినా జ్ఞాపకాలు చెదిరిపోలేదు. కానీ చిరునామా తప్పిపోయింది. అవే నవ్వులు, అల్లరి కలిసి నడిచిన మెట్లు, అదే గోడ. ఆ గోడకు మాటలు వచ్చి ఉంటే తన పేరే చెప్పేది. అదే కిటికీని మాట్లాడిస్తే తన పేరే వినిపించేది. కొన్ని స్నేహాలు చెట్టు మీద చెక్కిన పేర్ల లాంటివి. పాతబడొచ్చు కానీ గుర్తుండకుండా పోవు.”  అంటూ సాగిన ఈ పరిచయం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. చిన్నతనంలో కలిసి చదువుకున్న స్నేహితులు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకోవడం, ఆ క్రమంలో వారి పాత జ్ఞాపకాలు, బంధాలు ఎలా బయటకు వస్తాయి అనే అంశాల చుట్టూ ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది.

ఈ సరికొత్త సీరియల్  ఈ నెల 20 నుంచి రాత్రి 9 గంటలకు సన్ జెమినీ టీవీలో  ప్రసారం కానుంది. దీంతో లవ్ స్టోరీస్‌కు భిన్నంగా స్నేహం, జ్ఞాపకాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ కథ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అంతేకాదు.. ఇదే కథ కన్నడలో కూడా ఇప్పటికే లాంచ్ అయింది. అక్కడ  ‘గలతి గాయత్రి’ పేరుతో ఈ సీరియల్ రూపొందింది. ఇందులో వైష్ణవి గౌడ, కృతిక రవీంద్ర, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మొత్తానికి 25 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహం.. మళ్లీ ఇప్పుడు ఎలా కలిసింది? చారు ఎవరు?   అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా ‘నా ఫ్రెండ్ చారు’ కథ ఉండబోతున్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com