
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 మూడో వారం లో మిథిలేష్ సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాడు. ఆ తర్వాత హౌస్ లో ఉన్నవాళ్ళలో.. ఝాన్సీ, త్రిగుణ్, చరణ్, అమన్ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో చివరకు వంశీ, వర్షిణి డేంజర్ జోన్‌లో మిగిలారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరు భావిస్తున్న సమయంలో నాగార్జున ముఖేష్‌కు ఊహించని ఆఫర్ ఇచ్చాడు. తన కెప్టెన్సీని వదులుకోవడంతో పాటు, తనకు వచ్చిన ఇమ్యూనిటీని కూడా వదులుకుని, వచ్చే వారం నేరుగా నామినేషన్స్‌లోకి వెళ్లేందుకు ఒప్పుకుంటే ఈ వారం ఎలిమినేషన్‌ను ఆపేస్తామని చెప్పాడు. ఎలాంటి ఆలోచన లేకుండా ముఖేష్ ఆ షరతులకు అంగీకరించడంతో వంశీ, వర్షిణి ఇద్దరు ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు.
ముఖేష్ తీసుకున్న నిర్ణయంపై ఇంటి సభ్యుల్లో భిన్నమైన స్పందనలు కనిపించాయి. ముఖ్యంగా వర్షిణి మాత్రం అతడి నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. తన కెప్టెన్సీని, ఇమ్యూనిటీని వదులుకోవడమే కాకుండా వచ్చే వారమే డైరెక్ట్ నామినేషన్‌లోకి వెళ్లేలా ముఖేష్ ఎందుకు అంగీకరించాడని ప్రశ్నించింది. మరోవైపు నాగార్జున ముఖేష్ కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను తీసుకుని అపూర్వకు ఇవ్వాలని చెప్పడంతో ఆమె కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. దీంతో ఒకవైపు ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ నుంచి బయటపడగా మరోవైపు ముఖేష్ తన కెప్టెన్సీని కోల్పోవాల్సి వచ్చింది.
ఎపిసోడ్ ముగిసే సమయంలో వచ్చే వారం గేమ్‌పై నాగార్జున ఆసక్తికరమైన హింట్ ఇచ్చాడు. వచ్చే వారం.. టోటల్ డామినేషన్ థీమ్‌తో గేమ్ సాగుతుందని వెల్లడించాడు. దీంతో ఇంటి సభ్యుల మధ్య పోటీ మరింత పెరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూపులు, వ్యక్తిగత విభేదాలు బయటపడుతున్న నేపథ్యంలో వచ్చే వారం డామినేషన్ టాస్కులు ఎలా ఉండబోతాయి, ముఖేష్ నామినేషన్‌లోకి వెళ్లిన తర్వాత తన గేమ్‌ను ఎలా కొనసాగిస్తాడు, కొత్త కెప్టెన్‌గా అపూర్వ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.






