.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -794 లో.... జ్యోత్స్న పీఏ పోస్ట్ కోసం సూరజ్ దగ్గరకు ఇంటర్వ్యూకి వెళ్తుంది. నీ గురించి చెప్పమని సూరజ్ అడగడంతో.. పసుపు కుంకుమలు ఇచ్చి సాగనంపాల్సిన పుట్టింటి వాళ్లే ప్రాణాలు తీయాలనుకుంటే వాళ్లకి దూరంగా బతుకుతున్న ఓ తల్లికి కూతుర్ని, ప్రతీకారం తీర్చుకుంటానని తల్లికి ఇచ్చిన మాట కోసం ఓ ఆడపిల్ల మనసుతో ఆడుకున్న ఓ మగాడికి ప్రేయసిని, మెడలో పడాల్సిన తాళి ఒడిలో పడితే చావుకి మించిన బాధ అనుభవించిన బాధితురాలిని, ప్రస్తుతం బతుకుతెరువు కోసం ఉద్యోగ వేటలో ఉన్న ఒక పేదింటి అమ్మాయిని అని తన బాధను చెప్తుంది. దానికి సూరజ్.. ఇంతకు మించి ఏం లేదా అని అడిగి, చివరికి.. యూ ఆర్ రిజెక్టెడ్, మీరు బయల్దేరొచ్చని తెగేసి చెప్తాడు.
రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటని జ్యోత్స్న నిలదీయడంతో మీకు అర్హత లేదు, నువ్వు ఈ పోస్ట్ కి పనికిరావని సూరజ్ అంటాడు. నేను సుమిత్ర కూతురిని అన్న కారణం తప్పించి రిజెక్ట్ చేయడానికి కారణమేంటో చెప్పండి.. మీరు ఇంటర్వ్యూ పెట్టింది పీఏగా సెలెక్ట్ చేయడానికా లేదా అవమానించడానికా అని జ్యోత్స్న అంటుంది. నాకు తెలుసురా.. కెఫేలో జాబ్ పోవడానికి మీ అమ్మ కారణం అయితే జాబ్ రాకముందే నువ్వు పోగొడుతున్నావు.. నేను పీఏగా వస్తే తట్టుకోలేవా అని జ్యోత్స్న సూరజ్ కి షాక్ ఇస్తుంది. తెలిసే వచ్చా.. నువ్వు రిజెక్ట్ చేస్తావని ఊహించానని చెప్పి వెళ్లిపోతుంది. బయట మాలిని ఆపి.. నా కొడుకు రిజెక్ట్ చేశాడంట.. మీ తాతకి సారీ చెప్పమను అనగా మా తాత సారీ చెప్పే పరిస్థితి లేదని జ్యోత్స్న తెగేసి చెప్తుంది. నా కొడుకు పర్సులో నువ్వు ఉన్నావ్ అన్నావ్ కానీ వాడి మనసులో నువ్వు లేవని మాలిని అనగా అత్తా నీ కొడుకు మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు.. నీ కొడుకుని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు.. నాతో మాట్లాడిన తర్వాత నీ కొడుకు మైండ్ చెదిరిపోయింది.. ఇంటర్వ్యూ జరగదని వెళ్లి అడుగని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుంది. మాలిని వెళ్లేసరికి సూరజ్ ఇంటర్వ్యూలు ఆపేయడంతో మాలిని షాక్ అవుతుంది.
మరోవైపు దీప, కార్తీక్ ఇద్దరు దశరథ్ దగ్గరకు వెళ్తారు. "నాన్న కాఫీ" అని దీప ఇస్తే "నాకీ కాఫీ వద్దమ్మా, ఈ కాఫీతో పాటు నాన్నా అన్న పిలుపు కూడా వద్దు, నేను ఒక చేతగాని కొడుకుని, చేతగాని భర్తని, చేతగాని తండ్రిని" అంటూ దశరథ్ ఎమోషనల్ అవుతాడు. తండ్రికి విశ్రాంతిని ఇచ్చి బాధ్యతలు చూసుకోవాల్సిన వయసులో తండ్రి కష్టపడతాను అంటే కాదని లేని స్థితిలో ఉన్న కొడుకుని.. నా తండ్రిలో పట్టుదల చావలేదు.. మళ్లీ జీవితాన్ని మొదలు పెడతాను అంటున్నాడు.. నన్ను కూడా వద్దన్నాడు.. తండ్రి అంటే అదేనమ్మా, నువ్వు తెచ్చి పెడితే నేను తింటాను అనాల్సిన వయసులో నీకెందుకురా నేను చూసుకుంటానులే అని మనల్ని ఇంకా చిన్నపిల్లల్లా చూసుకుంటున్నాడని బాధపడతాడు. జ్యోత్స్న నా కూతురు కాదు.. దాని వల్ల నాకు ఏ బాధ లేదు.. నువ్వు నాకు కన్న కూతురవి, నీ వల్లే ఈ బాధ అంతా.. తండ్రికి తలకొరివి పెట్టి బిడ్డలు ఋణాలు తీర్చుకుంటారు.. నువ్వు తలకొరివి పెట్టకుండానే ఋణం తీర్చేసుకున్నావమ్మా, నువ్వు నా కూతురివని నిజాన్ని దాచి నా కుటుంబాన్ని మోసం చేస్తున్నానని తల్చుకుంటే అది నాకు నరకమేనమ్మా అని దశరథ్ వెక్కి వెక్కి ఏడుస్తాడు. చేతకాని కూతురిలా మిగిలిపోయానని దీప ఏడుస్తుంది. మామయ్య ఈరోజు నీ కంటికి మేము స్వార్థపరుల్లా కనిపించినా మేము చేసినది అర్థమైన రోజున ముందుగా అభినందించేది నువ్వే అవుతావని కార్తీక్ అంటాడు.
ఇక శివన్నారాయణ, పారిజాతం టిఫిన్ బండి మొదలు పెడతారు. బండి ఓనర్ సత్తిబాబు వచ్చి..మీకు టిఫిన్ బండి నడపడం చేతకాదు, బోణీనే కాలేదంటూ వెటకారం చేస్తాడు. శివన్నారాయణ, పారిజాతం బాధగా ఇంటికి తిరిగి వస్తారు. జ్యోత్స్న కూడా ఇంటికి వచ్చి.. జాబ్ రాలేదని చెప్తుంది. ముగ్గురూ బేరం కూడా రాలేదని.. జాబ్ రాలేదని బాధపడతుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
