
బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. తాజాగా మంగళవారం నాటి ఎపిసోడ్-620 లో భావోద్వేగభరితమైన సన్నివేశాలతో పాటు కథలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దీప, కార్తీక్ మధ్య సాగిన సంభాషణలు ప్రేక్షకులను కన్నీరు పెట్టించేలా ఉన్నాయి. తమ మధ్య ఉన్న నిజాన్ని అత్తయ్య కాంచన తప్పుగా అర్థం చేసుకుంటుందని దీప తీవ్ర ఆవేదనకు లోనవుతుంది. ఒకవేళ నిజం తెలిస్తే ఆమె తట్టుకోలేదని, గతంలో తన భర్త విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆమె, ఇప్పుడు తనను కూడా దూరం పెడుతుందేమోనని భయపడుతుంది. అయితే కార్తీక్ మాత్రం దీపకు అండగా నిలబడి, ఏ పరిస్థితిలోనైనా తోడుంటానని ధైర్యం చెప్తాడు. ఈ క్రమంలో కార్తీక్‌ను హగ్ చేసుకుని దీప ఎమోషనల్ అవుతుంది.
మరోవైపు దశరథ్ గుడికి వెళ్తాడు. తన కుటుంబంలో సమస్యలు తీరాలని, ఎవరిని వదులుకోవడం ఇష్టం లేని దశరథ్ ఒక స్వామీజీని కలుస్తాడు. ఈ సమస్యకు పరిష్కారంగా హోమం జరిపించాలని ఆయన చెప్పగా ఈ విషయం ఎవరికీ తెలియకూడదని దశరథ్ రహస్యంగా ఉంచుతాడు. ఈ హోమం వల్ల కథలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక శ్రీధర్ ఇంట్లో దీప నిర్ణయంపై చర్చలు మొదలయ్యాయి. దీప బిడ్డను వద్దనుకోవడం వెనుక అసలు కారణం ఏంటని కావేరి ఆరా తీస్తుండగా, కార్తీక్ చేసే ప్రతీ పనిలో ఒక అర్థం ఉంటుందని కాశీ, స్వప్న సమర్థిస్తారు. కానీ శ్రీధర్ మాత్రం ఈ విషయంలో కాంచన దగ్గరకు వెళ్లి క్లారిటీ తీసుకోవాలని అనుకుంటాడు.
ఇదే సమయంలో జ్యోత్స్నకు దాస్ నుండి ఫోన్ వస్తుంది. తన తండ్రి గురించి తెలిసిన నిజాన్ని గుర్తుచేస్తూ, దీప జోలికి రావొద్దని జ్యోత్స్నని దాస్ హెచ్చరిస్తాడు. ఇది కథలో కొత్త ట్విస్ట్‌కు దారితీసింది. మరి దీప తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? దశరథ్ చేసే హోమం ఫలిస్తుందా అనేది రాబోయే ఎపిసోడ్లలో చూడాలి.







