
బిగ్ బాస్ సీజన్-10 తెలుగు ఏడో వారం కంటెస్టెంట్స్ మధ్య పోటీ తీవ్రంగా మారింది. ఎల్లో నుంచి గ్రీన్ కు వెళ్లే ప్రక్రియలో అసలు రచ్చ బరువులు మోసే కీలక టాస్క్ లోనే మొదలైంది. ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ముఖేష్ గౌడ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. బరువులు పెట్టేటప్పుడు వాటిని ఒకే వైపు (వన్ సైడ్) వేయాలని, అలా చేస్తే ప్రత్యర్థులు బ్యాలెన్స్ చేయలేక కిందపడతారని తన గ్రూప్ సభ్యులకు సలహా ఇచ్చాడు. ఈ ప్లాన్ ప్రకారమే సుధీర్ తదితరులు అమన్, శివ వంటి కంటెస్టెంట్లపై ఈ వ్యూహాన్ని అమలు చేశారు. అప్పటికే దాదాపు 30 కేజీలకు పైగా బరువును మోస్తూ శివ సుదీర్ఘ పోరాటం చేసినప్పటికీ, ఈ టార్గెటెడ్ స్ట్రాటజీ కారణంగా బ్యాలెన్స్ తప్పి చివరికి గేమ్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. హౌస్ మొత్తం శివ పట్టుదలను మెచ్చుకుంది.
అయితే ట్విస్ట్ ఏమిటంటే, ముఖేష్ టీమ్ ఏ వ్యూహాన్నైతే అమలు చేసిందో, సరిగ్గా అదే పద్ధతిని శివ కూడా తన టర్న్ వచ్చినప్పుడు ఫాలో అయ్యాడు. ముఖేష్ వైపు బరువులు వేసేటప్పుడు మొత్తం ఒకే వైపునకు బ్యాగ్ లను అమర్చాడు. దీనికి ముఖేష్ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయి శివపై విరుచుకుపడ్డాడు.
దీంతో హౌస్ లో పెద్ద గొడవకు దారి తీసింది. ముఖేష్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. తను చేస్తే వ్యూహం, ఎదుటివారు అదే చేస్తే తప్పు అంటారా అని నెటిజన్లు, మిగతా కంటెస్టెంట్లు ప్రశ్నిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఆట మరింత రక్తికడుతుండగా ముఖేష్ వర్సెస్ శివ గొడవ నెక్స్ట్ ఎపిసోడ్ కు హైలైట్ గా మారింది.





.webp)
