
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన డిఫరెంట్ సినిమా సెలెక్షన్లతో టాలీవుడ్ రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఆగస్టు 7న 'కొరియన్ కనకరాజు' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'తెలుగువన్'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
రీసెంట్ గా 'కొరియన్ కనకరాజు' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకకు వరుణ్ చేతిలో కర్ర పట్టుకుని రావడంతో అభిమానుల్లో రకరకాల అనుమానాలు, ఆందోళనలు మొదలయ్యాయి. అసలు ఆయనకి ఏమైంది? షూటింగ్ సెట్ లో ఏదైనా సీరియస్ ప్రమాదం జరిగిందా? అనే ప్రశ్నలకు స్పందిస్తూ, తాను తన తదుపరి చిత్రం 'బరి' కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాంగ్ ల్యాండింగ్ అవ్వడం వల్ల మోకాలికి గాయమైందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు. సినిమా క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టే వరుణ్ తేజ్, ఈ ఇంజరీని కూడా లెక్కచేయకుండా ప్రమోషన్లలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
'కొరియన్ కనకరాజు' మూవీ ఒక అవుట్ అండ్ అవుట్ హారర్ కామెడీ ఫిల్మ్ అని, అయితే ఇందులో భయం కంటే హాస్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని వరుణ్ తేజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లా పెనుగొండ సమీపంలో ఉన్న కియా మోటార్స్ (KIA Motors) ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. అక్కడ వందలాది మంది కొరియన్ నిపుణులు పనిచేస్తుండటం, వారి సంస్కృతి, కొరియన్ రెస్టారెంట్లు స్థానికంగా ఉండటం ఈ కథకు ప్రధాన ప్రేరణగా నిలిచింది.
ఒక తెలుగు ప్రాంతంలో కొరియన్ దెయ్యం ప్రవేశిస్తే ఎలాంటి హాస్యస్పదమైన పరిస్థితులు ఎదురవుతాయో డైరెక్టర్ చాలా ఆర్గానిక్ గా, హిలేరియస్ గా మలిచారని చెప్పారు. షూటింగ్ కోసం చిత్రయూనిట్ దాదాపు 15 నుండి 16 రోజుల పాటు విదేశాల్లో షెడ్యూల్ నిర్వహించింది. యాక్షన్ సీన్స్ ను కజకిస్తాన్ లో చిత్రీకరించగా, మిగిలిన ప్రధాన అవుట్ డోర్ సీన్లను సౌత్ కొరియాలోని జేజూ ఐలాండ్స్ లో షూట్ చేయడం విశేషం.
వ్యక్తిగత జీవితంలో కూడా వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎంతో సంతోషకరమైన ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఆయన తండ్రిగా ప్రమోషన్ పొంది, తన కుమారుడికి 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు. ప్రమోషన్లలో లేట్ నైట్ పడుకున్నప్పటికీ, ప్రతిరోజూ ఉదయం 5:00 గంటలకే తన కొడుకు లేపి ఆడుకుంటాడని, ఆ చిన్నారి నవ్వులు చూడగానే రోజంతా ఉన్న అలసట మాయమవుతుందని ఎమోషనల్ గా పంచుకున్నారు. అలాగే సతీమణి లావణ్య త్రిపాఠి తనకు బిగ్గెస్ట్ సపోర్టర్ గా ఉండటమే కాకుండా సరైన సమయంలో నిష్పాక్షికమైన విమర్శకురాలిగా మార్గదర్శనం చేస్తుందని వివరించారు. మరోవైపు చెల్లి నిహారిక కొనిదెల ప్రొడక్షన్ లో నేషనల్ అవార్డు సాధించడం, మెగా ఫ్యామిలీలో వరుస విజయాలు రావడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
చిత్ర పరిశ్రమలో 2014 డిసెంబర్ లో వచ్చిన 'ముకుంద' సినిమాతో ప్రారంభమైన తన 12 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో మార్పులు వచ్చాయని వరుణ్ విశ్లేషించారు. 'కంచె' వంటి జాతీయ అవార్డు పొందిన చిత్రం తనకు నటుడిగా ఎంతో సంతృప్తినిచ్చిందని, అయితే 'గద్దలకొండ గణేష్' చేసే సమయంలో విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ వద్దని కొందరు వారించినా, తన నమ్మకంతో ముందుకు వెళ్లి విజయం సాధించానని గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం పిఆర్ వరల్డ్, సోషల్ మీడియా అల్గారిథమ్స్, ప్రమోషన్ల ట్రెండ్ గణనీయంగా మారాయని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే కాన్సెప్ట్ తో పాటు ప్రచారంలో కూడా ఇన్నోవేటివ్ ఆలోచనలు అవసరమని అభిప్రాయపడ్డారు. పెద్దనాన్న చిరంజీవి గారి నుండి వేగంగా సినిమాలు చేయడం, బాబాయ్ పవన్ కళ్యాణ్, చరణ్ ల నుండి డెడికేషన్ నేర్చుకుంటున్నట్లు వరుణ్ తెలిపారు.
Varun Tej, Interview, Korean Kanakaraju, Chiranjeevi, Pawan Kalyan





