Home

»

Exclusive Movie News

సూర్యకాంతం గురించి ఎవరికీ తెలియని నిజాలు: కొడుకు, కోడలు సంచలన ఇంటర్వ్యూ.!

Nov 1, 2026 9:42AM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'గయ్యాలి అత్త' అనగానే టక్కున గుర్తువచ్చే దిగ్గజ నటి సూర్యకాంతం. తెరపై ఆమె ఎంతటి భయంకరమైన అత్త పాత్రలు పోషించి ప్రేక్షకులను ముప్పతిప్పలు పెట్టారో, నిజ జీవితంలో ఆమె అంతకంటే ఎంతో ఉన్నతమైన మనసున్న మనిషి అని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. తాజాగా 'తెలుగువన్' ఛానెల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సూర్యకాంతం దత్తపుత్రుడు పద్మనాభ మూర్తి, కోడలు ఈశ్వరి రాణి, మనవరాలు పాల్గొని ఆమెతో ఉన్న అపురూప జ్ఞాపకాలను పంచుకున్నారు.

తెరపై ఎంతటి గయ్యాలి అత్తగా, కోడళ్లను ముప్పతిప్పలు పెట్టే కఠినమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారో, నిజ జీవితంలో ఆమె అత్యంత క్రమశిక్షణ గల వ్యక్తిగా, విశాల హృదయం ఉన్న మహిళగా జీవించారని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు. నన్ను కోడలిగా కాదు, కూతురిలా చూసుకున్నారని కోడలు చెప్పడం విశేషం. సూర్యకాంతం గారు అద్భుతంగా వంట చేసేవారని, నాకు కూడా ఎంతో ఇష్టంగా వంట చేసి పెట్టేవారని కోడలు చెప్పారు.

చిన్నతనంలోనే ఆమె తన అక్కగారి కుమారుడైన పద్మనాభ మూర్తిని దత్తత తీసుకుని ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించేవారని కుమారుడు తెలిపారు. అమ్మతో కలిసి షూటింగ్ లకు వెళ్ళేవాడినని గుర్తు చేసుకున్నారు. 

ఒకసారి రావణుడి గెటప్ లో ఎన్టీఆర్ ను చూసి.. ఈయనకు ఏంటి పది తలకాయలు ఉన్నాయి అనుకున్నాను. అప్పుడు ఎన్టీఆర్ నన్ను దగ్గరకు తీసుకొని ఆ పాత్ర గురించి వివరించారు. ఎన్టీఆర్ గారు అందరిని గౌరవించి మాట్లాడేవారు. ఆయన నుంచి నేను ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాను అని మూర్తి తెలిపారు.

హీరోయిన్‌గా కాకుండా చిన్న వయసులోనే అత్త పాత్రలను ఎంచుకోవడం వెనుక ఆమె దూరదృష్టి ఉందని, ఆ నిర్ణయమే ఆమె కెరీర్‌ను శిఖరాగ్రానికి చేర్చిందని కొడుకు పద్మనాభ మూర్తి తెలిపారు. 1984 వరకు ఆమె వరుస చిత్రాలతో ఇండస్ట్రీలో ఏకచక్రాధిపతిలా చిత్రసీమను ఏలేలా చేసిందని కొనియాడారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజ నటులతో సూర్యకాంతం అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు. 'గుండమ్మ కథ' షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తనతో సరదాగా చేసే మ్యాజిక్‌లు, అప్పట్లో సెట్స్‌లో జరిగిన ఆసక్తికర సంఘటనలను పద్మనాభ మూర్తి నెమరువేసుకున్నారు. అలాగే బాపు-రమణ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో ఆమె పాత్రల ప్రత్యేకతను, 'మూగ మనసులు' చిత్రంలోని మరపురాని సన్నివేశాలను గురించి ముచ్చటించారు.

తరాలు మారుతున్నా సూర్యకాంతంపై ప్రేక్షకులు చూపుతున్న అభిమానం చిరస్మరణీయమని, ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. నేటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

Click Here To Watch Full Interview

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com