Home

»

Exclusive Movie News

ఎన్టీఆర్ కెరీర్ టర్నింగ్ పాయింట్.. రీమేక్ సినిమాల వెనుక అసలు నిజం.!

Jul 17, 2026 3:23PM

తెలుగు సినీ చరిత్రలో నూతన శకానికి నాంది పలికిన మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR). పౌరాణిక, జానపద చిత్రాల ద్వారా అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న తరుణంలో ఎన్టీఆర్ కెరీర్‌లో రీమేక్ చిత్రాలు సరికొత్త టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి. ఆ రోజుల్లో హిందీలో అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా వంటి అగ్ర నటులు నటించిన పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా రీమేక్ చేసి ఎన్టీఆర్ తిరుగులేని విజయాలను అందుకున్నారు.

సుమారు 50 సంవత్సరాల క్రితం జూలై నెలలో విడుదలైన 'నేరం నాది కాదు ఆకలిది' అనే చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యంత వైవిధ్యమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. రవిచిత్ర బ్యానర్‌పై వై.వి.రావు నిర్మించిన ఈ చిత్రానికి రీమేక్ చిత్రాలపై బలమైన పట్టున్న ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించారు. నిజానికి ఇది 1974లో హిందీలో రాజేష్ ఖన్నా కథానాయకుడిగా వచ్చిన 'రోటీ' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. 'రోటీ' చిత్రానికి దేశాయ్ అనే రచయిత అద్భుతమైన కథను అందించగా, ప్రముఖ నటుడు ఖాదర్ ఖాన్ సంభాషణలు రాశారు. ఆ హక్కులను కొనుగోలు చేసి 1976 జూలైలో తెలుగు ప్రేక్షకుల ముందుకు 'నేరం నాది కాదు ఆకలిది' అనే టైటిల్‌తో తీసుకొచ్చారు. ఆ రోజుల్లో నేటిలాగా డిజిటల్ కంటెంట్ అందుబాటులో ఉండేది కాదు కాబట్టి, ఇతర భాషల చిత్రాలను చూడాలంటే బాంబే వరకూ వెళ్లాల్సి వచ్చేది. అందుకే ఒరిజినల్ సినిమాతో పోల్చి చూసే అవకాశం ప్రేక్షకులకు ఉండేది కాదు.

ఈ సినిమా కథాంశం ప్రేక్షకుల హృదయాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. సమాజంలో ఆకలి వల్ల ఒక యువకుడు ఎలా నేరస్థుడిగా మారాల్సి వచ్చింది? అనే ఆకలి విలువను చూపే పాయింట్‌ను ఎంతో ఎమోషనల్‌గా ఈ కథలో చూపించారు. సినిమాలో హీరో తన నేర ప్రవృత్తి కారణంగా అనుకోకుండా ఒక యువకుడిని (మురళీమోహన్ పాత్ర) చంపేస్తాడు. ఆ తర్వాత పశ్చాత్తాపంతో, ఆ యువకుడి కుటుంబానికి తానే పెద్ద కొడుకుగా మారి సాయం చేయడానికి వెళతాడు. అక్కడ ఆ ఊరిని వేధిస్తున్న దుర్మార్గుల నుండి గ్రామస్తులను కాపాడటమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. ఈ సినిమాలో బైబిల్, ఇస్లాం, హిందూ పౌరాణిక గాథలకు సంబంధించిన నైతిక విలువలను సీన్ల రూపంలో చొప్పించారు. ముఖ్యంగా నటి ప్రభపై దాడి జరిగే సమయంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి 'మంచిని సమాధి చేస్తారా' అనే సుప్రసిద్ధ గీతంతో బైబిల్ లోని 'పాపం చేయని వాడు మొదటి రాయి వేయాలి' అనే ప్రసిద్ధ వాక్యాన్ని సెంటిమెంట్‌కు జోడించి చూపించారు. ఈ ఒక్క సీన్ అప్పట్లో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ సినిమా కంటే ముందే రవిచిత్ర బ్యానర్ లో ఎన్టీఆర్‌కు 'నిప్పులాంటి మనిషి' (హిందీ చిత్రం 'జంజీర్' రీమేక్) రూపంలో ఒక మైలురాయి లాంటి విజయం లభించింది. ఆ తర్వాత 'యాదోం కీ బారాత్' చిత్రాన్ని 'అన్నదమ్ముల అనుబంధం'గా, అలాగే 'మా దైవం' వంటి విజయవంతమైన రీమేక్ చిత్రాలను ఎన్టీఆర్ అందించారు. ఈ రీమేక్ చిత్రాల ప్రభావం కేవలం తెలుగులోనే కాదు, తమిళ చిత్రసీమలోనూ కనిపించింది. తమిళ అగ్ర నటుడు ఎంజీఆర్ సైతం ఎన్టీఆర్ సినిమాల్లోని పాత్రల డిజైనింగ్ గమనించి, తమిళ రీమేక్ లలో నటించేవారు. ఉదాహరణకు 'నిప్పులాంటి మనిషి'లో ఎన్టీఆర్ పోషించిన యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రను, అలాగే సత్యనారాయణ పోషించిన పాత్రను కలిపి ఎంజీఆర్ తమిళ రీమేక్‌లో ద్విపాత్రాభినయం చేయడం విశేషం. దశాబ్దాలు గడిచినా ఎన్టీఆర్ నటించిన 'నేరం నాది కాదు ఆకలిది' చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తూనే ఉంది.

 

 

Sr NTR, Neram Nadi Kadu Akalidi, Nippulanti Manishi, Telugu Cinema, Tollywood

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com