Home

»

Exclusive Movie News

ఎన్టీఆర్ నన్ను అన్న మాటలు ఇంకా మర్చిపోలేదు.!

Aug 25, 2026 2:40PM

తెలుగు సినీ చరిత్రలో ఆల్‌టైమ్ క్లాసిక్ కామెడీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘యమగోల’ సినిమా వెనుక ఉన్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సీనియర్ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు ఇటీవల 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రముఖ రచయిత డి.వి. నరసరాజు యమగోల కథ లైన్ చెప్పినప్పుడు అది ఎంతగానో నచ్చడంతో, దాదాపు 2 నెలలు కష్టపడి పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ఈ కథను నటసార్వభౌమ ఎన్.టి. రామారావుకి వినిపించడం కోసం తెల్లవారుజామున 5 గంటలకే ఆయన నివాసానికి వెళ్లినట్లు అట్లూరి గుర్తుచేసుకున్నారు. డి.వి. నరసరాజుతో కలిసి వెళ్లి కథను వివరిస్తుంటే ఎన్టీఆర్ ఎంతో ఆస్వాదించారు. కథ పూర్తయ్యాక యముడి పాత్రకు ఎవరైతే బాగుంటారని ఎన్టీఆర్ ప్రశ్నించగా, నరసరాజు సమయస్ఫూర్తితో "పూర్ణచంద్రరావు గారి దృష్టిలో మీరే యముడండి" అని అనడంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

"నేను యముడిని అయితే.. మరి హీరో ఎవరు?" అని ఎన్టీఆర్ అడగగా.. బాలకృష్ణ పేరు చెప్పారు పూర్ణచంద్రరావు. దాంతో మరింత ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్.. "నన్ను బాలయ్య తిడుతుంటే జనం చూసి ఒప్పుకుంటారా?" అని ప్రశ్నించారు. తమిళ నటుడు శివాజీ గణేషన్ ని యముడిగా పెడదామని అట్లూరి అనగా, "ఆయన నాకంటే గొప్ప నటుడు, వచ్చి యముడి వేషం వేస్తాడా? నీకెందుకు వస్తాయి ఇలాంటి ఆలోచనలు" అని ఎన్టీఆర్ మందలిచ్చారు. చివరకు రెండు రోజుల ఆలోచన తర్వాత.. అప్పటికి ఎస్.వి. రంగారావు, ఆర్. నాగేశ్వరరావు గార్లు లేకపోవడంతో.. కైకాల సత్యనారాయణ సరైన ప్రత్యామ్నాయమని ఎన్టీఆర్ సూచించారు. కైకాల గారిని సెట్స్‌పైకి తెచ్చినప్పుడు 'ఏయ్ యముండా' అనే డైలాగ్ డెలివరీ రాకపోవడంతో, ఎన్టీఆర్ గారే స్వయంగా 5 నుండి 6 సార్లు రిహార్సల్స్ చేసి, బాడీ లాంగ్వేజ్ నేర్పించి ఆ సీన్‌ను పర్ఫెక్ట్‌గా రాబట్టారు.

అనంతరం ఈ చిత్రాన్ని ఎస్. వెంకటరత్నం, తాతినేని రామారావు, పూర్ణచంద్రరావు కలిసి జాయింట్ వెంచర్‌గా నిర్మించి తెలుగులో ఎపిక్ సక్సెస్ సాధించారు. కానీ, ఇదే కథను హిందీలో జితేంద్ర, ప్రేమనాథ్ కాంబినేషన్‌లో 'లోక్ పరలోక్' పేరుతో రీమేక్ చేసినప్పుడు నార్త్ ఇండియాలో అనుకోని వివాదం చెలరేగింది. ఉత్తర భారతదేశంలో యముడు, ఇంద్రుడికి గుళ్లు ఉన్నందున, వారిని హాస్య పాత్రలుగా చూపించారనే నెపంతో భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు సినిమాను తీవ్రంగా నిరసించి బ్యాన్ చేశాయి. దాంతో ఆ రీమేక్ హిందీ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా దెబ్బతిన్నది.

ఎలాంటి సినీ నేపథ్యం, ఆర్థిక మద్దతు లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టిన అట్లూరి పూర్ణచంద్రరావు, కేవలం తన స్వయంకృషి, క్రమశిక్షణతో ఏకంగా 9 భాషల్లో 87 సినిమాలు నిర్మించి రికార్డు సృష్టించారు. టాలీవుడ్‌లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవిలతో పాటు కోలీవుడ్‌లో శివాజీ గణేషన్, ఎంజీఆర్, కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్‌లతో సినిమాలు తీశారు. ముఖ్యంగా తమిళంలో అజిత్, విక్రమ్‌లకు తొలిసారి మేకప్ వేయించి కెమెరా ముందు నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. అంతేకాక బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర వంటి దిగ్గజాలతోనూ, మలయాళంలో మమ్ముట్టి, కన్నడలో రాజ్‌కుమార్, విష్ణువర్ధన్‌లతో చిత్రాలు నిర్మించి భారతీయ సినీ రంగానికి మరవలేని సేవలు అందించారు.

 

 

 

 

Atluri Purnachandra Rao, Interview, NTR, Yamagola

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com