
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్ లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి, 2026లోనే బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ గ్రాసర్ గా ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తున్నప్పటికీ.. సినిమాలో కొన్ని వివాదాస్పద సీన్లు, క్యారెక్టరైజేషన్లపై ఆడియన్స్ నుంచి కొంత నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన చిత్రబృందం ఇప్పుడు థియేటర్లలోకి సరికొత్త వర్షన్ ను తీసుకురావడానికి సిద్ధమైంది.
సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను ప్రొజెక్ట్ చేసిన విధానంపై, కొన్ని గ్లామర్ సీన్లపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడిచింది. ఆడియన్స్ కుటుంబ సమేతంగా చూడటానికి ఆ సీన్లు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవించే దర్శకుడు బుచ్చిబాబు సానా, వెంటనే ఈ విషయంలో దిద్దుబాటు చర్యలకు దిగారు. ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేసిన ఆ పర్టిక్యులర్ సీన్స్ అన్నింటినీ సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.
తాజా సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ సినిమాను మరింత ఆసక్తికరంగా, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా సరికొత్తగా రీ-ఎడిట్ చేశారు. జాన్వీ కపూర్ పై ఉన్న కొన్ని అభ్యంతరకర సీన్లతో పాటు, నటుడు దివ్యేందు చెప్పిన కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులను కూడా ఈ కొత్త వర్షన్ లో కట్ చేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే శివరాజ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు, బోమన్ ఇరానీలకు సంబంధించిన కొన్ని సీన్లను కూడా ట్రిమ్ చేశారట. వీటి స్థానంలో కొత్త సీన్లు యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్, జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలను యాడ్ చేసినట్లు సమాచారం.
ఈ కొత్త ఎడిటెడ్ వర్షన్ ను సెన్సార్ బోర్డు (CBFC) నుంచి మళ్లీ ఫ్రెష్ సర్టిఫికేషన్ కూడా పూర్తి చేశారని ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తోంది. ఈ సరికొత్త, క్లీన్ వర్షన్ ను శనివారం (జూన్ 13) నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారని వినికిడి. కలెక్షన్ల పరంగా ఇప్పటికే దూసుకుపోతున్న ఈ చిత్రం, ఈ తాజా మార్పులతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మరింత పెద్ద సంఖ్యలో థియేటర్లకు రప్పిస్తుందని డిస్ట్రిబ్యూటర్లు నమ్ముతున్నారు.
ఎలాంటి ఇగోస్ కి పోకుండా ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ ని గౌరవించి, సినిమా రిలీజ్ అయిన వారం రోజులకే సీన్లను ట్రిమ్ చేసి సరికొత్త వర్షన్ ను రిలీజ్ చేయడం టాలీవుడ్ లో ఒక సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పవచ్చు. మరి ఈ కొత్త వర్షన్ కి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.






