Home

»

Exclusive Movie News

'ఏమంటివి ఏమంటివి'.. ఆ క్లాసిక్ డైలాగ్ వెనుక ఉన్న ఆసక్తికర కథ మీకు తెలుసా?

Jul 7, 2026 2:25PM

తెలుగు చలనచిత్ర చరిత్రలోనే కాకుండా, యావత్ భారతీయ సినీ రంగంలోనే ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచిన పౌరాణిక చిత్రం 'దాన వీర శూర కర్ణ'. నందమూరి తారకరామారావు (NTR) దర్శకత్వంలో మూడు పాత్రలలో (కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడు) నటిస్తూ నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ క్లాసిక్స్‌లో అగ్రస్థానంలో ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని డైలాగులు, అందులోనూ దుర్యోధనుడి పాత్ర చెప్పే "ఏమంటివి ఏమంటివి.." అనే డైలాగ్ నేటికీ ప్రతీ తెలుగువాడి నోటా నానుతూనే ఉంది. ఈ ఐకానిక్ డైలాగ్ వెనుక ఉన్న అసలు కథను వివరిస్తూ తాజాగా 'తెలుగువన్ సినిమా'లో పోస్ట్ అయిన ప్రత్యేక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రచయిత, దర్శకుడు కనగాల జయకుమార్ ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ఒక సినిమాలో కర్ణుడిని పోలిన పాత్రకు మోదుకూరి జాన్సన్ రాసిన సంభాషణలను మెచ్చిన ఎన్టీఆర్.. తాను తీయబోయే 'దాన వీర శూర కర్ణ' సినిమాకు డైలాగ్స్ రాయాలని కోరారు. అయితే ఈ సినిమాకు తనకంటే మరో రచయిత న్యాయం చేయగలరని ఒక పేరుని సూచించారు జాన్సన్. ఆ రచయితే 'దాన వీర శూర కర్ణ' చిత్రానికి చరిత్రలో నిలిచిపోయే సంభాషణలు అందించారు.

ఈ చిత్రానికి పవర్‌ఫుల్ డైలాగులు అందించిన రచయిత మరెవరో కాదు.. గొప్ప సంస్కృతాంధ్ర పండితుడు, హేతువాది కొండవీటి వెంకటకవి. అయితే మొదట్లో ఈ సినిమాకు డైలాగులు రాయడానికి ఆయన అస్సలు ఒప్పుకోలేదట. ఒక సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, సినిమాలకు రాయడం తన వల్ల కాదని ఎన్టీఆర్ ప్రతిపాదనను తిరస్కరించారు. కానీ ఎన్టీఆర్ పట్టువదలకుండా స్వయంగా ఆయనతో మాట్లాడి, తన ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యతను వివరించి ఒప్పించారు. అలా తెలుగు సినీ రంగానికి ఒక అద్భుతమైన సాహితీ సంపద దక్కింది.

సాధారణంగా ఆ కాలంలో పౌరాణిక చిత్రాల్లో వాడుక భాషను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ కొండవీటి వెంకటకవి మాత్రం ఈ చిత్రానికి గ్రాంథిక భాషను, స్వచ్ఛమైన సాహిత్య శైలిని ఎంచుకున్నారు. ఆ భాషకు ఎన్టీఆర్ గంభీరమైన స్వరం, అద్భుతమైన ఉచ్ఛారణ తోడవ్వడంతో ప్రతీ సంభాషణ ఒక చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ఆడియో క్యాసెట్లు, ఎల్పీ రికార్డులు అప్పట్లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయి సంచలనం సృష్టించాయి. సినిమాతో సమానంగా కేవలం డైలాగుల క్యాసెట్లు అమ్ముడుపోవడం బహుశా భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే ప్రథమం కావచ్చు.

 

 

NTR, Daana Veera Soora Karna, DVS Karna, Emantivi Dialogue, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com