Home

»

Exclusive Movie News

ఇది అర్ధమైతే ఈ బ్రాహ్మణుడికి గుడి కట్టేస్తారు!

Jun 12, 2026 3:03PM

తెలుగు సినీ చరిత్రలో సామాజిక మార్పుకు, సాంప్రదాయాల వెనుక ఉన్న అసలైన అర్ధాన్ని ఆవిష్కరించిన అద్భుత దృశ్యకావ్యం 'సప్తపది' (Saptapadi). కళాతపస్వి కె. విశ్వనాథ్ (K Vishwanath) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం ఒక సినిమా కాదు, సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థపై, ఆచారాల పేరిట సాగే మూఢనమ్మకాలపై సంధించిన ఒక జ్ఞానాస్త్రం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి అయిన యాజులు (జె.వి. సోమయాజులు) తీసుకున్న ఒక సంచలన నిర్ణయం, దాని వెనుక ఆయన చేసిన శాస్త్ర విశ్లేషణ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. సర్వశాస్త్ర కోవిదుడైన ఒక సంప్రదాయ బ్రాహ్మణుడు, సమాజం విధించిన కట్టుబాట్లను దాటి మానవత్వమే పరమార్థమని చాటిచెప్పే ఘట్టం తెలుగు సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది. (J V Somayajulu)

అసలు పెళ్లి అంటే ఏమిటి, పెళ్లి మంత్రాలకు ఉన్న అసలైన అంతరార్థం ఏమిటి అనే ప్రశ్నలకు యాజులు ఇచ్చే వివరణ అద్భుతం. వివాహం అనేది కేవలం శోభనం ముందు జరిగే ఒక తంతు కాదు, రెండు మనసులను కలిపే ఒక పవిత్ర ఘట్టం. "అష్టవర్షా భవేత్ కన్యా పుత్రవత్ పాలితా మయా.. ఇదానీం తవ పుత్రస్య దత్తా స్నేహేన పాలితాం" అనే కన్యాదాత శ్లోకాన్ని ప్రస్తావిస్తూ, ఇన్నేళ్లు కొడుకులా పెంచుకున్న నా కూతుర్ని నీకు అప్పగిస్తున్నాను, మీరిద్దరూ స్నేహంగా, సఖ్యతగా ఉండాలని వరుడికి చెప్పడం దీని అంతరార్థం. సర్వదేవతల సాక్షిగా, అగ్ని సమక్షంలో ఆ స్నేహాన్ని కాపాడుతానని వరుడు ప్రమాణం చేస్తాడు. ఏ వివాహంలోనైతే ఆ స్నేహం, సఖ్యత లోపిస్తాయో, అక్కడ కేవలం తాళి కట్టిన పాపానికి ఒక పసిపిల్ల జీవితాన్ని కన్నవారి ఇంట్లో సమాధి చేయకూడదని ఆయన స్పష్టం చేస్తారు. మనసు కలవని నాడు ఆ మాంగల్య బంధానికి విలువ లేదని, అందుకే ఆమె మనసుకు నచ్చిన వ్యక్తికి అప్పగించడమే ధర్మమని ఆయన విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటారు.

ఈ క్రమంలో కులాల ప్రస్తావన వచ్చినప్పుడు యాజులు గారు భగవద్గీత, మనుస్మృతి ఆధారంగా చాతుర్వర్ణ వ్యవస్థపై ఉన్న అపోహలను పటాపంచలు చేస్తారు. భగవానుడు గీతలో "చాతుర్వర్ణం మయా సృష్టం" అని ఊరుకోలేదని, దాని పక్కనే "గుణ కర్మ విభాగశః" అని కూడా స్పష్టంగా చెప్పాడని గుర్తుచేస్తారు. అంటే, సమాజంలో వర్ణాలు అనేవి పుట్టుకను బట్టి కాదు, ఒక వ్యక్తి యొక్క గుణాలను, అతడు చేసే కర్మలను బట్టి ఏర్పడతాయి. "జన్మనా జాయతే శూద్రః సంస్కారా ద్విజరుచతి" అన్న మనువు సూక్తి ప్రకారం పుట్టుకతో ప్రతి ఒక్కరూ శూద్రులే, వారు పొందే సంస్కారాన్ని బట్టే ద్విజులుగా మారతారు. తన విధిని తాను నిర్వర్తించక, అరిషడ్వర్గాలకు బానిసై భ్రష్టుడైన బ్రాహ్మణుడి కంటే, పవిత్రమైన నడవడిక కలిగిన శూద్రుడు ఎంతో శ్రేష్ఠుడని ఆయన చెప్తారు.

ఆచార వ్యవహారాలు అనేవి సమాజం అవినీతి వల్ల చిన్నాభిన్నం కాకుండా బరువుగా ఉంచే బాధ్యతలు మాత్రమే తప్ప, మనుషులను వేరు చేయడానికి కాదని ఆయన హితవు పలుకుతారు. సృష్టిలోని ప్రతి వ్యక్తి ఆ విరాట్ పురుషుని దేహంలో నుంచి ఉద్భవించిన పరమాత్ముని ప్రతిరూపమే. ఒకరిని ఒకరు చులకనగా చూడటం ఆ భగవంతుడిని దూషించడమే అవుతుంది. దేవాలయంలో అర్చకత్వం కోల్పోయినా సరే, సర్వాంతర్యామి అయిన ఈశ్వరుడిని తన హృదయంలోనే ధ్యానించుకోగలనని, ఇది తన పునర్జన్మ అని ప్రకటిస్తూ, గాఢాంధకారాన్ని విడిచి వెలుగు రేఖల వైపు యాజులు గారు అడుగులు వేస్తారు. మానవత్వమే అన్ని కులాల కంటే మిన్న అని చాటిచెప్పే ఈ సన్నివేశం ఎప్పటికీ నిలిచిపోతుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com