
తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాలకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. నేటి తరం కథానాయికలు సమంత, నయనతార వంటి వారు తెరపై చేసే పోరాట ఘట్టాలను చూసి మనం ఎంతగానో మురిసిపోతుంటాం. కానీ, టాలీవుడ్ యాక్షన్ హిస్టరీ పేజీలని ఒక్కసారి వెనక్కి తిప్పితే, ఇప్పటి స్టార్ హీరోయిన్లను మించిపోయే రేంజ్‌లో అప్పట్లోనే ఒక నటి ఊరమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఆ అలనాటి అద్భుత నటి ఎవరో కాదు యాక్షన్ క్వీన్ విజయ లలిత.. అగ్ర హీరోయిన్ విజయ శాంతికి పిన్ని కూడా. ఆమె కథానాయికగా నటించిన అద్భుతమైన యాక్షన్ చిత్రం 'ఒక నారి వంద తుపాకులు'.
ఈ మూవీలో విజయలలిత(Vijaya lalitha)పోషించిన భవానీ క్యారక్టర్ అత్యంత సాహసోపేతమైనది, గంభీరమైనది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, చేతిలో తుపాకీ పట్టుకుని ఆమె చేసిన ఫైట్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వంద మంది మగవాళ్లను ఒంటరిగా ఎదిరించే ఒక ధీరవనితగా ఆమె పలికించిన హావభావాలు, చూపించిన రౌద్రం వెండితెరపై ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం చాలా పరిమితంగా ఉండేది, డూప్స్ లేకుండా రిస్క్ తీసుకుని ఇలాంటి పోరాటాలు చేయడం సాధారణ విషయం కాదు. 1973 లో విడుదలైన ఈ క్లాసిక్ యాక్షన్ డ్రామా సరికొత్త సాంకేతిక ప్రయోగాలకు వేదికగా నిలిచింది. ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందినప్పటికీ, క్లైమాక్స్ సీన్లని మాత్రం కలర్ మరియు వైడ్ 'సినిమాస్కోప్' ఫార్మాట్‌లో చిత్రీకరించడం విశేషం.
హాలీవుడ్‌లో 1969లో వచ్చిన సూపర్ హిట్ వెస్ట్రన్ మూవీ '100 రైఫిల్స్' స్ఫూర్తితో ఈ సినిమాను టాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా అద్భుతంగా మలిచారు. విజయచిత్ర బ్యానర్‌పై వై.వి. రావు నిర్మించిన ఈ చిత్రానికి కే.వి.ఎస్. కుటుంబరావు దర్శకత్వం వహించారు. వి జయలలితతో పాటు రాజనాల, త్యాగరాజు, రాజబాబు వంటి దిగ్గజ నటులు ఇందులో కీ రోల్స్ పోషించారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు చెళ్లపిళ్ల సత్యం అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లని మరింత రక్తికట్టించింది. ఈ రోజుల్లో అత్యాధునిక గ్రాఫిక్స్, రోప్స్ సాయంతో యాక్షన్ సీన్లు చేయడం సులువే కానీ, 50 ఏళ్ల క్రితమే ఎలాంటి హంగులు లేకుండా విజయలలిత చూపించిన ఆ పౌరుషం, ధైర్యం నిజంగా అమోఘం. అందుకే ఈ వీడియోను చూస్తున్న నేటి తరం ప్రేక్షకులు, అప్పట్లోనే మన హీరోయిన్లు సమంతను మించిపోయారంటూ సోషల్ మీడియా వేదికగా నీరాజనాలు పలుకుతున్నారు. ఉదాహరణకి మీరు చూస్తున్న వీడియోలోని సన్నివేశాలే ఉదాహరణ. బ్రిటిష్ వాళ్ళ నుంచి మహారాజుకి చెందిన పిల్లని కాపాడాలని భవానీ తండ్రి, ఆరేళ్ళ తమ్ముడు చనిపోతాడు. దీంతో భవానీ బ్రిటిష్ వాళ్ళ పైన పగ తీర్చుకుంటుంది.




