.webp)
టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసిన స్టార్ హీరోలు, ఇప్పుడు ఒక్కో ప్రాజెక్ట్ కోసం సంవత్సరాల తరబడి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ సరికొత్త ట్రెండ్ పై టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్ రవి తెలుగువన్ (TeluguOne) ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా మోజులో పడిపోయారని, దీనివల్ల సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక టైటిల్ వేసి, దాని కింద నాలుగు భాషల పేర్లు ముద్రిస్తే అది పాన్ ఇండియా సినిమా అయిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. (BVS Ravi Interview)
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల పేరుతో హీరోలు జుట్టు పెంచుకుని, గడ్డాలు పెంచుకుని, ఒంటికి నల్లటి మసి లేదా బూడిద పూసుకుని తిరుగుతున్నారని బి.వి.ఎస్ రవి అన్నారు. విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే తాము 200 రోజులు, 300 రోజులు షూటింగ్ చేస్తున్నామని మేకర్స్ చెబుతున్నారని, కానీ కేవలం గెటప్పుల కోసమే హీరోలు రెండు మూడు సంవత్సరాల అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. గెటప్పుల కోసం ఇంతలా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదని, బాహుబలి లాంటి ప్రపంచస్థాయి హిట్ సినిమా కోసం రానా దగ్గుబాటి ఒరిజినల్ గడ్డం పెంచకుండా కేవలం విగ్గు, ఎక్స్టెన్షన్స్ ఉపయోగించి షూటింగ్ ముగియగానే తీసేసేవారని, ఆ సమయంలోనే ఆయన మరో మూడు సినిమాలు కూడా పూర్తి చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇలా హీరోలు సంవత్సరాల తరబడి ఒకే సినిమాపై కూర్చోవడం వల్ల థియేటర్లకి ఫీడింగ్ కరువైపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద హీరోల సినిమా వస్తేనే థియేటర్ల యజమానులు తలుపులు తీసి, బూజు దులిపి, సాంబ్రాణి పొగ వేసి ఓపెన్ చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ తమ స్వార్థం, తమ రెమ్యునరేషన్, తమ వ్యాపారం గురించే ఆలోచిస్తున్నారు తప్ప ఇండస్ట్రీ బ్రతకాలని ఎవరూ అనుకోరని చెప్పారు. ఒక సినిమా కోసం 15 రోజులు, మరో సినిమా కోసం నెల రోజులు కేటాయిస్తూ ప్రస్తుతం ప్రభాస్ ఒక్కడే ప్లాన్డ్ గా సైమల్టేనియస్ గా సినిమాలు చేస్తున్నాడని, మిగతా హీరోలు కూడా అదే పంథాను అనుసరించాలని సలహా ఇచ్చారు.
పాన్ ఇండియా అంటే కేవలం భారీ వెపన్స్, గుర్రాలు, పెద్ద రౌడీలు ఉండటం కాదని, ఎక్కడైనా పల్లెటూరు, ప్రేమ, నిరుద్యోగం, కులాలు అనేవి కామన్ గా ఉంటాయని, దాన్ని మించిన యూనివర్సల్ సబ్జెక్ట్ లేదని స్పష్టం చేశారు. కేవలం విజిబిలిటీ, మార్కెటింగ్ కోసమే పాన్ ఇండియా పేరుతో 10 రాష్ట్రాలు తిరుగుతూ, మధ్యప్రదేశ్ లో పానీపూరి తింటూ, కలకత్తాలో రసగుల్లా తింటూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని అన్నారు.
హీరోలకు కూడా శారీరక పరిమితులు, నడుము నొప్పులు, ఫ్యామిలీ లైఫ్ ఉంటాయని ఒప్పుకుంటూనే, ఇప్పటికైనా హీరోలు, మేనేజర్లు, ప్రొడ్యూసర్లు కూర్చుని పక్కాగా ప్లాన్ చేసుకుని సమాంతరంగా మూడు నాలుగు సినిమాలు చేయాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో అదే జరగబోతుందని బి.వి.ఎస్ రవి చెప్పారు.





