
తెలుగు సినిమా చరిత్రలో హాస్యానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ 90ల నాటి క్లాసిక్ కామెడీ సినిమాల్లోని సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ హీరోగా రూపొందిన అద్భుతమైన హాస్య చిత్రం ‘బ్రహ్మచారి మొగుడు’. ఈ సినిమాలో వై. విజయ, గిరిబాబుల మధ్య సాగే కామెడీ సీన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఈ సినిమాలోని ఒక ఐకానిక్ కామెడీ క్లిప్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. కూరగాయలు కొనే నేపథ్యంలో సాగే ఈ సన్నివేశంలో నటి వై. విజయ చూపించిన టైమింగ్, అలాగే గిరిబాబు హావభావాలు ప్రేక్షకులకి నవ్వుల విందు పంచుతున్నాయి.
ఇందులో విజయ, గిరిబాబు భార్యాభర్తలుగా నటించారు. తన భార్య పెళ్లికాని మగాళ్లతో మాట్లాడకూడదు అనేది భర్త రూల్. ఆ విషయం మర్చిపోయి విజయ.. ఇంటిముందుకు వచ్చిన బండి దగ్గర కూరగాయలు కొంటూ ఉంటుంది. అదే సమయంలో భర్త రావడం చూసి, కంగారు పడుతుంది. ఆ కూరగాయలు అమ్మే వ్యక్తిని పెళ్లయిందా? అని అడుగగా.. అతను కాలేదని చెప్తాడు. దాంతో భయపడిపోయిన భార్య.. తన భర్త అడిగితే పెళ్లయిందని చెప్పమని అంటుంది. ఆ తర్వాత భర్త ఎంట్రీ ఇచ్చాక.. కూరగాయలు అమ్మే వ్యక్తికి కొత్తగా పెళ్లయిందని నమ్మేలా చేస్తుంది. దాంతో భర్త ఆ కూరగాయల వ్యక్తికి ఎక్స్‌ట్రా డబ్బులు కూడా ఇస్తాడు.
ఈ సీన్‌లో విజయ కూరగాయల వ్యక్తితో మాట్లాడే తీరు, మధ్యలో గిరిబాబు ఎంట్రీ ఇచ్చి చేసే హడావుడి నవ్వులు పూయిస్తుంది. కూరగాయల ధరలు అడుగుతూనే, పక్కనున్న వ్యక్తితో తన ప్లాన్‌ను అమలు చేయడం, ఆపై గిరిబాబును నమ్మించి బురిడీ కొట్టించడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. సీన్‌లో ప్రతి డైలాగ్ ఎంతో సహజంగా, హాస్యభరితంగా సాగుతుంది.
ఈ కామెడీ క్లిప్ చూసిన నెటిజన్లు ‘అప్పటి సినిమాల్లో ఉండే కామెడీ మళ్లీ చూడలేకపోతున్నాం’ అని కామెంట్లు చేస్తున్నారు. గిరిబాబు, వై. విజయల నటనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
[Brahmachari Mogudu, Comedy Scenes, Giri Babu, Y Vijaya, Telugu Comedy]






