
తెలుగు చిత్రసీమలో సంగీత సాహిత్యాల కలబోతగా నిలిచే అరుదైన నృత్య రూపాకాలలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'పౌర్ణమి' (2006) చిత్రంలోని 'భరత వేదముగా' పాట అగ్రస్థానంలో నిలుస్తుంది. ప్రభుదేవా దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రంలో ఈ పాట ప్రేక్షకులను ఇప్పటికీ పరవశింపజేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ క్లాసికల్ స్వరకల్పన, కె.ఎస్. చిత్ర గాత్రం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం త్రివేణి సంగమంలా కలసి ఈ పాటను ఒక క్లాసిక్‌గా మలిచాయి. వెండితెరపై ప్రసన్నమైన శివతాండవంలో ఛార్మి నృత్య అభినయం, ప్రభాస్ ఉద్వేగభరిత ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.
ఈ పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి చేసిన అద్భుతమైన సాహిత్య మ్యాజిక్ అంతా ఇంతా కాదు. "అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది – మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది.. ఆదిశక్తి ఆకృతి, అద్రిజాత పార్వతి – స్థాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది" అనే రెండు వాక్యాల్లోనే ఆయన పౌర్ణమి సినిమా మొత్తం కథానాయక, కథానాయకుల అంతరంగాన్ని నింపేశారు. ఈ రెండు లైన్లలో ప్రభాస్‌ని శివుడిగా, త్రిషని సతీదేవిగా, ఛార్మిని పార్వతీదేవిగా పోలుస్తూ సినిమాలోని అసలు కథాంశాన్ని లోతుగా ఆవిష్కరించారు. సతీదేవి యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకున్నట్లే సినిమాలో త్రిష పాత్ర త్యాగం చేస్తుంది, ఆ తర్వాత సతీదేవే పార్వతిగా జన్మించి ఈశ్వరుడిని చేరుకున్నట్లు ఛార్మి ఆ బాధ్యతను స్వీకరిస్తుంది.
పాట ప్రారంభంలోనే సిరివెన్నెల 'పదము' అనే పదాన్ని రెండు భిన్నమైన అర్థాల్లో ఉపయోగించి తన పాండిత్యాన్ని చాటుకున్నారు. 'కదిలిన పదమిది ఈశా' అన్నప్పుడు అడుగు (నాట్య భంగిమ) అని, 'పలికెను పదము పరేశా' అన్నప్పుడు పదం లేదా పాట అని యమకాలంకారంలో ఎంతో అందంగా వర్ణించారు. అలాగే 'శివ నివేదనగా.. అవని వేదనగా' అంటూ ఒకవైపు స్వామికి సమర్పించే నైవేద్యం, మరొకవైపు వర్షాలు లేక అలమటిస్తున్న నేలతల్లి ఆక్రందనను ఎంతో మార్మికంగా అనుసంధానించారు. సముద్రాన్ని మధించినప్పుడు హాలాహలాన్ని మింగిన పరమశివుడిని 'నీలకంధరా' అని సంబోధిస్తూ, అభయమిచ్చి లోకాన్ని కాపాడమని వేడుకునే రీతిలో ఈ గీతం సాగుతుంది.
ఈ చిత్రంలో నాట్య ప్రాధాన్యాన్ని వివరిస్తూ సాగే ఈ గీతం ఒక పరిపూర్ణమైన నృత్య కావ్యంగా రూపుదిద్దుకుంది. పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు పాడే నమక చమకాలు, యమక గమకాల సమాహారంగా ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తుంది. రాతి శిల్పాలు సైతం కదిలేలా, గంగమ్మ నేలకు దిగివచ్చేలా సాగే ఈ నాట్య నివేదన ద్వారా కరువుతో తడి ఆరిపోయిన గ్రామానికి వర్షం పడి ప్రాణవాయువు లభిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశంలో ప్రభాస్ కళ్లలోని భావోద్వేగాలు, ఛార్మి అద్భుతమైన భరతనాట్య అభినయం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి.
ప్రభాస్ కెరీర్‌లో ‘వర్షం’, ‘పౌర్ణమి’ చిత్రాలు బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్‌లుగా నిలిచాయి. ఇప్పటికీ ఆ పాటల సాహిత్యాన్ని తాను వింటూ ఉంటానని ప్రభాస్ పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు. 2006లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా ఆశించిన విజయం సాధించలేకపోయినా, ఈ 'భరత వేదముగా' పాట మాత్రం తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని ఒక సంగీత అద్భుతంగా శాశ్వతంగా నిలిచిపోయింది. సిరివెన్నెల కలం నుంచి జారిన ప్రతీ పదం న భూతో న భవిష్యత్ అనేలా నేటికీ మారుమోగుతూనే ఉంది.
[Bharatha Vedamuga Song, Pournami Movie Songs, Prabhas Pournami Movie, Prabhas, Charmy Kaur, Devi Sri Prasad, Sirivennela Seetharama Sastry, Telugu Songs]





