Home

»

Exclusive Movie News

అప్పుడు మహేష్ బాబు.. ఇప్పుడు జయకృష్ణ.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

Jun 17, 2026 12:48PM

టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన సంచలనానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఘట్టమనేని కుటుంబం నుండి మూడో తరం వారసుడు వెండితెరపై అడుగుపెడుతున్నాడనే వార్త అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు అయిన జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni) ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మొదటి సినిమా 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి వైవిధ్యమైన కథాంశాలతో మెప్పించే దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీదత్ సమర్పణలో జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయకృష్ణ తన మొదటి లుక్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఘట్టమనేని వంశపు రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తూ ప్రామిసింగ్ హీరోగా ముద్ర వేసుకున్నారు.

ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి టాలీవుడ్ వర్గాల్లో ఒక బలమైన చర్చ నడుస్తోంది, అదే 'అశ్వినీదత్' సెంటిమెంట్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో అగ్ర హీరోలను, స్టార్లను పరిచయం చేసిన ఘనత నిర్మాత అశ్వినీదత్ కి ఉంది. ఇప్పుడు జయకృష్ణ డెబ్యూ మూవీకి ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం పరిశ్రమలో వ్యక్తమవుతోంది. గతంలో జయకృష్ణ బాబాయ్, సూపర్ స్టార్ మహేష్ బాబును 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం చేసింది అశ్వినీదత్ కావడం విశేషం. ఆ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని నమోదు చేసి మహేష్ బాబు కెరీర్‌కు గట్టి పునాది వేసింది. కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు, నేటి తరం స్టార్ హీరోలైన ఎందరికో ఆయన తొలి అడుగుల్లో తోడుగా నిలిచారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ ఎంట్రీ మూవీ 'చిరుత', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా 'గంగోత్రి' చిత్రాలను అశ్వినీదత్ స్వయంగా నిర్మించి వారిని వెండితెరకు పరిచయం చేశారు.

ఈ ముగ్గురు స్టార్ హీరోలే కాకుండా, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మొదటి సూపర్ హిట్ చిత్రం 'స్టూడెంట్ నెం.1' వెనుక కూడా అశ్వినీదత్ ఉన్నారు. ఇలా నలుగురు అగ్ర స్టార్ల కెరీర్ ప్రారంభ దశలో, వారి విజయాల పునాదిలో అత్యంత కీలక పాత్ర పోషించిన అశ్వినీదత్  సెంటిమెంట్ హ్యాండ్ ఇప్పుడు జయకృష్ణ ఘట్టమనేనిపై పడింది. ఇప్పటివరకు విడుదలైన 'శ్రీనివాస మంగాపురం' ప్రచార చిత్రాలు, పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. అజయ్ భూపతి మార్క్ లవ్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. జూలై 8న విడుదలవనున్న 'శ్రీనివాస మంగాపురం'పై మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఘట్టమనేని అభిమానులు మూడో తరం వారసుడికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఈ అశ్వినీదత్ లక్కీ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయి, జయకృష్ణ ఘట్టమనేని టాలీవుడ్‌లో సరికొత్త స్టార్‌గా అవతరిస్తాడేమో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com