Home

»

Exclusive Movie News

సంపాదన లేదని అల్లుడిని అత్తగారు ఎలా అవమానిస్తుందో

Jul 1, 2026 4:46PM

తెలుగు చలనచిత్ర రంగానికి సువర్ణ యుగంగా నిలిచిన రోజుల్లో, వెండితెరపై భావోద్వేగాలను అద్భుతంగా పండించిన అపురూప చిత్రం 'వెలుగు నీడలు'. 1961 జనవరి 7న విడుదలైన ఈ క్లాసిక్ సాంఘిక చిత్రం అభిమానులని, ప్రేక్షకులని  ఆద్యంతం కట్టిపడేసింది. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డి. మధుసూదనరావు నిర్మించిన ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రిల అద్భుత నటనకు తోడుగా, క్రూరమైన మరియు గయ్యాళి అత్త క్యారెక్టర్స్ కి  కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సూర్యకాంతం కనకదుర్గమ్మ గా  చేసిన నటన  ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక మనిషి జీవితంలో వచ్చే సుఖదుఃఖాలను, అంటే వెలుగు నీడలను ఈ చిత్రం ఎంతగానో ప్రతిబింబించింది.

చిత్రం కథాంశంలోకి వెళ్తే, రావు బహదూర్ వెంకటరామయ్య (ఎస్.వి. రంగారావు) మరియు కనకదుర్గమ్మ (సూర్యకాంతం) దంపతులకు మొదట్లో సంతానం లేకపోవడంతో సుగుణ (సావిత్రి) అనే అనాథ అమ్మాయిని దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే, ఆ తర్వాత వారికి సొంత కూతురు వరలక్ష్మి (గిరిజ) పుట్టడంతో కనకదుర్గమ్మ మనసు మారిపోతుంది. సుగుణపై అమితమైన ద్వేషాన్ని, అసూయను ప్రదర్శిస్తూ ఆమెను ఇంటి నుంచి పంపించేయడానికి నిరంతరం కుట్రలు చేస్తుంది. సూర్యకాంతం తనదైన గయ్యాళితనంతో, కఠినమైన డైలాగ్ డెలివరీతో సావిత్రిని వేధించే దృశ్యాలు ప్రేక్షకుల్లో తీవ్రమైన భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వెంకటరామయ్య సుగుణను తన నమ్మకస్థుడైన గుమస్తా వెంగళప్ప (రేలంగి) సంరక్షణలో ఉంచి డాక్టర్ చదువు చదివిస్తాడు.

మరోవైపు, మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో సుగుణకి చంద్రంతో  (అక్కినేని నాగేశ్వరరావు) పరిచయమై అది కాస్తా గాఢమైన ప్రేమగా మారుతుంది. అయితే చంద్రం  ప్రాణాంతకమైన క్షయ (టీబీ) వ్యాధి బారిన పడతాడు. దీంతో చంద్రం తన ప్రేమని  త్యాగం చేసి, సుగుణ జీవితం బాగుండాలని డాక్టర్ రఘునాథ్ (జగ్గయ్య)తో వివాహం జరిపిస్తాడు. దురదృష్టవశాత్తూ రఘునాథ్ ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సుగుణ విధవరాలవుతుంది. ఆ తర్వాత కోలుకున్న రవి, పరిస్థితుల ప్రభావం వల్ల సుగుణ సోదరి వరలక్ష్మిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడే సూర్యకాంతం పాత్రలోని అసూయ మరింత పరాకాష్టకి  చేరుతుంది.

కూతురు కాపురంలో నిప్పులు పోయడానికి రవి,సుగుణల పాత ప్రేమని మనసులో పెట్టుకుని వరలక్ష్మి మనసులో అనుమానమనే విషబీజాలు నాటుతుంది. ఒకే ఇంట్లో ఉండే అక్కాచెల్లెళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య సూర్యకాంతం సృష్టించిన అగాధం మూవీని  తీవ్రమైన ఉత్కంఠ భరితమైన డ్రామాగా మారుస్తుంది. చివరికి సుగుణ ఒక బాధ్యత గల అక్కగా, డాక్టర్‌గా వారిద్దరి మధ్య ఉన్న అపోహలను తొలగించి, వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు ఎలా నింపిందనేదే ఈ సినిమా యొక్క ముగింపు. కింద ఉన్న వీడియోలో ఒక అపూర్వమైన సన్నివేశం ఉంది.  దివాళా తీసే స్థితిలో ఉన్న తన మావయ్య  వెంకటరామయ్య ప్రెస్ లో మేనేజర్ గా చేరతాడు. తన తెలివి తేటలతో ప్రెస్ ని గొప్ప స్థాయికి తీసుకొచ్చి లాభాల బాట పట్టిస్తాడు.  కానీ కనకదుర్గమ్మ ఆ డబ్బులుతో కారు, నగలు కొంటుంది. దాంతో చంద్రం కోపోద్రక్తుడై వచ్చిన లాభాల్లో కార్మికులకి బోనస్ ఇస్తానని మాట ఇచ్చానని గొడవపడతాడు. ఈ విషయంలో గొడవపడి మరి ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోతాడు. ఇలాంటి అపురూపమైన సీన్స్ ఎన్నో ఉన్నాయి.

ఆచార్య ఆత్రేయ రాసిన పదునైన సంభాషణలు, పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన "కలకానిది విలువైనది", "హాయి హాయిగా జాబిల్లి" వంటి అమర గీతాలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. 60 ఏళ్లు దాటినా ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఒక ఆణిముత్యం. కింద ఉన్న వీడియోలోని సీన్  నే ఈ చిత్రం యొక్క వైభవానికి ఒక మచ్చు తునక .

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com