
ఒకప్పుడు టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా, క్రేజీ ఫ్యామిలీ హీరోగా ముద్ర వేసుకున్న వడ్డే నవీన్ (Vadde Naveen) సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu). ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, తెలుగువన్(TeluguOne)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నవీన్ తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, టాలీవుడ్ ట్రెండ్స్‌పై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
చాలా కాలం తర్వాత కెమెరా ఫేస్ చేయడంపై నవీన్ స్పందిస్తూ, మొదటి రెండు మూడు రోజులు కొంచెం ఆందోళనగా అనిపించినా, ఆ తర్వాత క్యారెక్టర్‌లో లీనమైపోయానని చెప్పారు. ఈ పదేళ్ల కాలంలో ఎన్నో కథలు విన్నానని, అయితే ప్రేక్షకులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతోనే సరైన స్క్రిప్ట్ కోసం వేచి చూశానని స్పష్టం చేశారు. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ కథ విన్నప్పుడు అందులోని స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ తనను బాగా ఆకట్టుకున్నాయని, అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేశానని నవీన్ తెలిపారు.
ప్రస్తుత సినిమాల్లో కనిపిస్తున్న మితిమీరిన హింస, రక్తపాతం గురించి మాట్లాడుతూ.. ‘నా సినిమాలో ఓవర్ ది టాప్ యాక్షన్ ఉండదు. ఇందులో నేను ఒక నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ పాత్రను పోషిస్తున్నాను. ఒక కానిస్టేబుల్ పరిధి ఎంతవరకు ఉంటుందో, అంతవరకే యాక్షన్ ఉంటుంది. లాఠీతోనే ఇంపాక్ట్‌ఫుల్ ఫైట్స్ ఉంటాయి తప్ప మెషిన్ గన్లు పట్టుకుని కాల్చడాలు, నరికేయడాలు ఉండవు’ అని చాలా ప్రాక్టికల్‌గా వివరించారు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, భార్యాకూతుళ్ల మధ్య బాండింగ్ క్లీన్‌గా ఉంటాయని, మహిళా ప్రేక్షకులకు ఇది బాగా కనెక్ట్ అవుతుందని నవీన్ ధీమా వ్యక్తం చేశారు.
ఒకప్పుడు ఐదారు పాటలతో సినిమాలు వచ్చేవి, కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందని నవీన్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయని, కథా గమనానికి అడ్డుపడకుండా సిట్యుయేషనల్‌గా ఈ పాటలను డిజైన్ చేసినట్లు చెప్పారు. టెక్నాలజీ పరంగా ఇండస్ట్రీ ఎంతో ఇంప్రూవ్ అయిందని, ప్రేక్షకుల మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరిగాయని విశ్లేషించారు. ఓటిటి ఎక్స్‌పోజర్ వల్ల ప్రేక్షకులు కంటెంట్ నచ్చితేనే థియేటర్లకు వస్తున్నారని, తమ సినిమాను ఇప్పటికే ‘జీ’ సంస్థ అవుట్‌రైట్‌గా కొనుగోలు చేయడం ఒక పాజిటివ్ సైన్ అని సంతోషం వ్యక్తం చేశారు.
తన తోటి హీరోలైన జగపతిబాబు, శ్రీకాంత్ వంటి వారు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా దూసుకుపోవడంపై నవీన్ ప్రశంసలు కురిపించారు. తనకు అలాంటి బలమైన, పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ‘రంగస్థలం’లో రామ్ చరణ్ క్యారెక్టర్, ‘పుష్ప’లో అల్లు అర్జున్ క్యారెక్టర్‌ల లాంటి రా, రూటెడ్ అండ్ ఎర్తీ పాత్రలు చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని తన మనసులోని కోరికను బయటపెట్టారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇప్పటి తరం స్టార్స్ సినిమా కోసం పడుతున్న శ్రమను ఆయన అభినందించారు.
చివరగా, ఎప్పుడూ లో-ప్రొఫైల్ మెయింటైన్ చేయడంపై స్పందిస్తూ.. తనకు ఆడంబరాల కంటే సింపుల్‌గా ఉండటమే ఇష్టమని చెప్పారు. క్వాలిటీ కంటెంట్‌తో వస్తున్న ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రాన్ని జూన్ 19న థియేటర్లలో చూసి ఆదరించాలని తెలుగు ప్రేక్షకులను కోరారు.





