
పేర్ని పాకులాట ఎందుకంటే?
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం నియోజకవర్గంలో తెగ హడావుడి చేస్తున్నారు. అనుచరవర్గాన్ని చెదిరిపోకుండా చూసుకోవడానికి నానా పాట్లూ పడుతున్నారు. గత ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దాదాపు వైసీపీ క్యాడర్ చెల్లాచెదురైపోయినట్లు కనిపిస్తున్నది. జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది. మచిలీపట్నంలో గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు పేర్ని నానికి కుమారుడి రాజకీయ అస్తిత్వం కాపాడాలంటే జనంలో కనిపించడం వినా మరో మార్గం లేకుండా పోయింది. అందుకే అవనసరపు హడావుడితో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారనీ, కాదు కాదు వార్తల్లో ఉండటానికి పాకులాడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓడిపోయిన నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు మౌనాన్ని ఆశ్రయించినా, ఓడిపోయినప్పటికీ మచిలీపట్నంలో మాత్రం పేర్ని నాని హడావుడి చేస్తున్నారు. స్థానిక అంశాల నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు ప్రతిదానికీ స్పందిస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. కేసులు, అరెస్టులు వంటి బెదిరింపులకు వెనకాడబోమంటూ సవాళ్లు విసురుతున్నారు. వాస్తవంగా కేసులు, అరెస్టుల వరకూ వచ్చే సరికి పలాయనం చిత్తగించి, అవి సద్దుమణగగానే మళ్లీ హడావుడి పెంచుతున్న పరిస్థితి. ఇందుకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ పై పేర్ని నానికి ఉన్న ఆందోళనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తాను సైలంట్ అయితే.. మచిలీపట్నంలో పోలిటికల్ ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకమౌతుందన్న ఆందోళనే నానిని చీటికీ మాటికీ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా లైమ్ లైట్ లో ఉండేందుకు తాపత్రేయపడేలా చేస్తున్నదని అంటున్నారు. అయితే నాని ఈ తాపత్రేయం ఎంతవరకూ ఫలిస్తుందన్నది మాత్రం ప్రశ్నార్థకమేనని పరిశీలకులు అంటున్నారు. రాజధాని అమరావతికి అతి సమీపంలోని నియోజకవర్గం అయిన మచిలీపట్నంలో అమరావతికి వ్యతిరేక స్టాండ్ తీసుకున్న పార్టీగా వైసీపీ పుంజుకునే అవకాశాలు అంతంతమాత్రమేనని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పేర్ని నాని ఎంతగా పాకులాడినా పట్టు నిలుపుకోవడం అంత తేలిక కాదనీ చెబుతున్నారు.
Apr 07, 2026.webp)
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలకు జనసేన పట్టు!
కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలకు జనసేన పట్టుపడుతోంది. జగన్ హయాంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ద్వారంపూడి చేసిన వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు తెలిసిందే. అప్పట్లో పవన్ వర్సెస్ ద్వారంపూడి అన్నట్టుగా సాగిన మాటల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకున్న జనసేన నాయకులు, కూటమి అధికారంలోకి రావడంతో ఆయనపై చర్యలకు ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ అసోసియేషన్ ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్న పరిస్థితి. అక్కడ ఆయన ఆధిపత్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా జనసేన నాయకులు పావులు కదుపుతున్నారు. మరోవైపు కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణా, ఎగుమతులపై ప్రభుత్వం డేగకన్ను వేసింది. గతంలో జరిగిన అక్రమాలపై ఆరా తీస్తుండటంతో ద్వారంపూడి వ్యాపార సామ్రాజ్యం కుదేలైన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఆయనకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందంటున్నారు. ఇలా ఉండగా జనసైనికులు అయితే ద్వారంపూడిపై తక్షణ చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. జగన్ హయాంలో పవన్‌ను టార్గెట్ చేసి ఆయనపై వ్యక్తిగత విమర్శలకు, దూషణలకు పాల్పడిన ద్వారంపూడిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టడానికి వీల్లేదని పట్టుబడుతున్నారు. జనసేన ఒత్తిడి ఫలితంగానే త్వరలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉదనీ, ఆ ఎన్నికల్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ద్వారంపూడి పెత్తనానికి చెక్ పడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఒక సారి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ద్వారంపూడి పట్టు సడలితే.. ఇక వరుసగా అన్ని వైపుల నుంచీ గతంలో ఆయన చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై ముప్పేట దాడికి జనసైనికులు రెడీగా ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలు కాకినాడ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Apr 07, 2026.webp)
హైకోర్టుకు అంబటి రాంబాబు.. ఎందుకంటే?
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించింది ఏదో కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం కాదు. గతంలో తనను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో కస్టడీలో అమానుషంగా ప్రవర్తించారనీ, శారీరక హింసకు గురిచేశారనిఆరోపిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేర తనను కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం విషయంలో రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టై, ఆ తరువాత రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలులో ఉండి, ఆ తరువాత బెయిలుపై బయటకు వచ్చిన ఇన్ని రోజుల తరువాత.. నల్లపాడు పోలీసు స్టేషన్ లో తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారంటూ అంబటి హైకోర్టును ఆశ్రయించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన పలు సందర్భాలలో తన అరెస్టు అక్రమం అని చెప్పారే కానీ, పీఎస్ లో తన పట్ల అమానుషంగా ప్రవర్తించారనిగానీ, శారీరకంగా హింసించారని కానీ ఎన్నడూ చెప్పలేదు. పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనీ, ఒక మాజీ మంత్రిని ట్రీట్ చేయాల్సినట్లుగా మర్యాదగా వ్యవహరించలేదని అటూ వచ్చారు. అటువంటిది ఇప్పుడు ఏకంగా తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారనీ, నేలపై కూర్చోబెట్టి అమానుష పద్ధతుల్లో హింసించారనీ ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంబటి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, దీనిపై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖను ఆదేశించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.
Apr 07, 2026.webp)
బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులపై ధ్వజమెత్తిన కేటీఆర్
పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులను, గృహనిర్బంధాలను ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపడం నేరమా అని ప్రశ్నించిన కేటీఆర్.. మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్తేమీ కాదనీ, తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఇలాంటి ఆంక్షలెన్నో ఎదుర్కొన్నామన్నారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమేనని ఉద్ఘాటించిన కేటీఆర్.. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల అనుమతి లేకుండా సాగిస్తున్న బలవంతపు భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందనీ, బాధితులకు అండగా నిలబడుతుందనీ చెప్పారు. అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Apr 07, 2026
మాజీ మంత్రులు హరీష్, సబిత అరెస్ట్
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాళ్లపూర్ గ్రామంలో జరుగుతున్న రిలే నిరహార దీక్షకు మద్దతుగా భారీ ఎత్తున తరలివస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీక్ష స్థలానికి వెళ్లే ప్రధాన రహదారులపై పోలీసులు భారీగా మోహ రించి మొత్తం తొమ్మిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.ఈ నేపథ్యంలోనే పరిగి పర్యటనకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావును పోలీసులు అప్ప జంక్షన్ వద్ద అడ్డుకుని అరెస్టు చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీక్షకు మద్దతుగా భారీగా తరలివస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడం, కీలక నేతల అరెస్టులతో పరిగి ప్రాంతంలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. ఇలా ఉండగా అరెస్టు చేసిన హరీష్ రావు, సరిత తదితరులను పోలీసులు శంషాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
Apr 07, 2026.webp)
అమరావతికి చట్టబద్ధత.. బాలకృష్ణ హర్షం
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంపై హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి అంటూ చేసిన ఓ ట్వీట్ లో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు, ఎంపీలకూ, ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ హృదయపూర్వక కృతజ్ణతలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుందన్నారు.
Apr 07, 2026.webp)
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే రాజీనామా.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
కడప జిల్లా జమ్మలమడుగులో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోడీ సహకారంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నదన్నారు. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతున్నదంటూనే.. జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేసి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకు ఉందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు గడుస్తున్నా నియోజకవర్గములో కొన్ని సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయని ఆదినారాయణరెడ్డి అన్నారు. గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లింపు, రాజోలి జలాశయ నిర్మాణం, ఎస్ ఆర్ బి సి నిర్మాణం, ఆర్టిపిపి సమస్య పరిష్కారం కావాల్సి ఉందన్నారు. గండికోట జలాశయంలో ఇప్పటికే నీరు నిలువ చేస్తూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం దారుణమన్న ఆయన.. ఈ సమస్యల పరిష్కారం కాకుంటే.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి ప్రజల వెంటే ఉంటా తప్ప అధికారం కోసం ఆరాటపడనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Apr 07, 2026
అమరావతికి చట్టబద్ధతపై గెజిట్.. చంద్రబాబు హర్షం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించిన వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చారిత్రాత్మక పరిణామంపై స్పందించిన ముఖ్యమంత్రి, ఇది రాష్ట్ర ప్రజల విజయమని అభివర్ణించారు. ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం సహకారంతోనే అమరావతి నిర్మాణ స్వప్నం ఇప్పుడు వాస్తవరూపం దాల్చబోతోందని ఆయన వివరించారు. ఈ బిల్లు ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించిన పార్లమెంట్ సభ్యులు, వివిధ రాజకీయ పక్షాల నేతలను ఆయన అభినందించారు. ముఖ్యంగా అమరావతి ఉద్యమంలో నిరంతరం పోరాటం చేసిన రైతులు, మహిళలను చంద్రబాబు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఏళ్ల తరబడి అనేక ఇబ్బందులను ఎదుర్కొని రాజధాని కోసం నిలబడిన ప్రతి పౌరుడి విజయం ఇది అని ఆయన కొనియాడారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి ఇక నుంచి ఒకే చిరునామా ఉండబోతోందని, అది అమరావతి మాత్రమేనని స్పష్టం చేశారు.
Apr 06, 2026
ఏపీ కేపిటల్ అమరాతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతిని రాజధానిగా ధ్రువీకరిస్తూ చేసిన సవరణ బిల్లును పార్లమెంటుకు పంపిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఉభయ సభలలో కూడా ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ ప్రక్రియలో భాగంగా, 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని కీలక అంశాలకు సవరణలు చేశారు. ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ 5, సబ్-సెక్షన్ (2)లో ఉన్న మార్పులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో పునర్వ్యవస్థీకరణ చట్టంలో "కొత్త రాజధాని ఉండేది. ఇప్పుడు ఆ పదాన్ని తొలగించి, దాని స్థానంలో అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది అని స్పష్టంగా పొందుపరిచారు. ఈ మార్పు ద్వారా 'అమరావతి' అనే పదానికి చట్టపరమైన నిర్వచనాన్ని కూడా ఇచ్చారు. సీఆర్డీయే చట్టం 2014 నిబంధనల ప్రకారం నోటిఫై చేయబడిన ప్రాంతాలన్నీ అమరావతి కిందకు వస్తాయని గెజిట్‌లో స్పష్టం చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సవరణ చట్టం 2024 జూన్ 2వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లుగా కేంద్రం పేర్కొంది. అంటే, సాంకేతికంగా 2024 జూన్ 2 నుంచే అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టపరమైన గుర్తింపు పొందింది. ఈ గెజిట్ ప్రచురణతో ఇకపై రాజధాని విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది. గత కొన్నేళ్లుగా రాజధాని అంశంపై నెలకొన్న రాజకీయ మరియు న్యాయ పోరాటాలకు ఈ గెజిట్ ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపింది. అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి చట్టబద్ధత లభించడంతో, రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధుల సమీకరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనకు ఈ గెజిట్ పునాదిగా నిలవనుంది. అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు ఆకర్షించడానికి, కేంద్ర సహాయ సహకారాలు పొందడానికి ఈ చట్టబద్ధత ఎంతో దోహదపడనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం రాజధాని అభివృద్ధికి ఎటువంటి కార్యాచరణను రూపొందిస్తుందో చూడాలి.
Apr 06, 2026
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. కొత్త పోకడలు, ఎన్నికల సమగ్రత, రాజకీయ దృక్పథం
పశ్చిమ బెంగాల్లో తదుపరి శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, తీవ్రమైన పోటీ, మారుతున్న ఓటర్ల మనోభావాలు, మరియు ఎన్నికల ప్రక్రియలపై పెరిగిన నిశిత పరిశీలనతో రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. 1. ఎన్నికల వాతావరణం, ప్రజాభావన మార్పు కోసం పెరుగుతున్న ఆకాంక్ష. ఓటర్లలోని కొన్ని వర్గాలలో రాజకీయ మార్పు కోసం బలమైన ఆకాంక్ష ఉన్నట్లు కనిపిస్తోంది. టీఎంసీ తన బలమైన సంస్థాగత పునాదిని కొనసాగిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలో ఓటర్ల మనోభావాలు ప్రత్యామ్నాయాల పట్ల పెరుగుతున్న సుముఖతను సూచిస్తున్నాయి. బీజేపీ సన్నాహాలు.. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మరింత వ్యవస్థీకృతమైన, వ్యూహాత్మకమైన విధానాన్ని చేపట్టింది. మెరుగైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలు క్షేత్రస్థాయి సమీకరణను పెంపొందించడం బలమైన ప్రచార ప్రణాళిక మరియు ప్రచార సందేశం ఈ మెరుగుదలలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా సంస్థాగత బలం పరిమితంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలలో పార్టీ ఇప్పటికీ స్థానిక సవాళ్లను ఎదుర్కొంటోంది. 2. ఎన్నికల సంఘం పాత్ర ఎన్నికల సమగ్రతను బలోపేతం చేసే లక్ష్యంతో తీసుకున్న అనేక చర్యలతో, భారత ఎన్నికల సంఘం పాత్ర ప్రముఖంగా చర్చనీయమైంది: పరిపాలనాపరమైన చర్యలు: నిష్పక్షపాతాన్ని నిర్ధారించడానికి అధికారులను తొలగించడం లేదా వేరే విధులకు బదిలీ చేయడం పోస్టల్ బ్యాలెట్ సంస్కరణలు: అవకతవకలను తగ్గించడానికి కఠినమైన మార్గదర్శకాలను ప్రవేశపెట్టడం సాంకేతిక ఏకీకరణ: బూత్ క్యాప్చరింగ్ వంటి అవకతవకలను నిరోధించడానికి పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ మరియు సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేయడం ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను పెంచగల సానుకూల చర్యలుగా విస్తృతంగా పరిగణించబడుతున్నాయి. 3. ఎన్నికల సమాచారం మరియు అంచనాలు సుధాశీల్ ఘోష్ విశ్లేషణతో సహా, ఇటీవలి అభిప్రాయ సేకరణలు హోరాహోరీ ఎన్నికల వాతావరణాన్ని సూచిస్తున్నాయి: బీజేపీ అంచనా: సుమారు 157 సీట్లు టీఎంసీ అంచనా: సుమారు 119 సీట్లు ఇలాంటి అంచనాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉన్నప్పటికీ, గత ఎన్నికలతో పోలిస్తే మరింత సమతుల్యమైన పోటీ వైపు మార్పు వచ్చే అవకాశం ఉందని ఇవి సూచిస్తున్నాయి. 2021 నుండి పాఠాలు ఈ విశ్లేషణ 2021 ఎన్నికలను కూడా పునఃసమీక్షిస్తూ, ఈ క్రింది అంశాలను హైలైట్ చేస్తుంది: ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొన్న నిర్మాణాత్మక మరియు లాజిస్టికల్ సవాళ్లు ఆనాటి స్థానిక రాజకీయ పరిస్థితుల ప్రభావం ఓటర్ల జాబితా సమగ్రత రాబోయే ఎన్నికలలో ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేయడం ఒక కీలక అంశం, ముఖ్యంగా ఈ క్రింది వారిని తొలగించడం: గైర్హాజరు స్థానమార్పిడి మరణించిన వారి (ASD) వివరాలు ఈ ప్రక్రియ, ముఖ్యంగా హోరాహోరీగా పోటీ ఉన్న నియోజకవర్గాలలో, ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చు. 4. ప్రాంతాల వారీ రాజకీయ గతిశీలత ఉత్తర బెంగాల్ కూచ్ బెహార్ మరియు ఉత్తర దినాజ్‌పూర్ వంటి జిల్లాలు స్థిరమైన ఓటర్ల మద్దతుతో బీజేపీకి కంచుకోటలుగా కొనసాగుతున్నాయి. కేంద్ర మరియు పట్టణ ప్రాంతం కోల్‌కతాతో సహా పట్టణ కేంద్రాలు హోరాహోరీగా ఉన్నాయి, రెండు పార్టీలు తమ స్థావరాలను చురుకుగా పటిష్టం చేసుకుంటున్నాయి. దక్షిణ బెంగాల్ హుగ్లీ మరియు బీర్భూమ్ వంటి జిల్లాలలో ఈ క్రింది సూచనలు కనిపిస్తున్నాయి: టీఎంసీ సాంప్రదాయ ఆధిపత్యం క్షీణించడం బీజేపీకి ఎన్నికల పరంగా ఆదరణ పెరగడం ఈ ప్రాంతీయ వైవిధ్యాలు తుది సీట్ల పంపిణీని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 5. ముగింపు: ఎన్నికల సమగ్రతపై ఆధారపడిన పోటీ రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకమైన మరియు హోరాహోరీగా సాగే రాజకీయ పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఫలితం కేవలం ప్రచార వ్యూహాలు, ఓటర్ల మనోభావాలపైనే కాకుండా, ఎన్నికల ప్రక్రియలోని నిష్పాక్షికత మరియు పారదర్శకతపై కూడా అత్యంత కీలకం. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా మరియు నిష్పాక్షికంగా జరిగితే, బీజేపీ 148 సీట్ల గడపను దాటి, అధికారానికి బలమైన పోటీదారుగా నిలవగలదని ప్రస్తుత అంచనాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో, టీఎంసీకి ఉన్న బలమైన సంస్థాగత బలం ఈ పోటీని అత్యంత ఉత్కంఠభరితంగా ఉంచుతుంది. దీంతో ఇది ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికలలో ఒకటిగా నిలుస్తోంది. సంకలనం, సేకరణ: కంఠంనేని సీతారాం
Apr 06, 2026.webp)
వైసీపీలో అంబటి వర్సెస్ ముద్రగడ.. ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు ఓటు బ్యాంకుకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడమే లక్ష్యంగా వైసీపీ చాలా సీరియస్ గా పావులు కదుపుతోంది. కాపు ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు అంబటి తనదైన స్టైల్ లో చేయగలిగినన్న ప్రయత్నాలూ చేస్తున్నారు. కాపులలో సానుభూతి పొందేందుకూ, వారికి దగ్గరయ్యేందుకు ఆయన ఏకంగా జైలుకు వెళ్లి వచ్చారు. ఇలా ఆయన జైలుకు వెళ్లారో లేదో.. అలా వైసీపీయులు ఆయనను కాపు నేత అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అక్కడితో ఆగకుండా ఏకంగా దివంగత వంగవీటి రంగాతో సమానమైన నాయకుడంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు. ఇటీవల అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన , అంబటిని ముద్రగడ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. కాపు నాయకుడిగా అంబటి తన తరువాతే అని చాటేందుకే ముద్రగడ అంబటి నివాసానికి వెళ్లి పరామర్శ పేరుతో తనను తాను కాపు లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. కాపు సామాజిక వర్గంలో ఎవరైనా సరే తనతో సమానంగా కానీ, తనను మించి గానీ పేరు తెచ్చుకోవడాన్ని ముద్రగడ జీర్ణించుకోలేరని ఆ సమాజికవర్గంలోనే టాక్ ఉంది. ముద్రగడ జనసేనాని పవన్ కల్యాణ్ ను వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అదేనని కూడా అంటారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. కాపు నేతలను ఏకం చేస్తాననీ, వారిని వైసీపీ వైపు తీసుకువస్తానని ఇటీవలి కాలంలో ముద్రగడ అడిగిన వారీకి అడగని వారికీ కూడా అదే పనిగా చెబుతున్నారట. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం, జనసేప పార్టీలలో ఉంటూ.. సరైన గుర్తింపు లేదన్న అసంతృప్తితో ఉన్న నాయకుల కోసం గాలిస్తున్నారట. అటువంటి నాయకులతో సమావేశాలు నిర్వహించి, వారిని వైసీపీలోకి ఆహ్వానించాలన్నదే ఆయన వ్యూహంగా చెబుతున్నారు. అయితే ఇక్కడ ముద్రగడకు ఎదురైన చిక్కు ఏమిటంటే.. ఆయన ప్రయత్నాలకు వైసీపీయుల నంచే వ్యతిరేకత వస్తున్నది. ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాల కాపు కోఆర్డినేటర్లు ఈ విషయంలో ముద్రగడను బలంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు కూటమిలోని కాపు నేతలన పార్టీలోకి ఆహ్వానించి తన పదవులకు, ఉనికికి ముద్రగడ ఎసరుపెట్టేలా ఉన్నారన్నదే వారి వ్యతిరేకతకు కారణమంటున్నారు. ఇక్కడే వారు ముద్రగడ తన పేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతిని గుర్తు చేస్తూ.. తగుదునమ్మా అని ఇప్పుడు కాపులను ఏకం చేస్తాననడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు పార్టీకి చెడ్డపేరు తీసుకురావడమే కాకుండా, కాపు సామాజికవర్గాన్ని వైసీపీకి దూరం చేస్తాయని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో కాపు సామాజికవర్గానికి లీడర్ ఎవరు అన్న విషయంలో అంబటి వర్సెస్ ముద్రగడగా సీన్ మారిందని వైసీపీలోనే గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఈ రేస్ లో ఎవరు గెలుస్తారో?
Apr 06, 2026
రాష్ట్రపతికి చేరిన అమరావతి బిల్లు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక ఆ బిల్లు చట్టరూపం దాల్చే దిశగా తుది అడుగుకు చేరింది. ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు. అమరావతి బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ దాదాపు ఐదు గంటల పాటు చర్చ జరిగింద. ఉభయ సభలూ ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. వైసీపీ వినా దాదాపు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ అమరావతికి సై అన్నాయి. వైసీపీ ఓ వైపు అమరావతికి వ్యతిరేకం కాదంటూనే ఈ బిల్లుపై జరిగిన చర్చను మాత్రం బాయ్ కాట్ చేసి ఓటింగ్ కు దూరంగా ఉన్నది. పార్లమెంట్లో ఉభయ సభలలోనూ ఆమోదం పొందిన అమరావతి బిల్లును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి పంపింది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్రపతి ఆమోదం అనేది కేవలం లాంఛనప్రాయమే. రాష్ట్రపతి సంతకం చేయడంతోనే అమరావతి రాజధాని చట్టం అమలులోకి వస్తుంది. గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడుతుంది.
Apr 06, 2026
దక్షిణాది రాజకీయ ముఖచిత్రం.. పరివర్తనలో తమిళనాడు, కేరళ
భారతదేశం 2026 రాష్ట్ర ఎన్నికల వైపు పయనిస్తున్న తరుణంలో, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో రాజకీయ గతిశీలతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాంప్రదాయకంగా స్థిరమైన ఎన్నికల సరళికి ప్రసిద్ధి చెందిన ఈ రెండు రాష్ట్రాలు, ఇప్పుడు ఎన్నికల ఫలితాలను పునర్నిర్మించగల కొత్త అంశాలను చూస్తున్నాయి. 1. తమిళనాడు: తీవ్రమవుతున్న ఎన్నికల పోటీ.. మారుతున్న అధికార సమతుల్యత 2021 అసెంబ్లీ ఎన్నికలలో, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కూటమి ఈ క్రింది కారణాల వల్ల నిర్ణయాత్మక విజయాన్ని సాధించింది: బలమైన కూటమి ఐక్యత ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)పై గణనీయమైన ప్రభుత్వ వ్యతిరేకత విస్తృత సంక్షేమ హామీలు అయితే, రాష్ట్రం తదుపరి ఎన్నికల దశకు చేరుకుంటున్న కొద్దీ, రాజకీయ వాతావరణం మరింత పోటీగా మారుతోంది. కీలకమైన ఎన్నికల హామీల అమలు వేగంపై విమర్శలు కేంద్రీకృతమై ఉండటంతో, డీఎంకే ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. టీవీకే ఆవిర్భావం నటుడిగా ఉండి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) రంగ ప్రవేశం ఒక ప్రధానమైన కొత్త అంశం. టీవీకే, ముఖ్యంగా చెన్నై వంటి పట్టణ కేంద్రాలలో, మొదటిసారి ఓటు వేస్తున్న ఓటర్లను బలంగా ఆకట్టుకుంటుందని అంచనా. తక్షణమే సీట్లు గెలుచుకునే దాని సామర్థ్యం పరిమితంగా ఉన్నప్పటికీ, ఓట్లను చీల్చగల దాని శక్తి—ముఖ్యంగా డీఎంకే కంచుకోటలలో—ఎన్నికల పరంగా గణనీయమైనదిగా నిరూపించవచ్చు. ప్రాంతీయ బలాలు మరియు భవిష్యత్ అంచనాలు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో పొత్తులో ఉన్న ఏఐఏడీఎంకే ఈ క్రింది ప్రాంతాలలో నూతన బలాన్ని ప్రదర్శిస్తోంది: కొంగు ప్రాంతం ఉత్తర తమిళనాడు ఈ పరిణామాల దృష్ట్యా, తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు. 2021 ఎన్నికలలో సాధించిన విజయవంతమైన పనితీరుకు భిన్నంగా, డీఎంకే కూటమి ప్రస్తుతం గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ అస్థిరతకు అనేక కారణాలు దోహదపడుతున్నాయి: * కూటమిలో సమన్వయం కొరవడటం: కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, వామపక్ష పార్టీలతో సహా కూటమి భాగస్వాముల మధ్య అంతర్గత సంబంధాలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. 2021కి భిన్నంగా, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయిలో ఉమ్మడి ప్రచారం వంటి విషయాల్లో ఐక్యత కొరవడింది. * ప్రభుత్వ వ్యతిరేకత: 2021లో ఏడీఎంకేపై ఉన్న బలమైన ప్రభుత్వ వ్యతిరేకత డీఎంకేకు లబ్ధి చేకూర్చగా, ఇప్పుడు వారు తమ సొంత ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. చారిత్రాత్మకంగా, తమిళనాడులో ఏ ప్రభుత్వమూ వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి రాలేదు. * నెరవేరని ఎన్నికల హామీలు: 2021 ఎన్నికలకు సంబంధించి పార్టీ ఇచ్చిన అనేక కీలక హామీలను నెరవేర్చడంలో విఫలమవడం ప్రజాగ్రహానికి దారితీసింది (6:05-6:46). ప్రత్యేకంగా ప్రస్తావించిన సమస్యలలో ఇవి ఉన్నాయి: * గ్యాస్ సిలిండర్లపై వాగ్దానం చేసిన సబ్సిడీలను అమలు చేయడంలో వైఫల్యం. * మహిళలకు అందించే నెలవారీ ఆర్థిక సహాయాన్ని అసంపూర్తిగా నెరవేర్చడం. * విద్యా, బంగారు రుణాలను మాఫీ చేయకపోవడం. * పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించి చేసిన కొన్ని వాగ్దానాలను నిర్లక్ష్యం చేయడం. 2026 అసెంబ్లీ ఎన్నికల దిశగా పయనిస్తున్న తరుణంలో, ఈ సమస్యలన్నీ కలిసి డీఎంకే ఎన్నికల స్థానాన్ని బలహీనపరిచాయి. 2. కేరళ: సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ద్వంద్వాధిపత్యానికి భంగం సాంప్రదాయ రాజకీయ నిర్మాణం కేరళ రాజకీయాలపై చారిత్రాత్మకంగా రెండు కూటముల ఆధిపత్యం ఉంది: యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఈ మారుతున్న అధికార నిర్మాణం దశాబ్దాలుగా చాలా వరకు స్థిరంగా ఉంది. బీజేపీ వ్యూహాత్మక విస్తరణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పుడు ఒక అల్పస్థాయి పార్టీ నుండి పోటీపడే శక్తిగా మారడానికి ఈ క్రింది చర్యలు తీసుకుంటోంది: కుల, సామాజిక వర్గాలకు అతీతంగా తన నాయకత్వ పునాదిని విస్తరించడం క్రైస్తవ సమాజంతో చురుకుగా మమేకమవడం రాజీవ్ చంద్రశేఖర్ వంటి నాయకుల నేతృత్వంలో సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడం ఈ బహుముఖ వ్యూహం, ఎన్నికల వృద్ధి పట్ల మరింత వ్యవస్థీకృతమైన మరియు దీర్ఘకాలిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. యూడీఎఫ్-ఎల్డీఎఫ్ ద్వయాధికారంపై ఒత్తిడి బలపడిన బీజేపీ ఉనికి కొత్త సంక్లిష్టతలను సృష్టిస్తోంది: బీజేపీ లాభాలను అడ్డుకోవడానికి యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య జరిగే సాంప్రదాయ వ్యూహాత్మక ఓట్ల బదిలీలు ఇకపై సాధ్యం కాకపోవచ్చు రెండు కూటములు ఇప్పుడు ఓట్ల చీలిక ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి, ఇది వారి సొంత ఎన్నికల అవకాశాలపై ప్రభావం చూపవచ్చు అంచనా వేసిన ఫలితాలు బీజేపీ భారీ విజయాల కన్నా క్రమమైన లాభాలపై దృష్టి సారిస్తూ, డేటా ఆధారిత, లక్షిత ప్రచారాన్ని నిర్వహిస్తోంది: 20% ఓట్ల వాటాను సాధించడం ఇప్పటికీ ఒక పెద్ద లక్ష్యమే మరింత వాస్తవిక అంచనా ప్రకారం 2 నుండి 5 అసెంబ్లీ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది ఇవి స్వల్పమైనవే అయినా, కేరళ రాజకీయ ముఖచిత్రంలో ఇవి ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తాయి. ముగింపు: రాజకీయ అస్థిరతలో ఒక ప్రాంతం తమిళనాడు, కేరళ రెండూ తీవ్రమైన ఎన్నికల పోటీతత్వ దశలోకి ప్రవేశిస్తున్నాయి: ప్రభుత్వ వ్యతిరేకత, కొత్త రాజకీయ నాయకుల ఆవిర్భావం కారణంగా తమిళనాడులో పోటీ తీవ్రమవుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్వంద్వాధిపత్యాన్ని మూడవ శక్తి సవాలు చేసే అవకాశం ఉండటంతో, కేరళ నిర్మాణాత్మక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2026 సమీపిస్తున్న తరుణంలో, ఈ పరిణామాలు దక్షిణ భారతదేశంలో మరింత పోటీతత్వం గల, బహుధ్రువ రాజకీయాల వైపు విస్తృత మార్పును సూచిస్తున్నాయి. ఇక్కడ ఓట్ల వాటాలో చిన్న మార్పులు కూడా ఎన్నికల పరంగా భారీ పరిణామాలకు దారితీయవచ్చు. సంకలనం, సేకరణ: కంఠంనేని సీతారాం
Apr 06, 2026
జగన్ అధికారంలోకి రావాలంటే.. అది జరగాలి.. ఉండవల్లి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి తన వైసీపీ అనుకూల వైఖరిని బయటపెట్టుకున్నారు. స్వయం ప్రకటిత మేధావి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో ఎవరూ అడగకుండానే చెప్పేశారు. రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు. ఇంతకీ ఆయన చెప్పిందేమిటంటే.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాలన్నా, జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విచ్ఛిన్నం కావాలని చెప్పారు. అంటే ఒక రకంగా కూటమిని విచ్ఛిన్నం చేయడమొక్కటే వైసీపీ రాజకీయ ఎజెండా కావాలని ఆయన జగన్ కు ఉద్బోధించారన్న మాట. వైసీపీ ఉనికి కూటమి విచ్ఛిన్నంపైనే ఉందన్న విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత ఇలాగే ఉంటే.. మరో పది హేనేళ్లు వైసీపీకి అధికారం అందని ద్రాక్షగానే ఉంటుందని హెచ్చరించారు. మామూలుగా అయితే ఉండవల్లి ప్రస్తుతం జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన, ఆ ప్రతిపాదనపై నెటిజనుల ట్రోలింగ్ గురించి మాట్లాడాలి. మావిగన్ ప్రతిపాదనపై తన అభిప్రాయమేంటో చెప్పాలి. అలాగే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదముద్ర వేయడంపై తానేమనుకుంటున్నారన్నది చెప్పాలి. అయితే వాటి ఊసెత్తకుండానే.. వైసీపీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో చెప్పారు. కూటమి విచ్ఛిన్నం కావడం కోసం పని చేయాలని జగన్ కు, వైసీపీకి సూచించినట్లుగా ఆయన మాటలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Apr 06, 2026.webp)
బీజేపీ 46 ఏళ్ల ప్రస్థానం!
1980 ఏప్రిల్ 6న న్యూఢిల్లీలోని కోట్లా మైదానంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో బిజెపి అధికారికంగా ఆవిర్భవించింది. భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ పార్టీకి మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆనాటి సభలో ఆయన చేసిన అంధేరా ఛాటేగా, సూరజ్ నిక్లేగా, కమల్ ఖిలేగా ప్రకటనే నేడు నిజమైందని అంటారు కమలనాథులు. తెలుగులో దీనర్ధం ఏమిటంటే.. చీకటి తొలగుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది. ఆ నినాదం ఇప్పటికీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది. 2026లో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఏప్రిల్ 5 నుండి 12 వరకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేస్తోంది. ఈ వారోత్సవాల్లో భాగంగా.. వికాస్ యాత్రలు, సేవా కార్యక్రమాలను ప్లాన్ చేసింది బీజేపీ. ప్రతి బూత్ స్థాయిలో జెండా ఆవిష్కరణ, పార్టీ సిద్ధాంతకర్తలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు నివాళులర్పించడం వంటివి చేస్తోంది. కార్యకర్తలు తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేసి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక గ్రామ బస్తీ చలో కార్యక్రమం విషయానికి వస్తే.. ఏప్రిల్ 7 నుండి 12 వరకు నాయకులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ.. ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలతో కమలం పార్టీ బలంగా ఉంది. ఇక ఎమ్మెల్సీ, మున్సిపాల్టీల్లోనూ పట్టు నిలుపుకుంటూ వస్తోంది. వచ్చే ఎన్నికలలో అధికారమే టార్గెట్ గా అడుగులు వేస్తు ముందుకు సాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉంది. అటు కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి అధికారంలో ఉండటంతో, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిధులు, మరియు విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి కీలక అంశాల్లో కేంద్రం నుంచి లబ్ధి పొందడంలో బిజెపి వారధి గా పనిచేస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో బిజెపికి ప్రాతినిధ్యం ఉంది. సత్యకుమార్ యాదవ్ వంటి నేతలు మంత్రివర్గంలో కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలులో, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయడంలో బిజెపి చురుకైన పాత్ర పోషిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సొంతంగా బిజెపి ముఖ్యమంత్రులు 14 రాష్ట్రాలలో, బీజేపీ యేతర సీఎంలు ఉన్నప్పటికీ ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏడు ఉన్నాయి. అంటే దేశంలో మొత్తం 21 రాష్ట్రాలలో ప్రస్తుతం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ప్రస్తుతం అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అంటే మే 4న ఈ లెక్కల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈసారి బిజెపి గట్టి పోటీనిస్తోంది. ఏది ఏమైనా బీజేపీ తన రాజకీయ ప్రస్థానంలో స్వర్ణయుగంలాంటి రోజులను ఆస్వాదిస్తోంది. దేశ వ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ.. గా ఈ ఏడాది ఆవిర్భావ ఏడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది.
Apr 06, 2026
జోరు వానలు.. చండ్ర నిప్పులు.. ఏపీలో విభిన్న వాతావరణం
ఆంధ్రప్రదేశ్ లో భిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు జోరు వానలూ, మరో వైపు చండ్ర నిప్పులతో ఏపీ వాతావరణం ఉంది. రాష్ట్రంలో రానున్న రెండురోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో నిప్పులు చెరిగే ఎండలే, మరి కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళ (ఏప్రిల్ 6, 7) వారాల్లో ఈ ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. అదలా ఉండగా, ఆదివారం (ఏప్రిల్ 5) పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.3, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 41.8, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో 41.5, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 41.3, చిత్తూరు జిల్లా పలమనేరు, ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Apr 06, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



