
సోషల్ మీడియాయుగంలో యూ ట్యూబర్స్ తమకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని, లగ్జరీ లైఫ్‌స్టైల్‌ని అందరికీ తెలియచేయడం ఈ రోజుల్లో ఒక ట్రెండ్‌గా మారిపోయింది. కానీ, అదే అలవాటు మహిళా యూట్యూబర్‌కి కోలుకోలేని దెబ్బ కొట్టింది. తనకున్న ఆస్తులు, హోమ్ టూర్ పేరుతో ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలని వీడియోల్లో తెగ చూపించేసరికి, చివరికి దొంగల కన్ను ఆమెపై పడింది.
పక్కా స్కెచ్ వేసి మరీ అర్ధరాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు దాదాపు 7 లక్షల నుండి 10 లక్షల విలువైన సొత్తుని దోచుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో వెలుగుచూసింది. సోషల్ మీడియాలో వీడియోల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరిస్తూ జరిగిన ఈ కథనం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌కు చెందిన రచనా గుర్జర్ అనే మహిళా యూట్యూబర్ గ్రామాల్లో ఉంటూనే తన లగ్జరీ లైఫ్ స్టయిల్, రోజువారీ జీవితానికి సంబంధించిన వీడియోలను తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఆమె చేసిన ఒక హోమ్ టూర్ వీడియో, తన వద్ద ఉన్న నగలని ప్రదర్శిస్తూ చేసిన వీడియోలు కాస్తా దొంగల దృష్టిలో పడ్డాయి. ఆ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించిన దుండగులు, ఆమె ఇల్లే లక్ష్యంగా పక్కా ప్లాన్ రూపొందించుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చాలా ప్లాన్‌గా రంగంలోకి దిగిన దొంగలు, మొదట ఇంటి చుట్టూ ఉన్న రక్షణ కంచెని కట్ చేసి లోపలికి ప్రవేశించారు.
ఆ తర్వాత రచనా గుర్జర్, ఆమె భర్త పడుకున్న గదికి బయట నుంచి తాళం వేశారు. తాము దొరికిపోకుండా ఉండేందుకు ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలని పైకి తిప్పేసి, ముఖాలు రికార్డ్ కాకుండా జాగ్రత్తపడ్డారు. అలా ఇంట్లోకి చొరబడిన దొంగలు అల్మారాల తాళాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. దాదాపు 1,91,000 నగదుతో పాటు, పెద్ద మొత్తంలో బంగారు నగలు, వెండి ఆభరణాలు, విలువైన గ్యాడ్జెట్లని దోచుకున్నారు. విచిత్రం ఏంటంటే ఇంట్లో ఫ్రిజ్‌లో ఉన్న 'రెడ్ బుల్' ఎనర్జీ డ్రింక్ బాటిళ్లని కూడా దొంగలు వదలకుండా తాగుతూ పట్టుకెళ్లిపోయారు.
Also read: Thaman: తమన్ షాకింగ్ కామెంట్స్.. దేవిశ్రీప్రసాద్ 'ఎల్లమ్మ' కథ లీక్ చేశారా?
తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో దాహం వేసి రచనా గుర్జర్ నిద్ర లేచింది. రూమ్ తలుపు తీద్దామంటే బయట నుంచి లాక్ చేసి ఉండటంతో అనుమానం వచ్చింది. దీంతో గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తెరిచారు. అప్పుడు గానీ ఇంట్లో జరిగిన భారీ చోరీ వెలుగులోకి రాలేదు. దొంగిలించిన ఆస్తుల విలువ మొత్తం 7 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఉంటుందని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలని పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో మన పర్సనల్ విషయాలు, ఆస్తుల వివరాలని మితిమీరి షేర్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.





