స్టార్ హీరోల కోసం ఫేక్ రికార్డులు చూపిస్తారు.. ఇలా చేయడం తప్పు అని వాళ్లే అంటారు!
on Jun 12, 2025
టాలీవుడ్ ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ అనిపించుకుంటోంది. దానికి కారణం అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చాయి. 20 ఏళ్ళు వెనక్కి వెళితే.. తెలుగు సినిమాలు అనేవి ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. ఏం చేసినా, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసినా ఇక్కడే చెయ్యాలి. కాబట్టి టాప్ హీరోలు ఈ విషయంలో కాస్త ఎలర్ట్‌గా ఉండేవారు. తమ సినిమాలు రిలీజ్ దగ్గర నుంచి 50 రోజులు, 100 రోజుల సెంటర్స్ వరకు కొత్త రికార్డులు క్రియేట్ చెయ్యాలని తపన పడేవారు. సినిమా రిలీజ్ అయ్యే థియేటర్ల సంఖ్య నుంచి మొదటి రోజు కలెక్షన్లు, 10 రోజుల కలెక్షన్లు, 50 రోజుల కలెక్షన్లు.. ఇలా ప్రతి ఒక్క దానిలో తామే టాప్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసేవారు. దానికి తగ్గట్టుగానే నిర్మాతలు, బయ్యర్లు తమ శాయశక్తులా కృషి చేసి ఆ రికార్డులు రావడానికి ప్రయత్నించేవారు. ఇక అభిమానుల సంగతి సరేసరి. కొన్ని సెంటర్స్‌లో తామే టిక్కెట్లు కొన్ని థియేటర్స్‌ని ఫుల్ చేసిన సందర్భాలు అనేకం. ప్రకటిస్తున్న ఫిగర్స్ అన్నీ ఫేక్ అని అప్పట్లో విమర్శలు వచ్చేవి. రికార్డుల విషయంలో హీరోల అభిమానుల మధ్య ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయి.
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా అనేది యూనివర్సల్ అయిపోయింది. పాన్ ఇండియా మూవీస్ ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. సినిమా మార్కెట్ అనేది బాగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా సాధించే కలెక్షన్సే ఇప్పుడు ప్రామాణికంగా మారాయి. దాంతో సినిమా ప్రమోషన్‌ని కూడా భారీగా చెయ్యాల్సి వస్తోంది. కాబట్టి అన్ని ప్లాట్‌ఫామ్‌లపై తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా మార్కెట్ ఎంత విస్తరించినా హీరోలకు రికార్డులపై మోజు మాత్రం తగ్గడం లేదు. తమ సినిమాకి సంబంధించిన టీజర్‌గానీ, ట్రైలర్‌గానీ రిలీజ్ అయిన తర్వాత ఒక్కరోజులో ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటూ ప్రకటించుకోవడం సర్వసాధారణం అయిపోయింది. అవి నిజంగా వచ్చిన వ్యూసేనా అనే డౌట్ ప్రేక్షకుల్లో ఉండేది. డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కొని తమ సినిమా ట్రైలర్ రికార్డు క్రియేట్ చేసిందంటూ పబ్లిసిటీ చేసుకుంటారు అనే విమర్శ కూడా ఉంది. ఇప్పుడు దాన్ని నిర్మాత దిల్‌రాజు కన్‌ఫర్మ్ చేసేశారు. నితిన్‌తో దిల్‌రాజు చేస్తున్న తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్‌లో ఈ విషయాన్ని బట్టబయలు చేశారు.
ఒకప్పుడు అందరు నిర్మాతలు ఇలాంటి ఫేక్ సెంటర్స్, ఫేక్ కలెక్షన్లతో పేపర్లలో యాడ్స్ ఇచ్చినవారే. ఇందులో ఏ ఒక్క నిర్మాతా మినహాయింపు కాదు అనేది ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ నిర్మాతలే అలాంటి పనులు చేయడం తప్పు అని చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాలకు నిర్మాణ వ్యయం పెరిగిపోతోందని గుండెలు బాదుకునే నిర్మాతలు ఎప్పుడూ ఉంటారు. సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్కులు ప్లే చేస్తూ డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తే బడ్జెట్ పెరగకుండా ఎలా ఉంటుంది? నిర్మాత దిల్‌రాజు చెప్పినట్టు సినిమాకి కంటెంట్ అనేదే ముఖ్యం. హీరోలు, దర్శకనిర్మాతలు దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సినిమాలో విషయం ఉంటే ఎలాంటి ప్రమోషన్స్ చెయ్యాల్సిన అవసరం లేదు అని గతంలో సూపర్‌హిట్ అయిన అనేక సినిమాలు ప్రూవ్ చేశాయి. ప్రజెంట్ జనరేషన్‌లోని ప్రేక్షకులు అంత అమాయకులు కాదు అనే విషయం హీరోలు గ్రహించాలి. అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా వివిధ రూపాల్లో సినిమాలకు సంబంధించిన పూర్తి సమాచారం వారికి చేరుతుంది. కాబట్టి ఇకనైనా వ్యూస్ విషయంలోగానీ, సినిమాలకు వచ్చే కలెక్షన్ల విషయంలోగానీ జెన్యూన్‌గా ఉంటే వారికే మంచిది.
యూ ట్యూబ్‌లో డబ్బు పెట్టి వ్యూస్ కొనుక్కొని ఫేక్ రికార్డులు చూపిస్తున్నారని ఇప్పటి వరకు ఏ నిర్మాతా వేదికపై చెప్పలేదు. ఈ విషయాన్ని మొదటిసారి దిల్‌రాజు అందరి దృష్టికి తీసుకురావడం మంచి విషయమే. అంతేకాదు, భవిష్యత్తులో కలెక్షన్లకు సంబంధించి రెంట్రాక్ పద్ధతిని తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. దీని వల్ల ఫేక్ ఫిగర్స్‌ను గుర్తించే అవకాశం ఉంటుందని దిల్‌రాజు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌కి పంపించామని ఆయన తెలిపారు. అదే జరిగితే.. ప్రతి సినిమాకి సంబంధించిన జెన్యూన్ రిపోర్ట్ వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
