
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ దండయాత్రకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు రాత్రికే 'పెద్ది' అసలు పవర్ ఏంటో ప్రపంచానికి తెలియనుంది. సినిమా విడుదల కోసం నార్త్ అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రం కోసం ప్రత్యేక జీవో జారీ చేయడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది.
తెలంగాణలో 'పెద్ది' చిత్రానికి ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో పాటు 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు, రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి లభించింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో తరహాలోనే తెలంగాణలోనూ సింగిల్ స్క్రీన్స్ లో రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.125 వరకు టికెట్ ధరల పెంపుకు క్లియరెన్స్ వచ్చింది. గతంలో కొన్ని పెద్ద సినిమాల విషయంలో జరిగిన గందరగోళానికి తావులేకుండా ఈసారి ప్రభుత్వం ముందుగానే స్పష్టత ఇవ్వడం విశేషం.
సంక్రాంతి సీజన్ తర్వాత బాక్సాఫీస్ వద్ద సరైన కమర్షియల్ హంగామా లేక వెలవెలబోయిన థియేటర్ల ఆకలిని తీర్చడానికి 'పెద్ది' సిద్ధమైంది. ఈ సినిమా కోసం సింగిల్ స్క్రీన్స్ యజమానులు థియేటర్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. చాలా చోట్ల థియేటర్లకు రంగులు వేసి, సౌండ్ సిస్టమ్స్ రిపేర్ చేయించి మరీ ప్రేక్షకుల కోసం సిద్ధం చేశారు. ఈ ఏడాది ఎగ్జిబిటర్లకు కావలసినంత బంపర్ రెవెన్యూను ఈ ఒక్క సినిమానే తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ట్రేడ్ వర్గాలు ఉన్నాయి.
'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ప్రాజెక్ట్ కావడం, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్ హీరోయిన్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా "ఈ సినిమా కేవలం కమర్షియల్ చిత్రం కాదు.. ఇదొక ఎమోషనల్ రైడ్.. లాస్ట్ 50 మినిట్స్ చూసి నేనే 50 సార్లు ఏడ్చాను" అని దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన మాటలు నెట్టింట మంట రాజేసాయి. ఈ మూవీ సెకండ్ హాఫ్ ఎమోషన్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో కనెక్ట్ చేస్తుందనే దానిపైనే సినిమా రేంజ్ ఆధారపడి ఉంది.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం 'పెద్ది' సినిమా టార్గెట్ 1000 కోట్ల క్లబ్. బుచ్చిబాబుకు ఇది రెండో సినిమానే అయినా, గతంలో రాజమౌళికి రెండో సినిమా 'సింహాద్రి' ఎలాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిందో, 'పెద్ది' కూడా చరణ్ కెరీర్‌లో అలాంటి మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. నార్త్ అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ రాత్రి పడబోయే ప్రీమియర్ షోల టాక్ కోసం యావత్ సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.





