విశ్వక్ సేన్ సినిమాలకే వివాదాలు ఎందుకు.. ఎవరికి ప్రయోజనం..?
on Feb 11, 2025
సినిమా తీయడం ఒకెత్తయితే, దానిని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ప్రమోషన్స్ కోసం అందరూ తెగ ఖర్చు పెడుతుంటారు, బాగా కష్ట పడుతుంటారు. కానీ విశ్వక్ సేన్ సినిమాలకు మాత్రం పెద్దగా కష్ట పడకుండానే పబ్లిసిటీ అవుతుంది. సరిగ్గా విడుదలకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ జరిగి, ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. తాజాగా లైలా విషయంలోనూ అదే జరిగింది.
2019 లో వచ్చిన 'ఫలక్‌నుమా దాస్' మొదలు కొని, ఈ ఫిబ్రవరి 14న విడుదల కానున్న 'లైలా' వరకు.. విశ్వక్ సేన్ సినిమా వస్తుందంటే విడుదలకు ముందు దాదాపు ఏదో ఒక వివాదం జరుగుతూనే వస్తోంది. 'ఫలక్‌నుమా దాస్' ఈవెంట్ లో "నన్ను ఎవడు లేపక్కర్లేదు. నన్ను నేనే లేపుకుంటా" అంటూ విశ్వక్ చేసిన కామెంట్స్ పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసినట్లుగా అప్పట్లో చర్చ నడిచింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో విశ్వక్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఆ తర్వాత కూడా విశ్వక్ సినిమాల విడుదలకు ముందు ఏదో ఒక వివాదం జరుగుతూనే వచ్చింది. ఒక సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ ప్రాంక్ వీడియో చేయగా అది వైరల్ అయింది. అంతేకాదు, ఆ ప్రాంక్ వీడియోపై ఒక టీవీ యాంకర్ తో విశ్వక్ కి గొడవ జరిగింది. అలాగే ఒకసారి 'బేబీ' దర్శకుడితోనూ కాంట్రవర్సీ అయింది. ఇక ఇప్పుడు 'లైలా' సినిమాపై కూడా వివాదం నడుస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. 150 మేకలలో 11 మేకలే మిగిలాయి అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఇవి పరోక్షంగా వైసీపీ సీట్లపై చేసిన కామెంట్స్ లా ఉండటంతో.. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో 'బాయ్ కాట్ లైలా' అంటూ ట్రెండ్ చేశారు. దీనిపై స్పందించిన విశ్వక్.. ఎవరో ఒకరు చేసిన కామెంట్స్ కి ఇలా సినిమాని చంపాలనుకోవడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
విశ్వక్ ఎవరినీ నేరుగా విమర్శించకపోయినా ఏదో ఒక వివాదం అవుతుంది. ఇక లైలా విషయంలో అయితే తను ఏం కామెంట్స్ చేయకుండానే కాంట్రవర్సీ అయింది. దీంతో విశ్వక్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. కానీ, నిజానికి ఈ కాంట్రవర్సీ వల్ల లైలా కే ప్లస్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొన్నటివరకు ఈ సినిమా గురించి ఎంత మందికి తెలిసిందో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మందికి ఇంకా బలంగా చేరువైంది. బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ అయింది.
ఏ హీరో సినిమాకి జరగనంతగా విశ్వక్ సేన్ సినిమాల విడుదలకు ముందు ఇలా వివాదాలు జరుగుతూ ఉన్నాయి. దీని వల్ల లాభమెంత? నష్టమెంత? అనేది పక్కన పెడితే.. సినిమా గురించి అయితే అందరూ మాట్లాడుతున్నారు.
మరి ఇలా వివాదాలతో వచ్చే ఫ్రీ పబ్లిసిటీ వల్ల లాభమా నష్టమా?.. మీ అభిప్రాయమేంటో తెలియచేయండి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
