
-హీరో విష్ణు విశాల్ షాకింగ్ ట్వీట్
-ఫేస్ మారిపోవడానికి కారణం అదే
-మూడు సంవత్సరాలపై నుంచే ఆ వ్యాధితో బాధపడుతున్నాను
వెరీ టాలెంటెడ్ తమిళ హీరో విష్ణు విశాల్(vishnu vishal).. తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడు. ఆయన నటించిన ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు తెలుగులోకి అనువాదమై మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా దగ్గుబాటి రానాతో కలిసి చేసిన 'అరణ్య' సినిమాతో పాటు, సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎఫ్‌ఐఆర్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలను ప్రేమించి వివాహం చేసుకోవడంతో ఆయన తెలుగు రాష్ట్రాల అల్లుడిగా ఇక్కడి ఆడియెన్స్‌కి మరింత చేరువయ్యారు. కొన్ని రోజులుగా విష్ణు విశాల్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు షికారు చేస్తున్నాయి. ఆయన శారీరక రూపం మారిపోవడం, ముఖంలో తీవ్రమైన అలసట కనిపించడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకి పుల్ స్టాప్ వేస్తూ విష్ణు విశాల్ ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్‌షేర్ చేశాడు.
తన పోస్ట్‌లో పేర్కొంటూ, "అందరికీ హాయ్.. అన్నిటికంటే ముందుగా మీ కామెంట్స్, మెసేజుల ద్వారా మీరు చూపిన అపారమైన ప్రేమకి , నా ఆరోగ్యం పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మీ నుంచి లభిస్తున్న ఈ మద్దతు నాకు నిజంగా ఎంతో విలువైనది. అందుకే ఏ విషయాన్నీ దాచకుండా నా ఆరోగ్య పరిస్థితిని మీ అందరితోను నేరుగా పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నా ముఖం చాలా అలసిపోయినట్లు, కాస్త వాచినట్లు కనిపిస్తోందని మీలో చాలామంది గమనించి మెసేజ్‌లు చేశారు. ఆ మార్పులకు గల అసలు కారణాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను.
నేను గత మూడు నుంచి నాలుగు సంవత్సరాలుగా 'ఆటో ఇమ్యూన్' (Autoimmune) అనే వ్యాధితో పోరాడుతున్నాను. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా వైద్యులు నాకు కొన్ని ప్రత్యేకమైన మందులని సూచించారు. దాంతో వాటిని వాడుతు ఉన్నాను. అయితే, ఆ బలమైన మందుల వాడకం వల్ల నా శరీరంలో కొన్ని స్పష్టమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నా ముఖంలో కనిపిస్తున్న ఉబ్బరం, విపరీతమైన నీరసం ఆ మందుల ప్రభావం వల్ల వచ్చినవే. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యపరంగా ఈ చికిత్సని కొనసాగించడం నాకు ఎంతో అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా నా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది" అని విష్ణు విశాల్ భావోద్వేగానికి లోనయ్యారు.
Also read: khushbu: గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్
'నా జీవితంలో ఎదురైన ఈ క్లిష్ట సమయంలో మీరంతా చూపిస్తున్న ప్రేమ, అభిమానం నన్ను మానసికంగా ముందుకు నడిపిస్తున్నాయి. నా తదుపరి చిత్రం 'గట్ట కుస్తీ 2' (తెలుగులో మట్టి కుస్తి 2) కోసం రాత్రింబగళ్లు అవిశ్రాంతంగా పనిచేసిన చిత్ర యూనిట్ సభ్యుల పట్ల నాకు ఎంతో బాధ్యత ఉంది. వారి కష్టాన్ని గౌరవిస్తూ, నా ఆరోగ్యం సహకరించకపోయినా సరే ప్రమోషన్లలో పాల్గొంటున్నాను. నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే అలసటను సైతం లెక్కచేయకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. త్వరలోనే నా ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుందని నమ్ముతున్నాను. నాపై మీకున్న భయం, ఆందోళన నన్ను నేను మరింత జాగ్రత్తగా చూసుకోవడానికి ఎంతో ప్రోత్సహించాయి. వచ్చే జూలై 3వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న 'గట్ట కుస్తీ 2' ని మీ అందరితో కలిసి చూడటం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అంటూ తన ట్వీట్ లో తెలిపాడు.






