Home

»

Latest News

రైలు ప్రయాణంలో ఉత్కంఠభరిత ఘటనలు.. విజయ్ సేతుపతి ‘ట్రైన్’ టీజర్ చూశారా?

Oct 31, 2026 4:54PM

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు ‘ట్రైన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు మిష్కిన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా రిలీజ్ టీజర్‌ను కూడా విడుదల చేశారు.

‘ట్రైన్’ సినిమా విషయానికి వస్తే.. ఇదొక యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఓ రైలు ప్రయాణంలో జరిగే ఉత్కంఠభరితమైన సంఘటనల చుట్టూ కథ తిరుగుతుందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న రైలు.. అందులో భయాందోళనలకు గురవుతున్న ప్రయాణికులు.. వారిని ఎదుర్కొంటూ పోరాడే విజయ్ సేతుపతి పాత్ర ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా మిష్కిన్ తనదైన శైలిలో ఈ కథను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. అయితే సినిమా పూర్తి కథాంశాన్ని మాత్రం చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు.

ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. వీరితో పాటు నాజర్, యుగి సేతు, నరేన్, కె.ఎస్. రవికుమార్, సంపత్ రాజ్, కలైయరసన్, ఇరా దయానంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కలైపులి ఎస్. థాను తన వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫౌజియా ఫాతిమా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. దర్శకుడు మిష్కిన్ స్వయంగా సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

నిజానికి ‘ట్రైన్’ సినిమా 2023లోనే ప్రారంభమైంది. అయితే పలు కారణాలతో విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. 2025లోనే విడుదలవుతుందని ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై దర్శకుడు మిష్కిన్ కూడా గతంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పుడు డిసెంబర్ 4న విడుదల తేదీ ఖరారు కావడంతో విజయ్ సేతుపతి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మరి మిష్కిన్ తనదైన థ్రిల్లర్ టేకింగ్‌తో ఈసారి ఎలాంటి అనుభూతిని అందిస్తారో చూడాలి.

 

 

[Vijay Sethupathi Train Movie, Train Movie Release Date, Vijay Sethupathi, Mysskin, Shruti Haasan, Train Movie Teaser, Tamil Movies 2026, Train Movie December 4]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com