
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'రణబాలి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'రణబాలి' ఒక సాధారణ పీరియాడిక్ ఫిల్మ్ కాదు. చరిత్రలో దాగిన కొన్ని చీకటి పేజీల కథ.
1876 నుండి 1878 వరకు దక్షిణ భారతదేశాన్ని పట్టి పీడించిన 'గ్రేట్ మద్రాస్ ఫామైన్' (కరువు) నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. వర్షాలు పడక, పంటలు పండక ప్రజలు అల్లకల్లోలమైపోయారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కరువు రక్కసి కోరల్లో చిక్కుకుని నలిగిపోయింది. ఒక్క రాయలసీమలోనే దాదాపు ఏడు లక్షల మంది ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ఒక వైపు జనం తిండిలేక నకనకలాడిపోతుంటే, అప్పటి బ్రిటిష్ పాలకులు మాత్రం మన దేశం నుంచి ధాన్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూనే ఉన్నారు. సర్ రిచర్డ్ టెంపుల్ అనే బ్రిటిష్ అధికారి కరువు నివారణ క్యాంపులను నిర్వహించాడు. కానీ ఆ క్యాంపుల్లో ఇచ్చే ఆహారం జైలు ఖైదీలకు ఇచ్చే తిండి కంటే కూడా తక్కువ కేలరీలు ఉండేది. దాంతో జనం ఆకలితో అస్థిపంజరాల్లా మారి చనిపోయారు. ఈ క్రూరమైన పాలనను, పన్నుల వసూళ్లను చూసి తట్టుకోలేకపోయిన రాయలసీమ ప్రజలు చివరకు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
ఆకలితో ఉన్న తమ బిడ్డల కోసం ధాన్యపు గిడ్డంగులపై దాడి చేశారు, పన్నులు కట్టేది లేదని తెగేసి చెప్పారు. చరిత్ర పుస్తకాల్లో బ్రిటిష్ పాలకులు వీరిని ‘నేరస్థులు’గా ముద్రవేశారు. కానీ రాయలసీమ జానపద కథల్లో, చరిత్రలో వీరు అమరవీరులుగా నిలిచిపోయారు. ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన ఒక వీరుడి కథే ఈ 'రణబాలి'. విజయ్ దేవరకొండ ఇందులో రాయలసీమ పోరాట వీరుడిగా కనిపిస్తుంటే, రష్మిక జయమ్మ అనే వీరనారి పాత్రలో నటిస్తోంది. అలాగే హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో బ్రిటిష్ అధికారిగా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.
[Ranabaali Real Story, Ranabaali Teaser, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Madras Famine, Telugu Film News, Telugu News]






