
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా చేస్తున్న తాజా చిత్రం 'రణబాలి' (Ranabaali). వివాహం తర్వాత వస్తున్న మూవీ కావడంతో రణబాలి' పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టాక్సీవాలా,శ్యామ్ సింగ్ రాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు కూడా కావడంలో అంచనాల స్థాయి మరింత పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 1854 నుండి 1878 మధ్య కాలంలో, బ్రిటిష్ పాలన నాటి వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇటీవల వైఎస్ఆర్ కడప జిల్లాలోని చారిత్రక గండికోటలో కీలక షెడ్యూల్ ని చిత్రీకరించారు.ఇలాంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌కు సంబంధించి ఒక ఆసక్తి కర న్యూస్ తెరపైకి వచ్చింది.
గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో విజయ్ దేవరకొండపై తీవ్రమైన ట్రోలింగ్, దుష్ప్రచారం సాగుతోంది. 'రణబాలి' సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ నిర్మాతల వద్ద భారీ డిమాండ్లు ఉంచాడని, సెట్స్‌లో తన కోసం ప్రత్యేకంగా 5 నుండి 6 కారవాన్లు కావాలని కోరాడని ఒక వార్త వైరల్ అయింది. అంతేకాదు, తన వ్యక్తిగత సిబ్బందిగా దాదాపు 40 నుండి 50 మంది అసిస్టెంట్లు ఉండాలని ఆయన పట్టుబట్టాడంటూ నెట్టింట కొందరు తప్పుడు స్క్రీన్ షాట్లని సృష్టించి ప్రచారం చేశారు. విజయ్ దేవరకొండ చేసిన ఈ విపరీతమైన డిమాండ్ల వల్ల విసిగిపోయిన నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ని కూడా ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించారు. ఈ ప్రచారం కాస్తా వైరల్ కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఆందోళన చెందగా, యాంటీ ఫ్యాన్స్ దీనిపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలో సదరు ప్రచారంపై విజయ్ దేవరకొండ టీమ్ స్పందిస్తూ 'కొందరు వ్యక్తులు పనిగట్టుకుని విజయ్ ప్రతిష్టని దెబ్బతీయడానికి ఎక్స్ (ట్విటర్) వేదికగా చేస్తున్న దుష్ప్రచారమని తేల్చి చెప్పింది. ప్రముఖ సినిమా వెబ్‌సైట్ల లోగోలని వాడుకుంటూ ఫేక్ స్క్రీన్ షాట్లని సృష్టించారని మండిపడింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని ప్రేక్షకులను కోరుతూ, ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసేవారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విజయ్ టీమ్ ఇచ్చిన ఈ క్లారిటీతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.
Also read: vandemataram srinivas: హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు.. హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై 'రణబాలి' చిత్ర నిర్మాత వై. రవిశంకర్ (రవి) స్వయంగా స్పందించి అసలు నిజాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ముమ్మాటికీ అవాస్తవాలని, పూర్తిగా నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు. షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండతో తమకు ఎలాంటి సమస్యలు రాలేదని, ఆయన ఎప్పుడూ తన పనిపై పూర్తి అంకితభావంతో, క్రమశిక్షణతో ఉంటారని ప్రశంసించారు. ఒక చారిత్రక పాత్ర కోసం విజయ్ ఎంతో కష్టపడుతున్నారని, గుర్రపు స్వారీ వంటి విద్యలను నేర్చుకుని మరీ ఈ సినిమా కోసం శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా నటిస్తుండగా, ఆయనకు మరియు విజయ్‌కు మధ్య వచ్చే 16 రోజుల క్లైమాక్స్ ఫైట్ సినిమాకే ప్రధాన హైలైట్ కానుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. నిర్మాతలు ఇచ్చిన ఈ అధికారిక వివరణతో విజయ్ దేవరకొండపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి పూర్తిగా అడ్డుకట్ట పడినట్లయింది.







