
విజయ్ ఆంటోని(Vijay Antony),దర్శకుడు శశి(Sasi)కాంబినేషన్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే చిత్రం 'బిచ్చగాడు'. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన ఈ సెన్సేషనల్ హిట్ తర్వాత, దాదాపు పదేళ్ల విరామం అనంతరం ఈ క్రేజీ కాంబో వంద దేవుళ్ళు' అనే ఒక సున్నితమైన, అత్యంత భావోద్వేగభరితమైన పల్లెటూరి కథతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జూన్ 19 రిలీజ్ డేట్. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.
రీసెంట్ గా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో విజయ్ ఆంటోని మాట్లాడుతు శశి గారు కథ చెప్తే కళ్ళు మూసుకుని సంతకం చేస్తాను. ఆయన మేకింగ్ విధానం అంత అద్భుతంగా ఉంటుంది. ఎంతలా అంటే, ఆ మూవీలో నా క్యారక్టర్ ప్రాధాన్యత గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. సినిమా లాస్ట్ సీన్ లో కేవలం ఒక్క నిమిషం కనిపించినా నాకు పర్వాలేదు శశి గారు, మీ కథలో నేను భాగమైతే చాలు' అని నేను స్వయంగా అడిగాను. కథ వినగానే కన్నీళ్లు ఆపులొకపోయాను అని ఎమోషనల్ అయ్యాడు. ఒక స్టార్ హీరో అయి ఉండి, దర్శకుడి విజన్‌పై ఇంతటి నిరుపమానమైన నమ్మకాన్ని చూపించడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.
Also read: Varanasi: వారణాసికి బడ్జెట్ కష్టాలు.. ఓటీటీ దిగ్గజాల షాకింగ్ నిర్ణయం
ఈ చిత్రం కథాంశం విషయానికి వస్తే, సమాజంలో అత్యంత గౌరవించదగిన ఇద్దరు మనుషుల చుట్టూ తిరుగుతుంది. ఒకరు మనకు జన్మనిచ్చిన 'అమ్మ', మరొకరు మనకు అన్నం పెట్టే 'రైతు'. ఒక మగవాడి జీవితాన్ని సంపూర్ణంగా మార్చే స్త్రీ శక్తి గురించి, ముఖ్యంగా ఇద్దరు కొడుకులని ఒంటరిగా పెంచి పెద్ద చేసిన ఒక విధవరాలైన తల్లి కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. సమాజంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను, వారి కష్టాలను కూడా దర్శకుడు శశి చూపించారు. 'బిచ్చగాడు' చిత్రంలో కేవలం మదర్ సెంటిమెంట్‌తో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ఈ కాంబినేషన్, ఈసారి 'వంద దేవుళ్ళు' చిత్రంతో అంతకు మించిన భావోద్వేగాలను, సామాజిక స్పృహను పంచుతామని 100 శాతం నమ్మకంతో చెబుతోంది. శర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రమణాంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రంలో స్వాసిక విజయ్ హీరోయిన్ కాగా అజయ్ ధిషన్, కావ్య అనిల్ కీ రోల్స్ పోషించారు.







