Home

»

Latest News

సంక్రాంతికి వస్తున్నాం.. రెడీ అవుతున్న వెంకటేష్‌, త్రివిక్రమ్‌!

Apr 16, 2025

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ డైరెక్టర్స్‌లో త్రివిక్రమ్‌ది ఒక ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా కథ, కథనాలకు, సంభాషణలకు ఒక కొత్త దారిని ఏర్పరచిన రచయిత త్రివిక్రమ్‌. స్వయంవరం చిత్రంతో రచయితగా తన కెరీర్‌ని ప్రారంభించి అరడజనుకుపైగా సినిమాలకు కథ, మాటలు అందించారు. ఆ సమయంలోనే వెంకటేష్‌ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’ చిత్రం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. 2001లో యాక్షన్‌, ఫ్యాక్షన్‌ చిత్రాలు రాజ్యమేలుతున్న దశలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ కథ, మాటలు అందించగా కె.విజయభాస్కర్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు కావస్తున్నా ఆ సినిమాలోని కామెడీని, డైలాగ్స్‌ని ప్రేక్షకులు ఇప్పటికీ ఫ్రెష్‌గా ఫీల్‌ అవుతారు. ఆ తర్వాతి సంవత్సరమే ‘నువ్వే నువ్వే’ చిత్రంతో త్రివిక్రమ్‌ దర్శకుడిగా మారినప్పటికీ 2004లో వెంకటేష్‌ హీరోగా కె.విజయభాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మల్లీశ్వరి’ చిత్రానికి కథ, మాటలు అందించారు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఇక ఆ తర్వాత తన కథలను తనే డైరెక్ట్‌ చేస్తూ వచ్చారు త్రివిక్రమ్‌. రచయితగా విక్టరీ వెంకటేష్‌కి రెండు సూపర్‌హిట్‌ సినిమాలు చేసి 20 సంవత్సరాలు పూర్తయినా వెంకీతో డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌ ఒక్క సినిమా కూడా చేయలేదు. 

నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్‌ ఉన్నారు. డైరెక్టర్‌గా మారిన తర్వాత త్రివిక్రమ్‌ ఎలాంటి బ్లాక్‌బస్టర్స్‌ చేశారో అందరికీ తెలిసిందే. వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కలిసి సినిమా చేస్తే చూడాలని ప్రేక్షకులు, వెంకటేష్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్‌లాంటి రైటర్‌కి, వెంకటేష్‌ వంటి హీరోకి ఒక మంచి సినిమా సెట్‌ అయితే తప్పకుండా అది పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కాంబోలో సినిమా చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. అయితే వీరి కాంబోలో సినిమా రాబోతోందనేది వెంకటేష్‌ అభిమానులకు సంతోషాన్ని కలిగించే వార్త. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సైంధవ్‌’ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని నిరాశపరిచినా, ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ సాధించారు విక్టరీ వెంకటేష్‌. ఈ సినిమా తర్వాత ఎవరి కాంబినేషన్‌లో సినిమా చెయ్యాలి అని ఎదురుచూస్తూ ఎన్నో సబ్జెక్ట్స్‌ విన్నప్పటికీ ఏదీ సెట్‌ అవ్వలేదు. చివరికి త్రివిక్రమ్‌ సరైన ఆప్షన్‌లా వెంకీకి కనిపించారు. 

బన్నీతో తివ్రిక్రమ్‌ ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఆల్‌రెడీ జరుగుతోంది. అయితే అట్లీ కాంబినేషన్‌లో బన్నీ చేయబోయే సినిమా ముందుగా స్టార్ట్‌ అవుతుంది. దీంతో తివ్రిక్రమ్‌కి టైమ్‌ దొరికింది. బన్నీతో చేసే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసి ఆ తర్వాత వెంకటేష్‌తో ఓ సినిమా చెయ్యాలని తివ్రిక్రమ్‌ ప్లాన్‌ చేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఫ్యామిలీ ఎంటర్‌టైనరే కాబట్టి షూటింగ్‌ కూడా వీలైనంత త్వరగానే పూర్తి చేస్తారు తివ్రిక్రమ్‌. ఈలోగా బన్నీ, అట్లీ సినిమా కూడా ముగింపు దశకు వస్తుంది. అప్పుడు బన్నీ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన వెంకీ వచ్చే ఏడాది సంక్రాంతిపై కూడా కన్నేసినట్టు కనిపిస్తోంది. వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోసారి వీరి కాంబో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com