Home

»

Latest News

ఎన్టీఆర్ డైలాగ్ వివాదం: వరుణ్ తేజ్ క్లారిటీ

Aug 7, 2026 6:27PM

 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య,ప్రస్తుతం ఇండో కొరియన్ హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' తో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కగా మూవీ చుట్టూ  ఊహించని వివాదం ముసురుకుంది. సినిమాలో కమెడియన్ సత్య చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ ఓల్డ్ డైలాగ్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీసింది. నందమూరి అభిమానులు ఈ సన్నివేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, స్వయంగా కథానాయకుడు వరుణ్ తేజ్ ఈ అంశంపై మీడియా వేదికగా స్పందించి పూర్తి వివరణ ఇచ్చారు. 


రీసెంట్ గా యువీ క్రియేషన్స్ ఆఫీస్‌లో జరిగిన సినిమా సక్సెస్ వేడుకలో వరుణ్ తేజ్ ఈ వివాదానికి చెక్ పెట్టారు. "మాకు సీనియర్ ఎన్టీఆర్ గారన్నా, నందమూరి కుటుంబమన్నా అత్యంత గౌరవం ఉంది. ఎవరినీ కించపరచాలనే ఆలోచన మాకు ఎప్పుడూ లేదు. సోషల్ మీడియాలో ట్రోల్స్ రాకముందే, అంటే దాదాపు 9 నెలల క్రితం 2025 నవంబర్‌లోనే మేము ఈ సన్నివేశాన్ని షూట్ చేసాం.ఇటీవల వైరల్ అయిన ట్రెండ్‌ను చూసి మేమేమీ కావాలని ప్లాన్ చేసి డిజైన్ చేసింది కాదు. కథాగమనంలో భాగంగా వినోదం కోసం మాత్రమే ఆ సీన్ రాసుకున్నాం. ఇది కేవలం సరదా ఇమిటేషన్ మాత్రమే తప్ప ట్రోలింగ్ కాదు. "ఇమిటేషన్‌కు, ట్రోలింగ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. గతంలో మేము పవన్ కళ్యాణ్ గారి 'వకీల్ సాబ్' రోల్‌ను, అలాగే కృష్ణ గారి మేనరిజమ్స్‌ను కూడా ప్రమోషన్లలో ఇమిటేట్ చేశాము. సినిమా రంగంలో గొప్ప నటుల ఐకానిక్ సీన్లను ఆరాధనతో అనుకరించడం వినోదంలో భాగం. నటుడు సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులు నవ్వుకుంటారని మాత్రమే ఆ సీన్ చేశాడు తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు" అని వ్యాఖ్యానించారు.  దర్శకుడు మేర్లపాక గాంధీ కూడా మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారి పట్ల తమకున్న అభిమానాన్ని పునరుద్ఘాటించారు. అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ఈ వివాదానికి ఇక్కడితో స్వస్తి పలకాలని కోరారు. అలాగే ఈ సందర్భంగా తన వ్యక్తిగత ఆనందాన్ని పంచుకుంటూ, బాబు పుట్టిన తర్వాత తన జీవితం మరింత సంతోషంగా ఉందంటూ లావణ్య త్రిపాఠి సంతోషాన్ని, కుటుంబ విశేషాలను కూడా వరుణ్ తేజ్ పంచుకున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ సకాలంలో ఇచ్చిన స్పష్టమైన వివరణతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది.


అసలు ఈ వివాదానికి మూలం 1978 లో విడుదలైన సీనియర్ ఎన్టీఆర్ నటనలోని ఆల్ టైమ్ హిట్ చిత్రం 'యుగపురుషుడు'. ఆ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన "మిస్టర్, మీ స్ట్రోక్స్ చాలా అమెచ్యూరిష్‌గా ఉన్నాయి... ఇదివరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా?" అనే డైలాగ్ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా మీమ్స్‌గా వైరల్ అయింది. సరిగ్గా ఇదే సమయానికి విడుదలైన 'కొరియన్ కనకరాజు' చిత్రంలో నటుడు సత్య అదే డైలాగ్‌ను ఎన్టీఆర్ గారి మేనరిజంతో ఇమిటేట్ చేస్తూ చెప్పే సీన్ కనిపించింది. దీంతో నెటిజన్లు, నందమూరి ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. కావాలనే సోషల్ మీడియాలో మీమ్స్ ప్లాంట్ చేసి, సినిమాలో ఈ సీన్ పెట్టి ఎన్టీఆర్‌ను అవమానించారని ఆరోపించారు.  
    

Ntr, Varun Tej, Korean kanakaraju

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com