
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) తాజాగా చేసిన వ్యాఖ్యలు అటు సినిమా పరిశ్రమలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ సంచలనం రేపుతున్నాయి. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పెద్ది' (Peddi) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన శివన్న, ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా నటుడు ఉపేంద్ర (Upendra) రాజకీయ భవిష్యత్తు గురించి, అలాగే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన దళపతి విజయ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
సినిమా నటీనటులు కేవలం వెండితెరపై పాత్రల కోసమే ముఖాలకు రంగులు వేసుకుంటారని, నిజ జీవితంలో మాత్రం వారు ఎప్పుడూ రంగులు మార్చరని శివరాజ్ కుమార్ అన్నారు. రాజకీయాల్లోకి రావడంపై తనకు ఆసక్తి లేదని తేల్చిచెప్పిన ఆయన, ప్రజలకు సేవ చేయడానికి అధికారమే అక్కర్లేదన్నారు. తన కుటుంబం ఎన్నో ఏళ్లుగా సమాజానికి ఎంతో సేవ చేస్తోందని, ఆ సేవా కార్యక్రమాల గురించి ప్రపంచానికి గొప్పగా చాటి చెప్పుకోవాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు. తాము చేసే ప్రతి మంచి పని దినపత్రికల్లో లేదా వార్తల్లో రాకపోవచ్చు కానీ, లబ్ధి పొందిన ప్రజల గుండెల్లో అది ఎప్పటికీ నిలిచి ఉంటుందని, వారి హృదయాలే ఆ సేవ గురించి మాట్లాడుతాయని శివన్న అన్నారు.
ఇదే సమయంలో కర్ణాటక రాజకీయాల్లో 'ప్రజాకీయం' అంటూ సరికొత్త పంథాతో దూసుకుపోతున్న రియల్ స్టార్ ఉపేంద్ర గురించి శివరాజ్ కుమార్ స్పందించారు. నిజంగా ఉపేంద్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండి, ప్రజల కోసం నిలబడితే అది చాలా మంచి విషయమని కొనియాడారు. ఇటీవల పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం, ప్రజా మద్దతుతో ఆయన సాధించిన అఖండ విజయాన్ని మనం కళ్లారా చూశామని గుర్తుచేశారు. తమిళ ప్రజలంతా విజయ్‌కు అంత గొప్పగా మద్దతు ఇచ్చి సీఎం పీఠంపై కూర్చోబెట్టినప్పుడు, అదే తరహాలో కర్ణాటకలో మన ఉపేంద్రకు ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వకూడదు? అని శివన్న ప్రశ్నించారు. (Karnataka CM)
మేము కేవలం సినిమాల కోసమే మేకప్ వేసుకుంటాం కానీ, ప్రజల సమస్యల విషయంలో ఎంతో స్పష్టంగా, నిజాయితీగా ఉంటామని శివరాజ్ కుమార్ అన్నారు. సినిమాల్లో నటించేటప్పుడు ఎన్ని రంగులు మార్చినా, ప్రజలకు సేవ చేసే విషయంలో మాత్రం ఎలాంటి రంగులు, వేషాలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో సేవ చేస్తామని నొక్కి చెప్పారు.
తన విషయానికొస్తే.. ఇప్పటివరకు సమాజానికి తానూ ఎంతో సహాయం చేశానని, దాన్ని ఎవరూ నిందించలేరని అన్నారు. అభిమానులు తనను చూసి స్ఫూర్తి పొంది, సమాజంలో కనీసం కొందరికైనా సహాయం అందిస్తే అదే తనకు నిజమైన సంతోషమని శివన్న పేర్కొన్నారు.
విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తాను వ్యక్తిగతంగా చాలా సంతోషపడ్డానని శివరాజ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. విజయ్ వేదికలపై ఇచ్చిన ప్రసంగాలు ఎంతో ఆకట్టుకున్నాయని, అందులో కొన్ని మాటలు తన మనసుకు బాగా హత్తుకున్నాయని చెప్పారు. విజయ్ లాంటి నిజాయితీ గల వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే సమాజంలో కచ్చితంగా మార్పు వస్తుందని తాను బలంగా నమ్మానని, ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు. తాను ఆశించినట్లుగానే విజయ్ అఖండ విజయాన్ని సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
జీవితంలో ఏ పనినైనా నిజాయితీగా, నిస్వార్థంగా చేసేవారిని ఆ భగవంతుడు ఎప్పటికీ విడిచిపెట్టడని, వారికి కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని శివరాజ్ కుమార్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.





