Home

»

Latest News

టాలీవుడ్ ట్విస్ట్: ఒకే కథతో రెండు సినిమాలు.. షాక్ తప్పదా.?

Sep 10, 2026 1:09PM

టాలీవుడ్ లో ఒకే కథతో రెండు సినిమాలు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. 2013 లో వచ్చిన గ్రీకువీరుడు, సుకుమారుడు సినిమాల స్టోరీ లైన్స్ ఒకేలా ఉంటాయి. అలాగే 2022 లో వచ్చిన అంటే సుందరానికీ, కృష్ణ వ్రింద విహారి లైన్స్ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు కూడా అదే రిపీట్ కాబోతుంది అనిపిస్తోంది. ఇప్పటికే ఒక సినిమా విడుదల కాగా, ఇంచుమించు అదే తరహా కథతో మరో సినిమా రాబోతుంది.

ఈ ఏడాది జూలైలో 'మిస్టర్ మిడిల్ క్లాస్' అనే సినిమా వచ్చింది. శ్రీకాంత్ భక్తుడిగా కనిపించిన ఈ సినిమాలో, వెంకటేశ్వర స్వామి పాత్రలో రాజేంద్రప్రసాద్ కనువిందు చేశారు. అప్పుల ఊబిలో చిక్కుకొని, తిప్పలు పడుతున్న భక్తుడిని కాపాడటానికి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతారు. దేవుడు ఏం వరమిచ్చాడు? ఆ తర్వాత భక్తుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే పాయింట్ తో 'మిస్టర్ మిడిల్ క్లాస్' తెరకెక్కింది. 

ఇప్పుడు ఇలాంటి కథతోనే 'వడ్డీ కాసులవాడ' అనే సినిమా రాబోతుంది. ఇందులో మంచు మనోజ్ భక్తుడిగా నటిస్తుండగా, వెంకటేశ్వర స్వామి పాత్రలో ప్రముఖ తమిళ నటుడు జయం రవి కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ లో మనోజ్ పాత్ర ఎలా ఉండబోతుందో చూపించారు. అప్పులు, EMI లు కట్టలేక ఇబ్బంది పడుతూ.. తనను దీని నుంచి బయటపడేయమని వెంకటేశ్వర స్వామిని వేడుకునే భక్తుడిగా మనోజ్ పాత్ర కనిపించింది. అప్పులతో బాధపడుతున్న భక్తుడిని కాపాడటానికి దేవుడు ప్రత్యక్షమై వరం ఇవ్వడం, ఆ తర్వాత ఏం జరిగింది? అనే పాయింట్ తోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది అనిపిస్తోంది.

ఇప్పటికే ఈ తరహా కాన్సెప్ట్ తో 'మిస్టర్ మిడిల్ క్లాస్' వచ్చినప్పటికీ.. కంటెంట్, ట్రీట్మెంట్ మీద నమ్మకంతోనే 'వడ్డీ కాసులవాడ' సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. మరి ఆ సినిమా విడుదలైతేనే కానీ.. ఈ రెండు కథలు నిజంగా ఒకటో కాదో తెలియదు.

 

 

 

[Mister Middle Class, Vaddi Kaasula Vaada, Manchu Manoj, Jayam Ravi, Srikanth, Rajendra Prasad, Tollywood, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com