- ఫిజిక్స్ చదువుతూ కవిత్వం రాశా
- ఏయూ వేడుకల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ భావోద్వేగం
- 'మాటల మాంత్రికుడి' స్ఫూర్తిదాయక ప్రసంగం
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (AU) శతాబ్ది వేడుకల్లో భాగంగా ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసేలా సాగింది. తాను చదువుకున్న విద్యాసంస్థ వందేళ్ల పండుగ జరుపుకోవడంపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్రివిక్రమ్ తన ప్రసంగాన్ని చాలా వినమ్రంగా మొదలుపెట్టారు. "ఈ వేదికపై మాట్లాడే అర్హత నాకు ఎంత ఉందో తెలియదు కానీ, కేవలం ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అనే అభిమానంతో నన్ను పిలిచినట్లున్నారు" అంటూ తన వినయాన్ని చాటుకున్నారు. ఒకప్పుడు ఇదే క్యాంపస్‌లో విద్యార్థిగా తిరిగిన ఆయన, ఇప్పుడు అదే ప్రాంగణంలో అతిథిగా రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ అంటే కేవలం తరగతి గదులు, పుస్తకాలు కాదని.. భిన్నమైన ఆలోచనలు కలిసే వేదిక అని ఆయన అభివర్ణించారు. "యూనివర్సిటీ అనే పదం 'యూనిజన్', 'డైవర్సిటీ' అనే రెండు పదాల కలయిక. విభిన్న సంస్కృతులు, ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ కలిసి మెలిసి ఉండటం వల్ల ప్రపంచం పట్ల కొత్త అవగాహన ఏర్పడుతుంది" అని త్రివిక్రమ్ వివరించారు.
చదువు గురించి చెబుతూ.. విద్య అనేది ఎక్కడో ఉన్న విషయాన్ని నేర్చుకోవడం కాదని, మన కళ్ల ముందే ఉండి కూడా మనం గమనించని విషయాన్ని కొత్త కోణంలో చూడటమే అసలైన విద్య అని ఆయన పేర్కొన్నారు. ఫిజిక్స్ లోని 'ఎనర్జీ' సూత్రాన్ని ప్రస్తావిస్తూ ప్రకృతి సిద్ధాంతాలను ఆయన వివరించిన తీరు ఆకట్టుకుంది.
తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ.. తాను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఫిజిక్స్ కంటే ఎక్కువగా కవిత్వం రాశానని, సైన్స్ పుస్తకాల కంటే తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివానని త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నారు. ఇక్కడే తనకు జీవితంలో పోరాడేందుకు కావాల్సిన 'ఆయుధం' దొరికిందని ఆయన చెప్పుకొచ్చారు.
మొదట్లో యూనివర్సిటీ ప్రాంగణం, అక్కడి వాతావరణం భయపెట్టినట్లు అనిపించినా.. అది మందు లాంటిదని, చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మంచి చేస్తుందని ఆయన విశ్లేషించారు. 130 దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి రావడం వెనుక ఉన్న గొప్పతనాన్ని ఆయన గుర్తు చేశారు.
చివరగా, ఆంధ్ర యూనివర్సిటీ లోగోలోని 'తేజస్వినా వధితమస్తు' అనే వాక్యాన్ని ప్రస్తావిస్తూ, విద్యార్థులు అసత్యం నుంచి సత్యం వైపు, మృత్యువు నుంచి అమృతత్వం వైపు పయనించాలని ఆకాంక్షించారు. వందేళ్ల పండుగ జరుపుకుంటున్న తన మాతృసంస్థను 'శతాయుష్మాన్ భవ' అంటూ దీవించి తన ప్రసంగాన్ని ముగించారు.





