Home

»

Latest News

Trisha: మదురై లో త్రిష కలకలం..  త్రిష నర్పణి మన్త్రమ్ అంటూ పోస్టర్స్ 

Aug 4, 2026 4:41PM

 


స్టార్ స్టేటస్ ని అనుభవించి నాలుగు పదుల వయసులో కూడా క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న త్రిష చుట్టూ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తుండగా, తాజాగా మధురై వీధుల్లో వెలసిన  పోస్టర్లు ఈ చర్చలకు మరింత ఆజ్యం పోశాయి. 


సాంప్రదాయక సాంస్కృతిక నగరమైన మధురై పురవీధుల్లో "త్రిష నర్పణి మన్త్రమ్" (త్రిష ఛారిటీ ఫౌండేషన్) పేరిట రాత్రికి రాత్రే వెలసిన ఈ పోస్టర్లు స్థానిక రాజకీయ వర్గాల్లోనూ, సినీ ప్రేక్షకుల్లోనూ తీవ్ర అలజడి రేపాయి.  తమిళనాడు రాజకీయ చరిత్రలో ఏ కొత్త రాజకీయ శక్త్యుదయానికైనా లేదా సంచలనాత్మక మార్పులకైనా మధురై నగరమే వేదిక కావడం ఆనవాయితీ. 1977లో సూపర్ స్టార్ రజనీకాంత్ మొదటి అభిమానుల సంఘం "మక్కల్ తలైవన్ రజనీకాంత్ తలైమై నర్పణి మంద్రం" ప్రారంభమైంది కూడా ఈ మధురై గడ్డపైనే అనే విషయాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. సరిగ్గా అదే బాటలో, "ఏ రాజకీయ పార్టీ ఆవిర్భావానికైనా తొలి అడుగు పడేది మన మధురై నేలపైనే.. మధురై మీనాక్షి అమ్మవారి దివ్య ఆశీస్సులతో, తమిళనాడు సంక్షేమ సంఘాల చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన మొదటి సంఘం ఇది" అంటూ ఆ పోస్టర్లలో స్పష్టంగా ముద్రించారు. ఈ పోస్టర్లపై అధికారిక రిజిస్ట్రేషన్ సంఖ్య 53/2026 కూడా ముద్రించి ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  అంతేకాకుండా, తమిళ విప్లవ వీరనారి వీరమంగై వేలు నాచియార్ చిత్రం మరియు త్రిష ఛాయాచిత్రాలను పక్కపక్కనే ఉంచి, "మా ప్రియమైన సోదరి (అన్బు అక్కా) త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి" అంటూ అభిమానులు బహిరంగంగా పిలుపునిచ్చారు. వైట్ అండ్ వైట్ దుస్తుల్లో ఉన్న సుమారు ఏడుగురు నిర్వాహకుల చిత్రాలు ఈ పోస్టర్లలో కనిపించడం గమనార్హం. 

Also read: ఉదయనిధి స్టాలిన్ భార్య, పిల్లల సంచలనం.. వైరల్ గా మారిన పిక్స్ 

తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొచ్చిన దళపతి విజయ్ ప్రమాణస్వీకార మహోత్సవంలో త్రిష ప్రత్యేక అతిథిగా పాల్గొనడం, తరచూ వీరిద్దరూ బహిరంగ వేదికలపై కనిపించడంతో త్రిష రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మిన్నంటాయి.  అయితే, ఈ పోస్టర్ల వివాదంపై ఇప్పటివరకు నటి త్రిష కానీ, ఆమె ప్రతినిధులు కానీ ఎటువంటి అధికారిక ప్రకటన లేదా వివరణ ఇవ్వకపోవడం ఉత్కంఠను పెంచుతోంది. గతంలో తమిళగ వెట్రి కజగంతో తనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదని త్రిష స్పష్టం చేసినప్పటికీ, తాజాగా రిజిస్ట్రేషన్ నంబర్ 53/2026 తో మధురైలో ఏర్పాటైన ఈ ఛారిటీ ఫౌండేషన్ వెనుక ఎవరున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. విజయ్ మక్కల్ ఇయక్కం నాయకులను సంప్రదించగా తమకు దీనితో సంబంధం లేదని తేల్చిచెప్పారు. సినీ రంగాన్ని శాసించిన గ్లామర్ క్వీన్ త్రిష, వీరమంగై వేలు నాచియార్ స్పూర్తితో నిజంగానే తమిళ రాజకీయ తెరపై ప్రత్యక్షమవుతుందో లేక ఇది కేవలం అభిమానుల ఉత్సాహమేనా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. త్రిషపై అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేసాడని  డిఎంకె ముఖ్య నేత ఎం ఎల్ ఏ ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

Trisha, Tollywood, Kollywood

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com