Home

»

Latest News

టాలీవుడ్‌లో ముగిసిన పర్సంటేజ్ వివాదం.. చిరంజీవి జోక్యంతో 'పెద్ది' సినిమాకు లైన్ క్లియర్!

May 28, 2026 9:12AM

టాలీవుడ్‌(Tollywood)లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ‘పర్సంటేజ్ వివాదం’ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. సినిమా కలెక్షన్ల షేరింగ్ విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన విభేదాలు పరిశ్రమ భవిష్యత్తుపై కాస్త ఆందోళన కలిగించాయి. అయితే, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి తెరపడింది. ఆయన చేసిన సమన్వయ ప్రయత్నాలు ఫలించడంతో ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఒక అవగాహనకు వచ్చారు.

ఈ వివాదానికి సంబంధించి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చిరంజీవిని ప్రత్యేకంగా కలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, థియేటర్ల నిర్వహణ భారాన్ని వారు చిరంజీవికి వివరించారు. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో వస్తున్న లాభనష్టాల సమీకరణాలను ఆయన ముందు ఉంచారు. ఎగ్జిబిటర్ల బాధలను విన్న చిరంజీవి, పరిశ్రమలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఒక కీలక సూచన చేశారు. ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని, అప్పుడే పరిశ్రమకు మేలు జరుగుతుందని ఆయన హితవు పలికారు. మెగాస్టార్ సూచనను గౌరవించిన ఎగ్జిబిటర్లు ఆయన నిర్ణయానికి సానుకూలంగా స్పందించారు.

ఇందులో భాగంగా ఎగ్జిబిటర్లు కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 30 లోపు రాబోయే రోజుల్లో పెద్ద చిత్రాలను కేవలం ‘రెంటల్ విధానంలోనే’ థియేటర్లలో ప్రదర్శించాలని వారు తీర్మానించారు. అయితే, ఇందులో ఒక ముఖ్యమైన నిబంధనను కూడా చేర్చారు. ఒకవేళ పెద్ద సినిమాల విడుదల సమయంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులతో టికెట్ రేట్లు పెంచినట్లయితే, ఆ పెంచిన రేట్లకు అనుగుణంగా థియేటర్ రెంట్‌తో పాటు అదనంగా 7.5 శాతం మొత్తాన్ని ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది.

జూన్ 30 తర్వాత థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలన్నింటినీ ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ ఇచ్చే తుది నివేదికకు అనుగుణంగానే ప్రదర్శిస్తారు. ఆ కమిటీ సూచించే పర్సంటేజీ విధానాన్ని అందరూ తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయించారు. ఈ సమన్వయ నిర్ణయంతో టాలీవుడ్‌లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. 

దీని వల్ల ముఖ్యంగా రామ్ చరణ్ 'పెద్ది' (Peddi) సినిమాకు పెద్ద తలనొప్పి తప్పింది. పెద్ది చిత్రాన్ని రెంటల్ విధానంలోనే ప్రదర్శించనున్నారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే, రెంట్ తో పాటుగా 7.5% ఎగ్జిబిటర్లకి చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలను మాత్రం, ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా పర్సంటేజ్ విధానంలో ప్రదర్శించనున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com