Home

»

Latest News

చిరు, బన్నీ, చరణ్ కొత్త ప్రాజెక్టులపై ఎగ్జిబిటర్ల అభ్యంతరం.. అసలేం జరుగుతోంది?

May 18, 2026

తెలుగు సినీ పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య పర్సంటేజీ పద్ధతి అమలుపై గత కొన్ని రోజులుగా పెద్ద చర్చ నడుస్తోంది. సింగిల్ స్క్రీన్స్‌లో కూడా పర్సంటేజీ విధానాన్ని తీసుకురావాలని ఎగ్జిబిటర్లు గట్టిగా పట్టుబడుతుండగా, దీనివల్ల భారీ బడ్జెట్ చిత్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరిగిన తాజా సమావేశంలో తీవ్ర దుమారం రేగినట్లు తెలుస్తోంది.

ఈ వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 21 మంది సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రెండు నెలల్లో ఈ సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం కనుగొనాలని ఈ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ లోపే నిర్మాతల మండలి తరఫున సుమారు 17 చిత్రాలకు పాత పద్ధతిలోనే మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఒక జాబితాను సిద్ధం చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ లిస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వైరల్ జాబితా చూసిన సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలకు మినహాయింపులు కోరడంలో న్యాయం ఉందని వారు భావిస్తున్నారు. కానీ, అసలు పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోని, కనీసం సెట్స్ పైకి కూడా వెళ్ళని చిత్రాలను సైతం ఈ లిస్ట్‌లో చేర్చడంపై థియేటర్ల యాజమాన్యాలు మండిపడుతున్నాయి.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్ మూవీ, నేచురల్ స్టార్ నాని-సుజీత్ క్రేజీ ప్రాజెక్ట్, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రాలు ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. వీటికి తోడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ల భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. ఇలాంటి అన్‌అనౌన్స్‌డ్, అండర్-ప్రొడక్షన్ సినిమాలకు కూడా ఇప్పుడే పర్సంటేజీ మినహాయింపులు ఎలా అడుగుతారంటూ ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు.

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలోకి వచ్చినప్పుడు కలెక్షన్ల షేరింగ్ విషయంలో గొడవలు రావడం సహజం. గతంలో కూడా పలు చిత్రాల విడుదలైప్పుడు నిర్మాతలకు, పంపిణీదారులకు మధ్య ఇలాంటి బేధాభిప్రాయాలు వచ్చాయి. కానీ, ఈసారి ఏకంగా ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే ఈ రేంజ్‌లో వివాదం చెలరేగడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో సైతం సినీ అభిమానులు ఈ పర్సంటేజీ సిస్టమ్ వ్యవహారంపై జోరుగా చర్చించుకుంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ, పరిశ్రమ మనుగడ సాగించాలంటే అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు ఇద్దరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి రాబోయే రెండు నెలల్లో ఫిలిం ఛాంబర్ కమిటీ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో, ఈ క్రేజీ స్టార్ల సినిమాల భవిష్యత్తు బిజినెస్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com