
2026 సినీ సంక్రాంతి మొన్న మొన్ననే వచ్చినట్టుగా ఉంది. కానీ అప్పుడే ఆరునెలలు పూర్తయ్యాయి. ఈ మొదటి ఆరు నెలల కాలం టాలీవుడ్ బాక్సాఫీస్ పరంగా తీవ్ర ఒడిదుడుకులని ఎదుర్కొంది. ఫస్ట్ హాఫ్ ఆట దాదాపు ముగిసే సమయానికి పరిశ్రమ స్థితిగతులని గమనిస్తే కొన్ని అద్భుతమైన విజయాలు, మరికొన్ని భారీ పరాజయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పటి లేని విధంగా సంక్రాంతి కానుకగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిత్రాలు థియేటర్లలో క్యూ కట్టాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారుతో బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల నుండి 310 కోట్ల రూపాయల వరకు వసూళ్లు రాబట్టి ఫస్ట్ హాఫ్ రేసులో అగ్రస్థానంలో నిలిచింది. నవీన్ పొలిశెట్టి నుంచి వచ్చిన 'అనగనగా ఒక రాజు' కూడా హిలేరియస్ ఫన్‌తో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, 100.20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో నవీన్‌ని వంద కోట్ల క్లబ్‌లో చేర్చింది.
శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, సంక్రాంతి రేసులో తీవ్రమైన పోటీ కారణంగా 36 కోట్ల రూపాయల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మాస్ మహారాజా రవితేజ నటించిన 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే అందరినీ షాక్‌కు గురిచేస్తూ భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ చిత్రం 'ది రాజా సాబ్' ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 208.38 కోట్ల రూపాయలు వసూలు చేసినప్పటికీ, భారీ బడ్జెట్, భారీ అంచనాల రీత్యా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సంక్రాంతి పెద్ద హీరోల హవా ముగిసిన తర్వాత ఫిబ్రవరి నెలలో చిన్న హీరోల దండయాత్ర మొదలైంది.ట్రైలర్లతో భారీ అంచనాలు రేపిన ఫంకీ, యుఫొరియా, హే బల్వంత్, విష్ణు విన్యాసం, శ్రీ చిదంబరం వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యాయి. ఇందులో 'విష్ణు విన్యాసం' కేవలం 18 కోట్ల రూపాయల వసూళ్లతో ముగిసింది.
మార్చి నెలలో కూడా టాలీవుడ్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ 95 కోట్ల వసూళ్లని రాబట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో సత్తా చాటలేదు. మృత్యుంజయ, బ్యాండ్ మేళం, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని వంటి చిత్రాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి. హీరో శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'బైకర్' చిత్రం కమర్షియల్‌గా భారీ నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత ఏప్రిల్ లో వచ్చిన రాకాస 27 కోట్ల రూపాయలతో డెకాయిట్ 55.23 కోట్ల రూపాయలుతో యావరేజ్ గా నిలవగా పాపం ప్రతాప్, తిమ్మరాజు పల్లి టీవీ ప్లాప్ ఖాతాలోకి చేరిపోయాయి. మే నెలలో వచ్చిన గాయపడ్డ సింహం, జెట్లీ, గోదారి గట్టుపైన, అగ్లీ స్టోరీ వంటి చిత్రాలు కనీసం ప్రేక్షకులను థియేటర్ వైపు కూడా రప్పించలేకపోయాయి.
Also read: Suriya: షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సూర్య.. రేపు ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి!
టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ ఫలితాలు పూర్తిగా డిజాస్టర్ దిశగా సాగుతున్న తరుణంలో, జూన్ నెలలో భారీ హైప్ నడుమ వచ్చిన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్‌కి ఊపిరి పోసింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, మొదటి వారంలో సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టి ఏకంగా 335.67 కోట్ల రూపాయల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఇటీవల విడుదలైన సింగ్ గీతం, దీవాన డీసెంట్ కలెక్షన్స్ రాబట్టగా, సమంత వన్ వుమెన్ షో 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు 78.71 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ చిత్రం, సంక్రాంతి సినిమాల తర్వాత కొన్న ప్రతి బయ్యర్‌కి లాభాలు తెచ్చిపెట్టిన ఏకైక చిత్రంగా నిలిచింది. మొత్తానికి ఈ 2026 ఫస్ట్ హాఫ్‌లో భారీ ఫ్లాపులు ఉన్నప్పటికీ, చిరు అదరగొట్టగా, సమంత ఇండస్ట్రీని ఆదుకుందని చెప్పవచ్చు.






