
టాలీవుడ్ లో ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సినిమా సక్సెస్ క్రెడిట్, వసూళ్లు, అలాగే భారీ రెమ్యునరేషన్లు కేవలం స్టార్ హీరోల ఖాతాకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. దర్శకులు క్రేజ్ పరంగానే కాకుండా రెమ్యునరేషన్ల విషయంలోనూ స్టార్ హీరోలతో నేరుగా పోటీ పడుతున్నారు. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో హీరోల ఇమేజ్ ఎంత ముఖ్యమో, సదరు దర్శకుడి బ్రాండ్ వాల్యూ కూడా అంతే కీలకమని నిర్మాతలు భావిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. డిమాండ్ అండ్ సప్లై సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ కెప్టెన్ల రెమ్యునరేషన్లు వందల కోట్ల మార్కును తాకుతూ ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఈ రేసులో అందరికంటే ముందు వరుసలో నిలుస్తూ, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నంబర్ వన్ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) అవతరించాడు. జక్కన్న సినిమా అంటే అందులో ఏ హీరో ఉన్నాడనేది పక్కన పెట్టి, కేవలం ఆయన బ్రాండ్ చూసి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కోట్లల్లో ఉన్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' కోసం రాజమౌళి ఏకంగా రూ. 200 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే ఆయన కేవలం ఫ్లాట్ రెమ్యునరేషన్ కాకుండా, సినిమా సాధించే లాభాల్లో భారీ షేర్ కూడా తీసుకోకున్నారని వినికిడి.
మరోవైపు కోలీవుడ్ నుంచి వచ్చి 'జవాన్' చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) మార్కెట్ వాల్యూ కూడా డబుల్ అయింది. వరుస కమర్షియల్ హిట్స్‌తో దూసుకుపోతున్న ఈ డైరెక్టర్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'రాక' చేస్తున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న బన్నీతో చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం అట్లీ ఏకంగా రూ. 100 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ను చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేవలం స్క్రీన్ ప్లే, ఎలివేషన్లతోనే మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించే మరో సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel ) కూడా తన పారితోషికాన్ని భారీగా పెంచేశాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోయే 'డ్రాగన్' మూవీ కోసం నీల్ ఏకంగా 50 శాతం ప్రాఫిట్ షేర్ అడిగినట్లు, దానికి మైత్రీ మూవీ మేకర్స్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ఇక కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో ఇప్పటివరకు కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా ఎరుగని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) సైతం తన రేంజ్‌ను పెంచుకున్నాడు. తన తదుపరి భారీ మల్టీస్టారర్ చిత్రం కోసం అనిల్ ఏకంగా రూ. 35 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు సమాచారం.
అలాగే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో సౌత్ ఇండియాలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన కోలీవుడ్ స్టార్ మేకర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj), అల్లు అర్జున్‌తో చేయబోయే 'AA23' ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ. 75 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్.
ఈ గణాంకాలను బట్టి చూస్తే కథలను, విజువల్స్ నమ్ముకుని బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఈ దర్శకులు, రెమ్యునరేషన్లలో హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్నారని చెప్పవచ్చు.






