ENGLISH | TELUGU  

తెలుగు సినిమాల్లోని మాటలను కొత్త పుంతలు తొక్కించిన మాటల మాంత్రికుడు!

on Nov 6, 2024

ఏ సినిమాకైనా కథే హీరో అంటారు. బలమైన కథ లేకపోతే ఎంత స్టార్‌ కాస్టింగ్‌ ఉన్నా, ఎంత బడ్జెట్‌తో సినిమా తీసినా అది నిలబడదు అని చెబుతుంటారు. అయితే కథతో పాటు మాటలు కూడా ముఖ్యమేనని ఎంతో మంది దర్శకులు ప్రూవ్‌ చేశారు. ఈ తరం దర్శకుల్లో త్రివిక్రమ్‌ దాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. ఆయన చేసిన సినిమాలు చూస్తే అది ఇట్టే అర్థమవుతుంది. కథకు ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తారో.. మాటలకు కూడా అదే ప్రాధాన్యమిస్తారు. ఆయన చేసిన కొన్ని సినిమాలు మాటల వల్లే హిట్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రచయితగా కెరీర్‌ ప్రారంభించిన త్రివిక్రమ్‌.. తన సినిమాల్లోని మాటలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటారు. దర్శకుడిగా మారిన తర్వాత కూడా తన మాటల మంత్రాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ట్రెండ్‌కి తగినట్టుగా మాటల గారడీ చేసి ప్రేక్షకుల్ని మెప్పించడమే లక్ష్యంగా ఆయన సినిమాలు ఉంటాయి. తన పంచ్‌ డైలాగులతో కడుపుబ్బ నవ్వించడంలో త్రివిక్రమ్‌ సిద్ధహస్తుడు. నవంబర్‌ 7 త్రివిక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం, తన సినిమాల్లోని డైలాగులకు సంబంధించిన విశేషాల గురించి తెలుసుకుందాం.

త్రివిక్రమ్‌ అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస్‌. 1971 నవంబర్‌ 7న భీమవరంలో ఆకెళ్ళ ఉదయభాస్కరరావు, నరసమ్మ దంపతులకు జన్మించారు. ఆంధ్రా విశ్వ విద్యాలయంలో అణుకేంద్ర శాస్త్రంలో ఎం.ఎస్‌.సి. పూర్తి చేసి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. సినిమాలపై ఉన్న మక్కువతో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వద్ద సహాయకుడిగా చేరారు. 1999లో కె.విజయభాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘స్వయంవరం’ చిత్రానికి కథ, మాటలు అందించడం ద్వారా చిత్రరంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత విజయభాస్కర్‌ దర్శకత్వంలోనే రూపొందిన నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి, మన్మథుడు, జై చిరంజీవ చిత్రాలకు రచన చేశారు. ఈ సినిమాలు త్రివిక్రమ్‌కి రచయితగా ఎంతో మంచి పేరు తెచ్చాయి. ఇవికాక నిన్నే ప్రేమిస్తా, చిరునవ్వుతో, వాసు, ఒకరాజు ఒకరాణి, తీన్‌మార్‌ వంటి సినిమాలకు కూడా మాటలు రాశారు. 

2002లో వచ్చిన ‘నువ్వేనువే’ చిత్రంతో దర్శకుడిగా మారారు త్రివిక్రమ్‌. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో డైరెక్టర్‌గా కూడా తన సత్తా చాటుకున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్‌ హీరోగా రూపొందించిన ‘అతడు’ త్రివిక్రమ్‌ చేసిన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆడకపోయినా టీవీలో ఇప్పటివరకు కొన్ని వందల సార్లు ప్రసారమైంది. ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ కోసం మా టీవీ.. నిర్మాతలకు ఎక్కువ మొత్తం చెల్లించి రెన్యూవల్‌ చేసుకోవడం విశేషం. ఈ సినిమాకి వచ్చిన పాపులారిటీ అలాంటిది. ఈ సినిమా తర్వాత జల్సా, ఖలేజా, జులాయి చిత్రాలకు దర్శకత్వం వహించారు త్రివిక్రమ్‌. ఈ సినిమాలు కూడా సూపర్‌హిట్‌ అయ్యాయి. పవన్‌కళ్యాణ్‌తో చేసిన అత్తారింటికి దారేది చిత్రం త్రివిక్రమ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇలా.. ఆ తర్వాత సన్నాఫ్‌ సత్యమూర్తి, అఆ, అరవింద సమేత వీరరాఘవ చిత్రాలు కూడా విజయం సాధించాయి. అల్లు అర్జున్‌తో చేసిన అల వైకుంఠపురములో.. చిత్రం త్రివిక్రమ్‌ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం చిత్రానికి డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ ఫైనల్‌గా హిట్‌ చిత్రంగానే నిలిచింది. 

జంధ్యాల, వంశీ వంటి దర్శకుల సినిమాల్లోని డైలాగులు ఎంతో కొత్తగానూ హాస్యాన్ని పుట్టించే విధంగానూ ఉంటాయి. ఈ ఇద్దరు దర్శకులు హాస్య చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. ముఖ్యంగా జంధ్యాల తెలుగు సినిమాల్లోని మాటల తీరుతెన్నులను మార్చారు. వీరి తర్వాత సినిమా డైలాగుల్లో త్రివిక్రమ్‌
ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. అందరూ వాడుక భాషల్లో మాట్లాడుకునే మాటల్నే తన చాతుర్యంతో చమత్కారంగా రాయగల సత్తా ఉన్న రచయిత త్రివిక్రమ్‌. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ సినిమాల్లో ఎక్కువగా పాపులర్‌ అయిన డైలాగులను మరోసారి గుర్తు చేసుకుందాం.

చిరునవ్వుతో.. ‘వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులైనట్టు.. ఫెయిల్‌ అయిన ప్రేమికులందరూ ఫ్రెండ్స్‌ అవ్వలేరు. 

నువ్వే కావాలి.. ‘విడిపోవడం తప్పదు అన్నప్పుడు.. అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది.

నువ్వు నాకు నచ్చావ్‌.. ‘మనం గెలిచినపుడు చప్పట్లు కొట్టేవాళ్లు, మనం ఓడినపుడు భుజం తట్టేవాళ్లు.. నలుగురు లేనప్పుడు.. ఎంత సంపాదించినా.. పోగొట్టుకున్నా.. తేడా ఏమీ ఉండదు.

అతడు.. ‘నిజం చెప్పకపోవడం అబద్ధం.. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’. 

తీన్‌మార్‌.. ‘కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యతలు లేని యవ్వనం, జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం’. 

జల్సా.. ‘యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు.. శత్రువును ఓడిరచడం’.

అత్తారింటికి దారేది.. ‘కంటికి కనిపించని శక్తితో, బయటకు కనిపించని యుద్ధం చేస్తున్నా.’ 

సన్నాఫ్‌ సత్యమూర్తి.. ‘మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు.’

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.