Home

»

Latest News

తండ్రి కోసం కొడుకు అన్వేషణ.. ఓటీటీలో క్రేజీ మూవీ 'తీర్థరూప తాండేయవారిగే'.!

Jul 18, 2026 4:41PM

బుల్లితెరపై 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో రిషి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కన్నడ నటుడు నిహార్ ముఖేశ్ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మన ముందుకు వచ్చాడు. ఆయన నటించిన సరికొత్త చిత్రం 'తీర్థరూప తాండేయవారిగే' ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్'లో తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చింది. రామెనహళ్లి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక భావోద్వేగభరితమైన ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నిహార్ ముఖేశ్ సరసన రచన ఇందర్ కథానాయికగా నటించగా, సీనియర్ నటి సితార, రవీంద్ర విజయ్, రాజేష్ కీలక పాత్రలు పోషించారు. జై చాముండేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా రేటింగ్ విషయానికి వస్తే 5 కి 2.00 గా నిలిచింది. ఒక తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్, కుటుంబంలో ఉండే అపార్థాలు, మరియు ఒక మిస్టరీ చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంది.

కథ విషయానికి వస్తే, పృథ్వీ (నిహార్ ముఖేశ్) ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. అతను ఒక పాపులర్ ట్రావెల్ వ్లాగర్ కావడంతో, అందమైన లొకేషన్లకు వెళ్తూ వీడియోలు చేస్తూ డిజిటల్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. సమాజంలో అతనికి ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ, అతని వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఒక పెద్ద వెలితి వెంటాడుతూనే ఉంటుంది. దానికి కారణం అతని చిన్నతనంలోనే తండ్రి శివ శంకర్ (రవీంద్ర విజయ్) ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోవడం. తండ్రి లేని కారణంగా పృథ్వీ స్కూల్ రోజుల నుండి కాలేజ్ వరకు ఎన్నో అవమానాలను, హేళనలను ఎదుర్కొంటాడు. తన తండ్రి ఎందుకు వెళ్లిపోయాడు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న అతన్ని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో తన తల్లి జానకి (సితార) స్థానిక వ్యక్తి విశ్వనాథ్ (రాజేశ్ నటరంగ)తో సన్నిహితంగా ఉండటం పృథ్వీకి నచ్చదు. తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి తల్లి ప్రవర్తనే కారణమని భావించి, ఆమెతో చాలా ముభావంగా ఉంటాడు.

ఈ క్రమంలోనే పృథ్వీ జీవితంలోకి అక్షర (రచన ఇందర్) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే, అక్షర తండ్రి రవి రామనాథపుర ఒక సీనియర్ జర్నలిస్ట్ అని తెలిసి పృథ్వీ షాక్ అవుతాడు. కొన్ని కారణాల వల్ల వారి ప్రేమ ఫలించడం కష్టమని అనుకుంటున్న తరుణంలో, అక్షర తండ్రి హఠాత్తుగా మరణిస్తాడు. ఆయన చనిపోయే ముందు రాసిన ఒక లేఖ అక్షర చేతికి చిక్కుతుంది. ఆ లేఖ చదివిన అక్షరకు ఒక చేదు నిజం తెలుస్తుంది. పృథ్వీ తండ్రి శివశంకర్ అదృశ్యం కావడానికి, తన తండ్రి రవి రామనాథపురకి మధ్య ఏదో బలమైన సంబంధం ఉందని ఆమె గ్రహిస్తుంది. అసలు ఆ ఇద్దరి గతంలో ఏం జరిగింది, అక్షర ఈ నిజాన్ని పృథ్వీకి చెప్పిందా లేదా, చివరికి పృథ్వీ తన తండ్రి జాడను కనుగొన్నాడా అనే ఆసక్తికరమైన అంశాలతో మిగతా కథ నడుస్తుంది.

దర్శకుడు రామెనహళ్లి జగన్నాథ్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, దాన్ని తెరపై ఆవిష్కరించిన విధానంలో కొన్ని లోపాలు కనిపిస్తాయి. సినిమా ఫస్టాఫ్ చాలా నిదానంగా సాగుతుంది. హీరోకి తండ్రి లేడనే అసంతృప్తిని, తల్లి పట్ల ఉన్న కోపాన్ని చూపించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. లవ్ ట్రాక్‌లో రొమాన్స్ మరింత పండించి ఉంటే బాగుండేది. అయితే, సెకండాఫ్ నుండి కథలో వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాంకేతిక విభాగంలో దీపక్ ఫొటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. మేఘాలయ వంటి లొకేషన్లను కెమెరాలో అద్భుతంగా చూపించారు. జో కోస్టా అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదనిపించినా, పాటల సాహిత్యం మరియు డబ్బింగ్ పరంగా మరింత శ్రద్ధ పెట్టాల్సింది. మొత్తానికి, 'తీర్థరూప తాండేయవారిగే' నెమ్మదిగా సాగే ఒక ఎమోషనల్ డ్రామా, ఓటీటీలో ఒకసారి చూడదగ్గ చిత్రంగా మిగిలింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com