
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషల్ డ్రామా మూవీ 'ది ఇండియా స్టోరీ'. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. 2 నిమిషాల 35 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్, దేశంలో ఆహార కాలుష్యం, క్రిమిసంహారకాల వాడకం వల్ల సామాన్యుల జీవితాలు ఎలా అతలాకుతలం అవుతున్నాయో కళ్లకు కట్టినట్లు చూపించింది.
ట్రైలర్ ప్రారంభమే ఒక తండ్రి రోదనతో మొదలవుతుంది. తన 7 ఏళ్ల కూతురు హత్యకు గురైందని, దానికి కారణమైన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఒక తండ్రి పోలీస్ స్టేషన్‌లో వేడుకునే సీన్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. అయితే ఆ పాప మరణానికి అసలు కారణం క్యాన్సర్ అని మెడికల్ రిపోర్టులు చెబుతాయి. కానీ ఆ క్యాన్సర్ రావడానికి వెనుక ఉన్న భయంకరమైన కార్పొరేట్ మాఫియా, విషపూరిత రసాయనాల వాడకాన్ని ఈ చిత్రం ప్రశ్నించబోతోంది.
మన దేశంలో పంటల దిగుబడి కోసం, ముఖ్యంగా జీడి తోటలపై హెలికాప్టర్ల ద్వారా విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులను జల్లుతున్నారు. కెమికల్స్ కాదు, అవి నిలువునా ప్రాణాలు తీసే విషం అని ట్రైలర్‌లో బలంగా చూపించారు. మార్కెట్లో దొరికే పండ్లు, కూరగాయలను ఎంత కడిగినా ఆ విషపు రసాయనాల ప్రభావం పోదని, అవి మన శరీరంలోకి చేరి ప్రాణాంతక క్యాన్సర్‌గా మారుతున్నాయని ఈ కథ హెచ్చరిస్తోంది. కేవలం కూరగాయలే కాదు, పండగల సమయంలో, ఫంక్షన్ల సమయంలో విరివిగా వాడే పాలలో కూడా ఎలాంటి కల్తీ జరుగుతుందో, అవి స్వీట్ల రూపంలో మన పిల్లల పొట్టల్లోకి ఎలా చేరుతున్నాయో కూడా ఇందులో ప్రస్తావించారు.
ఈ పోరాటం కేవలం ఒక పాప కాదు, దేశంలోని ప్రతి బిడ్డ భవిష్యత్తు కోసం అంటూ సాగే డైలాగులు ఆలోచింపజేస్తాయి. రైతుల్ని అన్నదాతలు అని అంటాం, కానీ కొందరు స్వార్థపరుల వల్ల అమాయక రైతులు కూడా ఎలా నష్టపోతున్నారో ఇందులో చూపించారు. ట్రైలర్‌లో అత్యంత ప్రభావవంతమైన అంశం పంజాబ్ లోని 'బటిండా నుండి బికానీర్' వెళ్లే క్యాన్సర్ ట్రైన్ గురించి ప్రస్తావించడం. క్రిమిసంహారక మందుల వాడకం, రసాయనాల కాలుష్యం ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో దేశంలోని ప్రతి ఊరు నుండి ఒక క్యాన్సర్ ట్రైన్ బయలుదేరాల్సిన పరిస్థితి వస్తుందని కాజల్ పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ భయంకరమైన సామాజిక సమస్యను ఎదిరిస్తూ జూలై 24న థియేటర్లలోకి రాబోతున్న 'ది ఇండియా స్టోరీ' ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
Kajal Aggarwal, The India Story, Movie Trailer






