
కామెడీ కింగ్ బ్రహ్మానందం ఫేమస్ డైలాగ్ ఒకటుంటుంది. మరి అంత ఎర్రి వెంగళప్ప లా కనిపిస్తున్నానా? ఒక మాదిరిగా కూడా కాదా అని.. ఇప్పుడు ఈ మాటని ఇటీవల రిలీజైన సినిమాలని చూసి ప్రేక్షకులు అనుకునే పరిస్థితి. అసలు ప్రస్తుతం నడుస్తున్న సినీ కాలం ఏంటి? కథ,కథనం, క్యారెక్టర్స్ డిజైన్ ఏ విధంగా ఉండాలో అనే విషయం కూడా మర్చిపోయి, మనం తీయాలసింది సినిమా, అది ఎలా తయారైతే మనకేంటి అన్నట్టుగా సినీ మేధావి ముసుగుని కప్పుకుంటున్నారు. దీంతో ప్రేక్షకులు మరీ అంత అమాయకులుగా, ఏది చూపించినా చూసేస్తారులే అనే భావనలో ఇండస్ట్రీలో ఉందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
టికెట్ ధరలు వందల్లో ఉంటే, కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్తే వేల రూపాయిలు ఖర్చవుతున్న ఈ రోజుల్లో, కనీస నాణ్యత లేని సినిమాలు అందించడం క్షమించరాని నేరం. గడిచిన కొన్ని నెలల గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. దాదాపు 80% నుంచి 85% వరకు సినిమాలు మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమవుతున్నాయి.
ఒకప్పుడు సగటున ఒక సినిమాలో కనీసం 50% నుంచి 60% భాగం వినోదం లేదా ఉత్కంఠ ఉండేది. కానీ ఈ మధ్య వచ్చిన దాదాపు 10కి పైగా చిత్రాల్లో అసలు మొదటి 30 నిమిషాలు గడిచేసరికే ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రేక్షకుల తెలివితేటలు, వారి సినిమా పరిజ్ఞానం ఏ స్థాయికి చేరాయో మేకర్స్ గుర్తించకపోవడమే పెద్ద పొరపాటు. ఓటీటీల పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నంబర్ వన్ కంటెంట్‌ను అందరూ తమ ఇంట్లోనే చూస్తున్నారు. ప్రపంచ స్థాయి సినిమా మేకింగ్‌ను చూస్తున్న నేటి తరానికి, మన వద్ద పాతబడిపోయిన ఫార్ములా కథలను అందించడం విడ్డూరంగా మారింది.
ఇది కూడా చదవండి: మగవాళ్ళ పీరియడ్స్ పై శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు: కారవాన్‌లో జరిగింది ఇదే!
సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్, కలర్‌ఫుల్ పాటలు, నాలుగు ఫైట్లు మాత్రమే కాదు. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుడి హృదయానికి హత్తుకోవాలి. కానీ 2026 ప్రారంభం నుండి విడుదలైన చాలా చిత్రాల్లో 90% సన్నివేశాలు కేవలం నిడివి పెంచడానికే పెట్టినట్లుగా కనిపిస్తున్నాయి. సరైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లేకుండా, స్క్రిప్ట్ స్టేజిలోనే సరిదిద్దుకోవాల్సిన వందలాది లోపాలను సరిదిద్దకుండా నేరుగా సెట్స్ పైకి వెళ్లడం వల్ల కోట్లాది రూపాయల బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరవుతోంది. కేవలం స్టార్ క్యాస్టింగ్ ఉంటే చాలు, ప్రమోషన్లతో ఐదు రోజుల పాటు జనాన్ని థియేటర్లకు రప్పించవచ్చు అనుకోవడం పొరపాటు. ప్రేక్షకుడి తెలివితేటలను తక్కువగా అంచనా వేస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రతి శుక్రవారం వస్తున్న బాక్సాఫీస్ లెక్కలే నిరూపిస్తున్నాయి.
.webp)
ఇప్పటికైనా టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు కళ్లు తెరిచి, కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే, థియేటర్ వ్యవస్థకే పెద్ద గండం పొంచి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అంటారు తెలివిగలవాడిని కనిపెట్టాలంటే అంతకంటే తెలివైన వాడు ఉండాలి అని. ఆ ఇద్దరే దర్శక, నిర్మాత. ఓల్డ్ డేస్ లో అత్యద్భుతమైన సినిమాలు రావడానికి,ఇప్పటికీ మనల్ని అలరిస్తూ ఉండటానికి పైన చెప్పుకున్న ఫార్ములానే కారణం. ఇప్పుడు అంతా నడుస్తుంది 'షో'.. అందుకే 'షో' నచ్చటం లేదు.
మీకు నచ్చవచ్చు : శ్రీకాంత్ ఓదెల ద్వీతీయ గండం దాటుతాడా!
[Telugu Movies Story Quality Decline, This Week Telugu Cinema Releases, telugu movie quality, tollywood box office, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]






