
లేదు... 'మీ టూ' మంటలు ఇంకా చల్లారలేదు. లైంగికంగా వేధింపబడిన మహిళల్లో ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు. రగులుతూనే ఉంది. భారతదేశంలో 'మీ టూ' ఉద్యమం ఇంత ఉదృతంగా సాగడానికి కారణమైన హిందీ నటి తనూ శ్రీ దత్తా మరోసారి 'మీ టూ'తో వార్తల్లోకి వచ్చారు. అమెరికా వెళ్లిపోయిందనుకున్న ఆమె అనూహ్యంగా మరో ప్రకటన చేశారు. 'మీ టూ'కు మద్దతుగా ఓ షార్ట్ ఫిలిం తీస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ షార్ట్ ఫిలిం విడుదల చేయనున్నారు. ఇందులో తనూ శ్రీ దత్తా నటించడమే కాదు.. డైలాగ్స్ కూడా రాశారట. గతంలో నానా పటేకర్ మీద నేరుగా లైంగిక ఆరోపణలు చేసిన ఆమె, షార్ట్ ఫిలిం ద్వారా ఎవరిని టార్గెట్ చేశారోనని హిందీ ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. హిందీ సినిమా ఇండస్ట్రీలో తనూ శ్రీ దత్తా 'మీ టూ' ఉద్యమానికి ఊపిరి పోస్తే.. దక్షిణాదిలో ప్రముఖ గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి 'మీ టూ'కి మద్దతుగా, ధైర్యంగా ముందుకొచ్చారు. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారని వెల్లడించారు. ఆయన వల్ల వేధింపబడ్డ ఇతరులకూ అండగా నిలిచారు. ఈ పరిణామాలతో చిన్మయికి నష్టమే జరిగింది. ఆమెను తమిళనాడు డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాల్సిందిగా కేంద్రమంత్రి మేనకా గాంధీని ట్విట్టర్ లో అభ్యర్ధించారు చిన్మయి. "మేడమ్... వైరముత్తు నన్ను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసి నాలుగు నెలలు అయ్యింది. ఆయనపై చర్యలు తీసుకోకపోగా... నన్ను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. నేను కేసు పెట్టలేను. నాకు ఒక దారి చూపించండి" అని చిన్మయి ట్వీట్ చేశారు. ఆమెకు మేనకా గాంధీ బదులు ఇచ్చారు. "మీ కేసును జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళతా. మీ వివరాలు పంపించండి" అని మేనకా గాంధీ ట్వీట్ చేశారు. అలాగే, హిందీలో అలోక్ నాథ్ ఎప్పుడో నటించిన సినిమాను ఇప్పుడు విడుదల చేయాలని నిర్ణయించడంపైనా విమర్శలు వస్తున్నాయి. అలోక్ నాథ్ తనను లైంగికంగా వేధించారని ఆయనతో పని చేసిన ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే.






