తమిళ సినీ పరిశ్రమలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ సినీ ప్రముఖుడు కె. రాజన్ (85) ఆదివారం సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డారు. చెన్నైలోని అడయార్ నదిలోకి దూకి ఆయన ప్రాణాలు తీసుకోవడం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎప్పుడూ సినీ సమస్యలపై నిర్మొహమాటంగా, ధైర్యంగా మాట్లాడే రాజన్ ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం అందరినీ కలచివేస్తోంది.
పోలీసుల సమాచారం ప్రకారం, కె. రాజన్ నిన్న సాయంత్రం తన వ్యక్తిగత డ్రైవర్‌తో కలిసి కారులో అడయార్ నదిపై ఉన్న తిరు-వి-కా వంతెన ప్రాంతానికి చేరుకున్నారు. డ్రైవర్‌తో కొద్దిసేపు నడిచి వస్తానని చెప్పి కారు దిగిన ఆయన, వంతెనపైకి వెళ్లిన వెంటనే ఒక్కసారిగా నదిలోకి దూకేశారు. కంగారుపడిన డ్రైవర్ సమాచారం ఇవ్వడంతో ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టాయి. చివరకు నది నుంచి ఆయన మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాజన్ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే గత కొంతకాలంగా ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధతో సతమతమవుతున్నారని, ఆ మనస్తాపంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ ఘటనపై అడయార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
కె. రాజన్ సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 1983లో వచ్చిన 'బ్రమ్మచారిగళ్' సినిమాతో ఆయన నిర్మాతగా అడుగుపెట్టారు. ఆ తర్వాత 'ఆవళ్ పాపం', 'నినైక్కాద నాళిలై' వంటి చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన 'నమ్మ ఊరు మరియమ్మ', అలాగే 'ఉణర్చిగళ్' వంటి చిత్రాలకు ఆయన దర్శకుడిగానూ వ్యవహరించారు. 'తంగమాన తంగచ్చి' వంటి సినిమాలకు కథను కూడా అందించారు.
నటనపై ఉన్న మక్కువతో కె. రాజన్ ఇటీవల కాలంలోనూ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 'పాంబు సట్టై', 'తుణివు', 'బకాసురన్' సహా దాదాపు 18కి పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. సినిమా వేదికలపై ఇండస్ట్రీ బాగోగుల గురించి, చిన్న సినిమాల మనుగడ గురించి ఆయన చేసే ప్రసంగాలు ఎంతోమందిని ఆలోచింపజేసేవి.
రాజన్ అకస్మాత్తుగా మరణించారనే వార్త తెలియగానే సామాజిక మాధ్యమాల్లో కోలీవుడ్ అభిమానులు, నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు పెద్ద దిక్కులా ఉంటూ, ఎంతో యాక్టివ్‌గా ఉండే ఒక సీనియర్ మేకర్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం జీర్ణించుకోలేకపోతున్నామంటూ సినీ ప్రియులు పోస్టులు పెడుతున్నారు.
ఈ విషాద వార్తతో తమిళ చిత్రసీమలో నిశ్శబ్దం ఆవరించింది. పలువురు సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు రాజన్ భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత వెల్లడి కానున్నాయి.




