
సూర్య నుంచి మరోసారి ఓ విభిన్నమైన సినిమా రాబోతున్నట్లు ‘సీన్’ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. అయితే ఇది ‘సింగం’ తరహా రెగ్యులర్ పోలీస్ యాక్షన్ సినిమా మాత్రం కాదని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. మర్డర్ మిస్టరీ, డార్క్ కామెడీ, ఊహించని మలుపులతో కథను నడిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ట్రైలర్ ప్రారంభంలోనే సూర్య పాత్రను పరిచయం చేశారు. ఆయన డీఎస్పీ ఇన్బరాజ్‌గా కనిపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో తనదైన శైలిలో వ్యవహరించే ఇన్బరాజ్.. ఓ దశలో ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటాడు.
కానీ ఆయన పైఅధికారి స్టీఫెన్ (లాల్) మాత్రం ఇన్బరాజ్ను తిరిగి విధుల్లోకి రావాలని పదేపదే కోరుతుంటాడు. అతను స్పందించకపోవడంతో చివరకు పోలీసులను ఇంటికి పంపించే పరిస్థితి వస్తుంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం చేస్తావని లాల్ అడగగా.. "రాజకీయాల్లోకి వెళ్తా" అని సూర్య బదులివ్వడం హైలైట్ గా నిలిచింది.
ఇక్కడే సూర్య పాత్రలోని కామెడీ టైమింగ్ కనిపిస్తుంది. ఉద్యోగాన్ని వదిలేయాలనుకునే వ్యక్తి.. మళ్లీ ఓ కేసు కోసం పోలీస్ వ్యవస్థలోకి రావాల్సి వస్తుంది. ఇన్బరాజ్ పాత్రలోని నిర్లక్ష్య ధోరణి, విచిత్రమైన ప్రవర్తన, అధికారుల ఆదేశాలను పట్టించుకోని తీరు నవ్వులు పూయించేలా ఉన్నాయి. అదే సమయంలో అతడి వెనుక ఓ బలమైన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడనే విషయం కూడా అర్థమవుతోంది.
ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ మలయాళ నటుడు నస్లెన్. ఆయన ఈశ్వరన్ అనే సైకో కిల్లర్ తరహా పాత్రలో కనిపిస్తున్నారు. తెలివైన వ్యక్తిగా, ఏ మాత్రం కనికరం లేని క్రిమినల్‌గా ఈ పాత్రను పరిచయం చేశారు. ఇన్బరాజ్కు ఈశ్వరన్ పెద్ద సవాల్‌గా మారడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి పోరు జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
‘రోమాంచం’, ‘ఆవేశం’ సినిమాలతో మలయాళంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీతూ మాధవన్.. ఇప్పుడు సూర్యతో తన తొలి తమిళ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన గత సినిమాల్లో కనిపించిన విభిన్నమైన పాత్రలు, డార్క్ హ్యూమర్, సహజమైన కామెడీ ఈ సినిమాలోనూ కనిపించేలా ఉన్నాయి. ట్రైలర్ చివర్లో వచ్చే ‘సింగం’ ప్రస్తావన కూడా అభిమానులకు నవ్వులు పంచేలా ఉంది.
మొత్తానికి ‘సీన్’ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా.. ‘ఆవేశం’ తరహాలో ప్రేక్షకులను అలరిస్తుందా? అనేది చూడాలి.
ఇది కూడా చదవండి: ‘ఇరుముడి’కి కొత్త చిక్కులు.. నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు
Click Here To Watch Scene Movie Trailer
[Suriya Scene Trailer Analysis, Suriya Scene Trailer Review, Suriya Scene Movie, Suriya New Movie, Scene Movie Story, Jithu Madhavan, Naslen, Nazriya Nazim]




