
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కరుప్పు' (Karuppu) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. అనేక ఆర్థిక ఇబ్బందులు, విడుదల అడ్డంకులను అధిగమించి మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం ఎనిమిది రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరి సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
కరుప్పు చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన గణాంకాలను నమోదు చేసింది. కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200.86 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. భారతీయ మార్కెట్‌లో మొదటి వారంలో రూ. 113.85 కోట్ల నెట్ వసూలు చేయగా, ఎనిమిదో రోజు నాటికి దేశీయంగా మొత్తం రూ. 121.65 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. అలాగే ఇండియా గ్రాస్ వసూళ్లు రూ. 140.86 కోట్లకు చేరాయి.
ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా సత్తా చాటుతూ రూ. 60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద గత తొమ్మిది నెలలుగా ఉన్న డ్రై స్పెల్‌కు ఈ చిత్రం బ్రేక్ వేసింది. గత ఏడాది ఆగస్టులో వచ్చిన రజనీకాంత్ 'కూలీ' చిత్రం తర్వాత తమిళనాడులో రూ. 100 కోట్ల నెట్ మార్కును దాటిన మొదటి చిత్రంగా 'కరుప్పు' నిలిచింది. తమిళనాడు హిస్టరీలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన 24వ చిత్రంగా ఇది రికార్డు కెక్కింది.






