
2019లో తమిళంలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన చిత్రం 'సూపర్ డీలక్స్'. త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ కోసం 'ఆహా' డబ్బింగ్ చేసి విడుదల చేయనుంది.
ఈ చిత్రాన్ని ఆగష్టు 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది 'ఆహా'. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నలుగురి జీవితాల్లో ఒకే సమయంలో జరిగే వేర్వేరు సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఓ పెళ్లైన జంట అనుకోకుండా జరిగిన హత్యను దాచాలనుకోవడం, అడల్డ్ సినిమాలో నటించిన ఓ మహిళ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకోవడం, ఓ వ్యక్తి లైంగిక సంబంధమైన సమస్యలు, మతాన్ని గొప్పగా నమ్మే ఓ వ్యక్తి కొంతమంది యువకుల జీవితాలను పాడుచేయాలనుకోవడం ఇలా ఈ అంథాలజీ వేర్వేరు కథలను ప్రేక్షకులకు పరిచయం చేసింది.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో తను పోషించిన పాత్రకుగాను బెస్ట్ సపోర్టింగ్ రోల్ కేటగిరిలో జాతీయ అవార్డును దక్కించుకున్నారు. ఇక సమంత ఇందులో ఊహించని పాత్రలో కనిపించి మెప్పించింది. తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.







